ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజసూయ యాగం చేశాడు. అతని సభావైభవం చూసి అసూయపడి తండ్రి దగ్గరకు వెళ్లి తన దుగ్ధ వెళ్ళబోసుకున్నాడు దుర్యోధనుడు. ‘నాయనా! నీకు మాత్రం తక్కువ ఐశ్వర్యముందా? అయితే ధర్మరాజు నీకంటే ఎక్కువగా ప్రకాశించడానికి కారణం అతడు శీలవంతుడు కావడమే. శీలవంతులను లక్ష్మి వరిస్తుంది. కనుక నువ్వు కూడా శీలవంతుడవై సకల సంపదలూ పొందు’ అంటూ ధృతరాష్ట్రుడు కొడుక్కి ఓ ఇతిహాసం చెప్పాడు.
‘ప్రహ్లాదుడు రాక్షస కులశ్రేష్ఠుడు. సకల విద్యాపారంగతుడు. జనరంజకంగా పరిపాలన చేయగల సమర్థుడు. ఇంద్ర రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ముల్లోకాలనూ ధర్మయుక్తంగా పరిపాలించసాగాడు. పదవీభ్రష్టుడైన ఇంద్రుడు తనకు ముల్లోకాధిపత్యం మళ్లీ వచ్చే విధానం చెప్పవలసిందని బృహస్పతిని ప్రార్థించాడు. బృహస్పతి భార్గవుణ్ని అడగమన్నాడు. ఇంద్రుడు వెళ్లి భార్గవుణ్ని ఆశ్రయించాడు. ‘అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో ప్రహ్లాదుడినే అడిగి తెలుసుకుని, ఉపాయంగా ఆ శక్తిని అడిగి పుచ్చుకో’ అని సలహా ఇచ్చాడు భార్గవుడు. ‘ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషం ధరించి ప్రహ్లాదుడికి శిష్యుడై భక్తితో సేవలు చెయ్యడం ప్రారంభించాడు. చాలాకాలం గడించింది. ప్రహ్లాదుడు ప్రసన్నుడయ్యాడు. ‘నాయనా! ఏమి కోరి నన్ను సేవిస్తున్నావు?’ అని అడిగాడు.
‘అయ్యా! మీకు త్రిలోకాధిపత్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఉంది’ అన్నాడు శచీపతి వినయంగా.
‘ఏముంది! నేనెప్పుడూ రాజునని గర్వంతో ప్రవర్తించను. ఎవరినీ నొప్పించను. ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ మొదలైన దుర్గుణాలేవీ మనసులోకి రానివ్వను. ఎవరన్నా ఏదైనా అడిగితే లేదనకుండా సంతోషపెడతాను. పురాకృత పుణ్యం వల్ల బ్రహ్మర్షులు మెచ్చుకునే శీలం ఉన్నది. కనుక నాకు ఇంత మహోన్నత పదవి లభించింది’ అన్నాడు ప్రహ్లాదుడు.
‘అయ్యా! నిజంగా నువ్వు మహాత్ముడవు. దానశీలివి. నాపై దయదలచి నీ శీలం నాకివ్వు’ అని ఇంద్రుడు దీనంగా యాచించాడు. ‘అయ్యో పాపం! ఎంత దీనంగా అర్థిస్తున్నాడు’ అనుకుని ‘సరే’ అన్నాడు ప్రహ్లాదుడు. ఇంద్రుడు పన్నాగంలో ప్రహ్లాదుడు చిక్కుకున్నాడు. ఆ తరువాత ప్రహ్లాదుడి శరీరంలోంచి మహాతేజస్సుతో ఒక పురుషుడు బయటకు వచ్చాడు.
‘నువ్వెవరు?’ అని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు. ‘నేను నీ శీలాన్ని. నువ్వు నన్ను ఆ విప్రుడికి దానం చేశావుగా! అతని దగ్గరకు వెళ్లిపోతున్నాను’ అని వెనుదిరగకుండా వెళ్లిపోయాడా దివ్యరూపుడు. ఆ వెనుకే ఒక్కొక్క వెలుగూ ప్రహ్లాదుడి శరీరం నుంచి మెల్లిగా బయటకు జారుకుంది. ‘నువ్వెవరు మహానుభావా?’ నేను సత్యాన్ని, శీలాన్ని ఆశ్రయించి ఉంటాను. నేను వెళుతున్నాను’ అని సత్యం సమాధానమిచ్చింది. తర్వాత సత్యాన్ని ఆశ్రయించి బతికే రుజువర్తన, సత్ప్రవర్తనకు అండగా నిలిచే బలం ఇలా ఒక్కొక్కటీ బయటికి వెళ్లిపోయాయి.
ప్రహ్లాదుడి విచారిస్తుంటే అతిలోక సౌందర్యవతియైన ఒక స్త్రీ అతని శరీరంలోంచి బయటకు వచ్చింది. ‘అమ్మా! నువ్వెవరు?’ అని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు. దానికి ఆ స్త్రీ మూర్తి ‘నేను లక్ష్మిని. బలం ఎక్కడుంటే అక్కడ ఉంటాను. వెడుతున్నాను’ అంటుంది. ‘అయ్యో! తల్లీ! నువ్వూ నన్ను విడిచిపోతున్నావా? ఇంతకూ అంత వినయంగా ఇన్నాళ్లూ నన్ను సేవించిన ఆ విప్రుడెవరు?’ అని సిరిని అడిగాడు ప్రహ్లాదుడు.
‘అతను ఇంద్రుడు. నీ వైభవాన్ని ఎగరేసుకుపోవడం కోసం వచ్చాడు. నువ్వు ఇంద్రుడి మాయలో పడి నీ శీలాన్ని అతనికి ధారపోశావు. శీలం వల్ల ధర్మం, ధర్మం వల్ల సత్యం, సత్యాన్ని అంటి మంచి నడవడి, దానివల్ల బలం, బలాన్ని ఆశ్రయించి నేను ఉంటాం. కనుకనే అన్నిటికీ ‘శీలం’ మూలమని చెప్తారు. నువ్వు అది పోగొట్టుకున్నావు. కనుక నేను ఇక నీ దగ్గర ఉండటం అసంభవం’ అని చెప్పి వెళ్ళిపోయింది శ్రీదేవి. కనుక దుర్యోధనా! శీలవంతుడవై వర్ధిల్లు నాయనా’ అని కొడుక్కి హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు.
సకల జీవుల పట్ల దయతో ఉండటం, ఎవరికీ ద్రోహం తలపెట్టకుండా పరులకు మేలు చేయడం, ఎదుటివాడు తప్పుచేస్తే వాడు సిగ్గుపడేలా కాక తన దోషాన్ని చక్కదిద్దుకునేలా బోధించటం, అందరూ మెచ్చుకునేటట్టు మంచిగా ప్రవర్తించటం, పేరాశను విడిచిపెట్టడం శీలవంతుల లక్షణాలు.
– ప్రయాగ రామకృష్ణ