Atmospheric River | మన దేశంలోని అనేక ప్రాంతాలను ఇటీవల భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ప్రకృతి విపత్తుల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మన దేశంతో పాటు దక్షిణాసియా ప్రాంతంలో వరదలు సాధారణమే. కానీ, వాతావరణ మార్పుల కారణంగా రుతుపవనాల వర్షపాతంలోనూ మార్పులొస్తుండటం తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నది.
అతి తక్కువ వ్యవధిలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాదు, సుదీర్ఘకాలం పాటు వర్షాలు కురవకపోవడం వంటి అసాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అతి తక్కువ వ్యవధిలోనే భారీ వర్షాలు కురవడాన్నే మేఘ విస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్) అని అంటారు. ఈ మేఘ విస్ఫోటనానికి కారణం గగన నదులు (అట్మాస్ఫియరిక్ రివర్స్) ఏర్పడటమే. వీటినే ‘ఫ్లయింగ్ రివర్స్’ అని పిలుస్తారు. ఇటీవల కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగి అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడానికి ఈ గగన నదులే పరోక్ష కారణం.
సాధారణంగా ఎండ వేడిమి వల్ల మహాసముద్రాల్లోని నీరు ఆవిరిగా మారి, ఆపై చల్లబడి మేఘాలను ఏర్పరుస్తుంది. మేఘాల్లోని నీటి బిందువులు భూమిని చేరే ప్రక్రియలో భాగంగా సాధారణంగా వర్షం కురుస్తుంది. కానీ, గ్లోబల్ వార్మింగ్ కారణంగా మహా సముద్రాల్లోని జలాలు వేడెక్కి భారీమొత్తంలో నీరు, ఆవిరిగా మారి ఆకాశంలో కంటికి కనిపించని నీటి ఆవిరిపాయలుగా ఏర్పడతాయి. వాతావరణంలోని దిగువ భాగంలో ఈ నీటి ఆవిరి భారీ పట్టీగా ఏర్పడి, వేడి ప్రాంతం నుంచి చల్లని వాతావరణం వైపు కదులుతూ ఒక్కసారిగా వర్షంగా లేదా మంచుగా కురుస్తుంది. అది భారీ వరదలకు, కొండచరియలు విరిగిపడి విధ్వంసానికి కారణమవుతుంది. ఈ గగన నదులు కొన్ని వేల మైళ్ల దూరం ప్రయాణించి భారీ వర్షాలను కురిపిస్తాయి.
ఒక గగన నది పరిమాణం సగటున 2,000 కిలోమీటర్ల పొడవు, 500 కిలోమీటర్ల వెడల్పు, 3 కిలోమీటర్ల లోతు ఉంటుంది. అయితే, వీటి పరిమాణం ఇప్పుడు మరింత భారీగా మారుతున్నది. కొన్ని 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటున్నాయి. కంటికి కనిపించని వీటిని ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీలతో చూడవచ్చు. వీటిని వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఉపగ్రహ చిత్రాలు ఉపయోగపడతాయి.
భూమి వేగంగా వేడెక్కుతుండటంతో ఈ గగన నదులు భారీ పరిమాణంలో తీవ్ర రూపాన్ని సంతరించుకుంటున్నాయని, కోట్లాది మంది జీవనాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. హిందూ మహాసముద్రం వేడెక్కడం వల్ల మన దేశంలోనూ గగన నదులు ఏర్పడి జూన్ – సెప్టెంబర్ మధ్య వచ్చే రుతుపవనాల ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు.
2023లో నేచర్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. 1951- 2020 మధ్యకాలంలో మన దేశంలో వర్షాకాలంలో మొత్తం 574 గగన నదులు ఏర్పడ్డాయి. గత రెండు దశాబ్దాల్లో ఏర్పడిన అత్యంత భారీ గగన నదులు మన దేశంలో సంభవించిన 80 శాతం వరదలకు కారణమయ్యాయని ఈ అధ్యయనం పేర్కొన్నది. ఇటీవలి దశాబ్దాల్లో హిందూ మహాసముద్రం జలాలు ఆవిరిగా మారడం గణనీయంగా పెరిగిందని, వాతావరణం వేడెక్కడం వల్ల గగన నదులు ఏర్పడి, వరదలు పెరిగాయని అధ్యయనం తెలిపింది. రుతుపవనాల సమయంలో భారత ఉపఖండం వైపు పయనించే తేమలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీకి చెందిన వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ రాక్సీ మాథ్యూ కోల్ చెప్పారు. తత్ఫలితంగా వెచ్చని సముద్రాల్లోని నీటి ఆవిరి గంటలు, రోజుల వ్యవధిలోనే గగన నదులుగా మారి అతితక్కువ సమయంలో కుండపోత వర్షం కురుస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఆకస్మిక వరదలకు, కొండచరియలు విరిగిపడటానికి కారణమవుతున్నదని అన్నారు.
అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. తూర్పు చైనా, కొరియా, పశ్చిమ జపాన్‌లో రుతుపవనాల ప్రారంభ కాలంలో (మార్చి – ఏప్రిల్) 80 శాతం వరకు భారీ వర్షపాతానికి గగన నదులతో సంబంధం ఉందని గుర్తించారు. తుపానుల మాదిరిగానే గగన నదులలో వాటి పరిమాణం, తీవ్రత, వాటి వల్ల సంభవించే వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదకర పరిస్థితుల ఆధారంగా వాటిని ఐదు రకాలుగా వర్గీకరించారు. వీటిలో అన్నీ ప్రమాదకరమైనవి కావు, ప్రత్యేకించి తీవ్రత తక్కువగా ఉన్నవి. ఈ గగన నదులు సుదీర్ఘకాలంగా కరువు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో వర్షాలను కురిపిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రకృతి విపత్తులకు మూలకారణం వాతావరణ మార్పులే. పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను మండించడం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్నది. తద్వారా వాతావరణ మార్పులు సంభవించి తీవ్రనష్టం జరుగుతున్నది. కాబట్టి పర్యావరణ అనుకూల ఇంధనాలను వాడాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, దాంతో పాటు మొక్కలను విరివిగా నాటాలి. తద్వారా గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించవచ్చు. వరదలు, కొండచరియలు విరిగిపడటం లాంటి ప్రకృతి వైపరీత్యాలను నివారించవచ్చు.
(వ్యాసకర్త: కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఫ్యాకల్టీ)
– డాక్టర్ శ్రీధరాల రాము
94411 84667