Working Hours | ఒకరేమో వారానికి 70 గంటలు పనిచేయమంటారు. మరొకరు ఇంకో అడుగు ముందుకేసి 90 గంటలు పనిచేయమంటారు. దేశం అభివృద్ధి పథంలో పయనించేందుకు ఉన్న ఒకే ఒక్క మంత్రం ఇదేనంటారు. కానీ, వారానికి 48 గంటలు పనిచేస్తూనే ప్రపంచం నివ్వెరపోయే ప్రగతి సాధించామన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారు. అంతేకాదు, రోజంతా ఆఫీసుల్లోనే ఉండి రోబోల్లా పనిచేస్తూ పోతే దేశం అభివృద్ధి సంగతి దేవుడెరుగు, తలెత్తే మానసిక, ఆరోగ్య సమస్యల సంగతేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారు.
ఉద్యోగులు వారానికి 70 గంటలు పనిచేస్తే దేశం గొప్ప పురోగతి సాధిస్తుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతంలో ప్రకటించి దేశవ్యాప్త చర్చకు కారణమయ్యారు. తాజాగా, ఎల్అండ్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ ఒకడుగు ముందుకు వేసి వారానికి 90 గంటలు పనిచేయాలని సెలవిచ్చి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశారు. నిజానికి ఫ్యాక్టరీల చట్టం 1948 ప్రకారం వారానికి 48 గంటలు మించి పనిచేయకూడదు. ఈ చట్టాలను అనుసరిస్తూనే 75 ఏండ్లలో దేశం అనూహ్య ప్రగతి సాధించింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు కార్పొరేట్ దిగ్గజాలు భారత శ్రామికులను వారానికి 70 నుంచి 90 గంటలు పనిచేయాలని సూచించడం ఎంతమాత్రం హేతుబద్ధంగా, ఆచరణాత్మకంగా కనిపించడం లేదు. సుబ్రహ్మణ్యన్ చెప్తున్న దాని ప్రకారం వారానికి 90 గంటలు పనిచేయడమంటే రోజుకు 12 గంటలకు పైగా శ్రమపడాల్సి ఉంటుంది. నారాయణమూర్తి 70 గంటల ప్రతిపాదనను ఎంతోమంది విమర్శించారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యన్ అంతకుమించి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సోషల్ మీడియా ఆయనపై జోక్స్, మీమ్స్‌తో విరుచుకుపడింది. గతంలో ఎలాన్ మస్క్, జాక్ మా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి విమర్శల పాలయ్యారు.
48 గంటల పని విధానం దేశంలో కొనసాగుతున్నప్పటికీ నగర, పట్టణ ప్రాంతాల్లోని కంపెనీ ఉద్యోగులు తగిన వేతనం పొందకుండానే పరిమితికి మించి పనిచేస్తున్న మాట వాస్తవం. ఉద్యోగులు కష్టపడి పనిచేస్తూ దేశాన్ని ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి తీసుకెళ్లారు. సాధారణ పనిదినాల అమలు చట్టాలు వర్తించని రీతిలో 88 శాతం మంది భారత ఉద్యోగులను కంపెనీలు నియమించుకుంటున్నాయని ఇండీడ్ అనే గ్లోబల్ సంస్థ సర్వేలో తేలింది. ప్రభుత్వ సెలవు దినాలు, సిక్ లీవ్‌లో ఉన్నప్పుడు కూడా కంపెనీ యాజమాన్యాలు తమతో పనిచేయించుకుంటున్నాయని 85 శాతం మంది ఉద్యోగులు చెప్పినట్టు సర్వే పేర్కొన్నది. విధులు ముగిశాక యాజమాన్యాలు పంపే సందేశాలకు స్పందించకుంటే ప్రమోషన్లు వంటి ప్రయోజనాలను ఎక్కడ కోల్పోతామోనన్న భయం ఉద్యోగులను వెంటాడుతూ ఉంటుంది. కొన్ని రంగాల్లో ఉద్యోగులు ఇప్పటికే పనికి సంబంధించి కంపెనీ ఆదేశాలు పాటించేందుకు రోజంతా అందుబాటులో ఉంటున్నారు. కొందరు అదనపు జీతభత్యాలు పొందకుండానే నిర్దేశిత పని గంటలకు మించి శ్రమపడుతున్నారు. కానీ, పదిహేను అగ్రశ్రేణి గ్లోబల్ టెక్ కంపెనీల ఉద్యోగులు వారానికి 50 గంటల లోపే పనిచేస్తుండటం గమనార్హం. ‘ఓవర్‌టైమ్’ కారణంగా అత్యధిక మరణాలు సంభవించే దేశాల్లో ఇండియా ముందు వరుసలో ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్త సర్వేలో వెల్లడైంది.
సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఎల్అండ్టీ స్పందించింది. అసాధారణ ఫలితాలు సాధించేందుకు అసాధారణ ప్రయత్నాలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడానికి మాత్రమే సుబ్రహ్మణ్యన్ ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చింది. అభివృద్ధి చెందిన దేశంగా ఇండియాను ముందుకు తీసుకెళ్లడానికి మరింత అంకితభావంతో పనిచేయాలనేదే ఎల్ అండ్ టీ లక్ష్యమని, కంపెనీ ఉద్దేశాన్ని, విస్తృత లక్ష్యాలను చైర్మన్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక నారాయణమూర్తి వారానికి 70 గంటల పని విధానం ప్రతిపాదనపై ప్రముఖ ఐటీ కంపెనీ జోహో కార్పొరేషన్ సీఈవో శ్రీధర్ వెంబూ తీవ్రంగానే స్పందించారు.
‘జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, చైనాలు మితిమీరిన శ్రమతో అభివృద్ధి సాధించాయి. ఇవి తమ ప్రజలను శిక్షించే స్థాయిలో పనిభారం మోపాయి. ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో రెక్కలుముక్కలు చేసుకుని జనం పనిచేసిన కారణంగా ఈ దేశాల్లో జనాభా బాగా తగ్గిపోతున్నది. ఫలితంగా అక్కడి ప్రభుత్వాలే ప్రజలను ఇంకా ఎక్కువ పిల్లలను కనండి అని వేడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది’ అని విరుచుకుపడ్డారు. ఎక్కువ గంటలు కష్టపడి పనిచేస్తూ అభివృద్ధి సాధించిన దేశాల్లోని ప్రజలు వృద్ధాప్యంలో ఒంటరిగా బతకాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. కంపెనీల రథసారథులు కొద్దిమంది ఎక్కువ గంటలు పనిచేస్తే చాలని, ఉద్యోగులంతా ఒళ్లు హూనం చేసుకుని శ్రమిస్తే వ్యతిరేక ఫలితాలు తప్పవని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక ప్రగతిలో ఇండియాకు చైనా ఎన్నటికీ ఆదర్శం కాకూడదని వెంబూ చేసిన హెచ్చరిక హేతుబద్ధంగా కనిపిస్తున్నది.
మూర్తి, సుబ్రహ్మణ్యన్ చెప్పినట్టు రోజుకు అందరూ సగటున పది గంటలు పనిచేస్తే ఆయుష్షు కూడా తగ్గిపోయే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. అధిక పనిగంటల వల్ల మానసిక, శారీరక ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు సామాజిక జీవితం అంటూ ఏమీ మిగలదన్నది అత్యధికుల మాట. భారత శీఘ్ర ఆర్థిక ప్రగతికి ఈ ఇద్దరు దక్షిణాది కార్పొరేట్ దిగ్గజాలు ఒకే తీరున సూచించిన పరిష్కార మార్గాలను పరిశీలిస్తే ఇండియాలో 1970, 80లలో ప్రచారంలో ఉన్న ఒక వింత పుక్కిటి పురాణం పాత తరం వారికి గుర్తుకొస్తున్నది. అప్పట్లో జపాన్ అనేక రంగాల్లో అమెరికా, ఐరోపా దేశాలను తలదన్నే రీతిలో ఆర్థికాభివృద్ధి సాధించడం మొదలైంది. దానికి కారణం జపాన్‌లో కార్మికులకు కంపెనీల యాజమాన్యాలపై అసంతృప్తి, ఆగ్రహం వస్తే పని బంద్ చేసి సమ్మెలకు దిగకుండా ఫ్యాక్టరీల్లో ఎక్కువ గంటలు పని చేసేవారనే ప్రచారం దేశవ్యాప్తంగా నడిచింది.
– నాంచారయ్య మెరుగుమాల