చినుకు కునుకు లేకుండా చేస్తున్నది. మబ్బులు భళ్లున బద్దలై వర్ష బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. నదులు ఉప్పొంగి పర్వతాల గుండెలను చీలుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతుంటే రహదారులు కంపిస్తున్నాయి. జలవిలయంతో జనావాసాలు పేకమేడల్లా జలనిక్షిప్తం అయిపోతున్నాయి. దేశంలో గత కొద్దివారాలుగా సంభవిస్తున్న వరదలు ప్రకృతి ప్రళయావేశానికి అద్దం పడుతున్నాయి. గత మే-జూన్ మధ్యకాలంలో దేశంలో మొదలైన వరదల తాండవం అప్రతిహతంగా కొనసాగుతున్నది. అసోం, అరుణాచల్‌ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ర్టాలు, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, పంజాబ్ వంటి ఉత్తరాది రాష్ర్టాలు భారీ వర్షాలు, ఆపై ముంచెత్తుతున్న వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. కశ్మీర్లో వరదలకు 41 మందిదాకా బలైనట్టు వార్తలు అందుతున్నాయి. అందులో 34 మంది వైష్ణోదేవి మార్గంలోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైష్ణోదేవి యాత్రను నిలిపివేశారు. చండీగఢ్-మనాలి హైవేపై రాకపోకలు ఆగిపోయాయి. అటు పశ్చిమాన మహారాష్ట్రను వరదలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా ముంబై నగరంపై వరదలు పగబట్టాయి. ఆర్థిక రాజధాని ఇంకా కోలుకోనే లేదు. ఈ పరిస్థితికి ఉత్తర-దక్షిణ, తూర్పు-పడమర తేడాలేమీ లేవు. కర్ణాటకలో ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలు వర్ష బీభత్సంతో వణికిపోతున్నాయి. అంచనాకు అందని ఆస్తుల విధ్వంసం, అసాధారణమైన జననష్టం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.
ఇటు రాష్ట్రంలోనూ గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నదులు, వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అసాధారణమైన రీతిలో పొంగిపొర్లుతున్నాయి. వరదలు చుట్టుముట్టడంతో అనేక ప్రాంతాలు జలమయమై, జనజీవితం అస్తవ్యస్తమైంది. సుమారు 15 జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉన్నది. కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో 24 గంటల్లో 44 సెంటీమీటర్ల పైచిలుకు వర్షం కురిసింది. జిల్లాలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, రోడ్లపై సంచారం నిలిచిపోయింది. సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లోనూ వర్షాలు భారీగా పడుతున్నాయి. మంజీర, ఎగువ మానేరు ఉప్పొంగుతూ ఊళ్లను ముంచెత్తుతున్నాయి. ఏ రకంగా చూసినా రాష్ట్రంలో వరదల పరిస్థితి అసాధారణంగానే ఉన్నది. ప్రభుత్వ స్పందన అందుకు తగినట్టుగా లేదు. భారీ వర్షాల గురించి వాతావరణ శాఖ కొద్ది రోజులుగా హెచ్చరిస్తున్నా సర్కారు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలు లేవు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. వరదల్లో చిక్కుకున్న బాధితులను ముందస్తు గా కాపాడటంలోనూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఓ వైపు వరద పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణ గురించి సమీక్షించడం విడ్డూరం. అది చాలదన్నట్టుగా ఒలింపిక్స్‌ను రప్పించడం గురించి అర్జెంటుగా అధికారులతో చర్చించడం ఆయన ప్రాధాన్యతలను తెలియజేస్తున్నది.
ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది? ఆస్తి, ప్రాణ నష్టం ఎంత జరిగింది? ఎంత మంది విపత్తుల్లో ఉన్నారు? వారిని బయటపడేయటం ఎలా అనేది ఆలోచించాల్సిన రేవంత్‌రెడ్డి పార్ట్-టైం సీఎం తరహాలో వ్యవహరిస్తున్నారు. తూతూమంత్రంగా ఏరియల్ సర్వే చేసి తన పని అయిపోయిందన్నట్టుగా చేతులు దులిపేసుకున్నారు. ఆయన అనుభవరాహిత్యం, అవగాహనా లోపం వల్ల చేతులు కాలిన తర్వాతైనా ఆకులు పట్టుకోని పరిస్థితి కనిపిస్తున్నది. సకాలంలో హెలికాప్టర్ రానందువల్ల రెండు నిండు ప్రాణాలు నీటిలో కలిసిపోవడం సర్కారు అలవిమాలిన నిర్లక్ష్యానికి నిదర్శనం. పెండ్లిళ్లకు, విందులకు అందుబాటులో ఉండే హెలికాప్టర్ ఆపద సమయంలో పైకి లేవకపోవడం ఎందుకో అంతుచిక్కడం లేదు. గత ప్రభుత్వ హయాంలో మొసలి కన్నీళ్లు కార్చిన కాంగ్రెస్ మంత్రులు కనీసం బాధితులను ఓదార్చడానికి, ఆదుకోవడానికి జిల్లాలకు వెళ్లకుండా అధికార సౌధాల్లో సమీక్షల పేరిట కాలక్షేపం చేస్తున్నారు. ఇక రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రకృతి బీభత్సాలు సంభవించినప్పుడు సైన్యం అందించే సహాయాన్ని తమ ఖాతాలో వేసుకుని రాజకీయాలు చేయాలని చూడటం అర్థరహితం. రాష్ట్ర సర్కారు ఇప్పటికైనా తన మొద్దునిద్ర వదిలించుకుని మరింత నష్టం జరగకుండా చర్యలు చేపట్టి, నష్టాన్ని అంచనా వేసే పనిని మొదలుపెట్టాలి. నష్టానికి తగిన సాయాన్ని కేంద్రాన్ని మెప్పించి, ఒప్పించి ఇక్కడి బీజేపీ నేతలు తేగలిగితే మంచిది.