బియ్యం రేటులో రైతుకు దక్కిందెంత?!
‘సన్నబియ్యం ధర రూ.95 రూపాయలకు పెరిగింది.. నా వల్లే!’ అని సీఎం రేవంత్‌రెడ్డి గొప్పగా చెప్పుకొంటున్నారు. బియ్యం రేటు పెరగడం గొప్ప అనుకుంటే అలా పెరిగిన పుణ్యమంతా సీఎమ్మే మూటగట్టుకోనీ.
‘సన్నబియ్యం ధర రూ.95 రూపాయలకు పెరిగింది.. నా వల్లే!’ అని సీఎం రేవంత్‌రెడ్డి గొప్పగా చెప్పుకొంటున్నారు. బియ్యం రేటు పెరగడం గొప్ప అనుకుంటే అలా పెరిగిన పుణ్యమంతా సీఎమ్మే మూటగట్టుకోనీ. కానీ ఆ బియ్యాన్ని పండించిన రైతన్నకు దక్కిన లాభమెంతో కూడా చెప్తే అన్నదాతలు పులకించిపోతరు కదా! పగలనకా, రాత్రనకా, ఎండనకా, వాననకా మట్టిలో మట్టయి పంట పండిస్తరు రైతులు. అప్పులు చేసి విత్తనాలు తెస్తరు, ఎరువుల కోసం ఎన్నో అవస్థలు పడుతరు, కూలీలకు పైసలియ్యలేక తిప్పలు పడుతరు.
తీరా వడ్లు చేతికొస్తే కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తరు. తాలు పేరుతో కోతలు, తేమ పేరుతో కొర్రీలు.. రైతన్నకు మాత్రం కంటినిండా కన్నీళ్లు, జేబునిండా అప్పులే! మరి సన్నబియ్యం కేజీ రూ.95 అయితే ఆ పైసలతో రైతన్న ఇంట్లో గుమ్మీలు నింపుకొన్నడా? అదేం లేదు కదా! పండించేటోళ్లు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. మధ్యలో దళారులు మాత్రం కుర్చీల్లో కూసొని లాభాల పంటలు పంచుకుంటున్నారు. చెమటోడ్చినోళ్లకు చిల్లిగవ్వ దక్కుతలేదు. ఇదేనా రైతన్నకు దక్కుతున్న రాజభోగం? బ్రోకర్ల దోపిడీని సర్కారీ ఘనతగా చెప్పుకోవడం సీఎం తెవివితేటలు ఎంత గొప్పవో తెలియజేస్తున్నది.
నీళ్లు ఆంధ్రకు.. నీతులు ప్రజలకు!
రేవంత్ సర్కార్ తీరు చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి! లెక్కలు చూస్తేనేమో వర్షపాతం లోటు తెలంగాణాలో తక్కువే కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ర్టాల్లో లోటు ఎక్కువే ఉన్నా, అక్కడ రైతుల హాహాకారాలు ఇంతగా లేవు! మరి మన తెలంగాణలనే కరెంటు కష్టాలు, నీళ్ల గోసలు ఎందుకని ఆలోచించి.. ఇదంతా ప్రకృతి మహిమే అనుకుంటే పొరపాటే సుమీ! ఏడాది ముందునుంచే ఎల్ నినో ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరికలు వస్తున్నయ్. అయినా సర్కార్‌కు చెవికెక్కినట్టు లేదు. నీళ్లు ఆంధ్రాకు తరలిపోయినయి. ఇదంతా చోద్యం చూసిన పాలకులు పంప్ హౌస్‌లతో నీటిని ఎత్తాలని ఆలోచించలేదు.
అప్పుడు నీళ్లను ఒడిసిపట్టే తెలివి లేకపాయె.. ఇప్పుడు మాత్రం చుక్క నీళ్ల కోసం జనం అల్లాడుతుంటే ఉపదేశాలు మొదలుపెట్టిండ్రు ముఖ్యమంత్రివర్యులవారు! కనీసం నెల రోజులు నీళ్లు ఎత్తిపోయలేక, పదినెలల కరువును ప్రజల నెత్తిన రుద్దుతుండ్రు! చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్టు, సీజన్ అంతా గడిచిపోయాక సర్కార్ నిద్ర లేచినట్టు నటిస్తున్నది. ఇప్పుడు తాగునీళ్లు లేవంటరు, సాగునీళ్లు ఇవ్వలేమంటరు, కరెంటు పొదుపుగా వాడాలంటరు. ఏసీలు వేయొద్దంటరు, లైట్లు వెలిగించొద్దంటరు! ప్రకృతి విపత్తుల్ని ముందే పసిగట్టి సిద్ధపడటం పాలకుల బాధ్యత కాదా? నీళ్లను ఇడిసిపెట్టి, ఇప్పుడు ప్రజలకు నీతులు చెప్పడం ఏం పాలనయ్యా బాబూ? బాబు చెప్పినట్టు నడిచే పాలననా?
సర్వీస్ నుంచి దిగిపోతే గతేంటి?
తెలంగాణలో కాంగ్రెస్ పాలన చూస్తుంటే ఓ సామెత గుర్తుకొస్తున్నది. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత! డ్యూటీలో ఉండే పోలీసులకే వైద్యం అందించలేని దుస్థితి ఉంటే, ఇక సామాన్యుల ఆరోగ్యానికి దిక్కెవరు మహాశయా? సర్వీసులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ దేవసోత్ శంకర్ నాయక్ అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతుంటే, ఈహెచ్ఎస్ సౌకర్యం సమయానికి అందకపోవడం ఎంత దారుణం! అడ్వాన్స్ డబ్బులు కట్టలేదని దవాఖానలో వైద్యం కోసం ఇబ్బందులు పడాల్సిన దుస్థితి.
చివరికి తోటి ఉద్యోగులే చందాలు వేసుకొని చికిత్స చేయించాల్సి వచ్చిందంటే, ప్రభుత్వ ఆరోగ్య భద్రత ఏ మూలకు పోయినట్టో! బహుశా రేవంత్‌కు తెలుసేమో! కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు అమలులో ఉన్న పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఉద్యోగుల సంక్షేమం కాగితాల మీద బాగుంటే సరిపోదు కదా! ఆపదొచ్చినప్పుడు ఆదుకోవాలె గానీ, ఫైళ్లను ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్‌కు తిప్పుకొంటూ రోగి ప్రాణాలతో దోబూచులాడుడేంది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం మానవత్వానికి నిదర్శనం. బీఆర్ఎస్ బృందం దవాఖానను సందర్శించిన తర్వాతే ఈహెచ్ఎస్ అధికారులు మేల్కొన్నారు. ప్రభుత్వం రాజకీయ కక్షలతో కేసులు, అరెస్టుల మీద చూపించే శ్రద్ధలో సగమైనా ఉద్యోగుల ఆరోగ్య భద్రత మీద పెడితే బాగుంటది కదా! సర్వీసులో ఉన్న పోలీసుకే ఈ గతి పడితే, రిటైరైన ఉద్యోగుల పరిస్థితి ఇంకెంత దయనీయమో!
ఫామ్ హౌస్ ఫైలుతోనే టైమ్ పాస్!
రేవంత్ పాలనలో కామెడీకి కొదువ లేదని మల్లమల్ల రుజువైతున్నది. మొన్నటిదాకా కేసీఆర్‌ది వెయ్యెకరాల ఫామ్ హౌస్ అంటూ గాలి మాటలతో గోల చేసినోళ్లే, ఇప్పుడు ఆ ఆరోపణలను నిజమని నిరూపించలేక నానా తంటాలు పడి చివరాఖరికి అరవై ఏడెకరాల దగ్గరికి వచ్చిండ్రు. అందులోనూ ఎలాంటి ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు లేవని తేలింది. ఇప్పుడు కాంగ్రెసోళ్లకు మాటలు రావడంలేదు. ఈ ముచ్చట కూడా ఎక్కడా మాట్లాడే ధైర్యం చేస్తలేరు. అడ్డమైనోళ్లంతా ఆరోపణలు చేస్తరు, కానీ ఆధారాలు చూపిస్తేనే కదా నిలబడేది. గాలిలో మేడలు కట్టినోళ్లు, ఇప్పుడు ఆ మేడలకు పునాదులు వెతుకుతున్నరు. ఇక కొండపోచమ్మ సాగర్ కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్ బావి నింపడానికి అన్నట్టు మాట్లాడితే, పిట్టలదొరలు కూడా పగలబడి నవ్వుతరు.
లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే ప్రాజెక్టును పట్టుకొని, ఎవరో ఒకరి బావి కోసమే కట్టినట్టుగా కట్టుకథలు అల్లితే ఎవరు నమ్ముతరు? ప్రాజెక్టుల ప్రయోజనాలపై చర్చించాల్సింది పోయి, బావుల చుట్టూ రాజకీయాలు తిప్పడం కూడా ఓ పాలననేనా?! కాంగ్రెస్ నేతలు ఇంకో నాలుగు రోజులు టైమ్‌పాస్ చేయడం కోసం కొత్త డ్రామా షురూ చేసినా చేస్తరేమో! ‘రామగుండం నుంచి కరెంట్ లైన్లు వేసింది కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే.. విచారణ జరుపుతాం’ అని మరో పొంగులేటి బ్రాండ్ బాంబు పేల్చినా పేల్చుతారేమో! ప్రజలకు కావాల్సింది కరెంటు, నీళ్లు, రైతులకు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు. కానీ పాలకుల దృష్టంతా పనికిరాని ఆరోపణల కోసమే అయితే ఎట్లా? తప్పులు జరిగినట్టు చెప్పి ఆధారాలు చూపకపోతే, జనం ఛీకొడుతారనే ఆలోచనైనా ఉండకపోతే ఎట్ల? కాంగ్రెసోళ్లకు అంత సోయి ఉంటే మన బతుకులు ఇట్లెందుకు ఉంటుండే కనీ!
-దాము నర్మాల
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

