‘పాపం, పుణ్యం, ప్రపంచమార్గం, కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ ఏమీ ఎరూగని పూవుల్లారా అయిదా రేడుల పాపల్లారా! మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా! మీదే, మీదే సమస్త విశ్వం! మీరే లోకపు భాగ్యవిధాతలు! ఉడుతల్లారా! బుడుతల్లారా! ఇది నా గీతం వింటారా?’ అంటూ కల్మషమెరుగని బాల్యానికి అక్షరాల ఆకారం ఇచ్చాడు మహాకవి శ్రీశ్రీ. ప్రతీ మనిషి జీవితంలో రంగుల కలబోత బాల్యమే. మలినం లేని చలనం వారి సొంతం. బుడి బుడి అడుగులు, బోసి నవ్వులు ఎంతటి పాషాణ హృదయులనైనా ఇట్టే కరిగిస్తాయి.
ఈ మధ్య వచ్చిన రెండు పాన్ ఇండియా సినిమాలను (యానిమల్, సలార్) కూడా బాల్యం నేపథ్యంలోనే చిత్రీకరించారు. తండ్రిని అమితంగా ఇష్టపడే కుర్రాడిని.. వ్యాపార పనుల్లో పడి ఆ తండ్రి అశ్రద్ధ చేస్తాడు. కాలక్రమంలో తండ్రి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు, బాలుడూ (హీరో) పెద్దవాడవుతాడు. తండ్రి ఎదుగుదలను తట్టుకోలేని వారి బంధువులు అతడిని చంపాలని చూస్తారు. ఈ విషయాలన్నీ హీరోకి తెలుస్తాయి. తండ్రిని కాపాడేందుకు శత్రువులను ఒక్కొక్కరినీ చంపుతూ చివరికి హీరో ఉన్మాదిలా మారతాడు. కుమారుడు తన కోసమే జంతువు (యానిమల్)లా మారాడని ఆ తండ్రి గ్రహిస్తాడు. ఇక మరో సినిమా సలార్ కూడా ఈ కోవకు చెందినదే.
ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లలపై ప్రస్తుతం జరుగుతున్న కొన్ని దారుణాలు చూద్దాం. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. ఫలితంగా ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తూ ఆ దేశానికి అండగా ఉంటున్నట్టు అగ్రరాజ్యం అమెరికా కపట నాటకం ప్రదర్శిస్తూ వస్తున్నది. ఒకవైపు శాంతిమంత్రం జపిస్తూనే మరోవైపు యుద్ధాన్ని ప్రోత్సహించడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాదిమంది మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలు ధ్వంసమైపోయాయి. లక్షల మంది చిన్నారులు పొరుగు దేశాల్లో వలసపక్షుల్లా జీవించాల్సిన దుస్థితి. ఈ క్రమంలో యుద్ధం చేస్తున్న రెండు దేశాలు, యుద్ధాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్న అమెరికా, యూరోపియన్ దేశాలు చిన్నారుల భవిష్యత్తు గురించి ఆలోచించకపోవటం బాధాకరం. మరోపక్క ఇజ్రాయెల్-గాజా మధ్య జరుగుతున్న యుద్ధం చిలికి చిలికి గాలివానలా మారింది. అక్కడ జరుగుతున్న నరమేధం అంతాఇంతా కాదు. పది నెలల్లోనే 40 వేలమందికి పైగా మరణించారు. వారిలో మూడొంతులకు పైగా చిన్నారులే ఉండటం గమనార్హం. యుద్ధాల వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎవరనేది దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఆహారం దొరక్క గాజాలోని పిల్లలు గడ్డి, మన్ను తింటుండటం మానవజాతికే సిగ్గుచేటు. ఈ నరమేధాన్ని ప్రపంచ దేశాలు ఆపకపోవడం, ఐరాస కూడా చేష్టలుడిగి చేతులెత్తేయడంతో గాజా మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.
కక్షతో సాధించలేనిదాన్ని క్షమాభిక్షతో సాధించాలని, కత్తితో ఛేదించలేనిదాన్ని కరుణతో ఛేదించాలని పెద్దలు అంటారు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, నైజీరియా, జర్మనీ, లిబియా.. ఇలా ఏ దేశమైనా సరే పిల్లలే ఉంటారు. పిల్లలు లేని ప్రపంచాన్ని ఊహించగలమా?
పిల్లల రంగురంగుల ప్రపంచాన్ని, స్వేచ్ఛగా ఎగరాల్సిన వారి బాల్యాన్ని మనమే చిదిమేస్తున్నాం. రెక్కలు తెంచేస్తే వారు ఎలా ఎగరగలుగుతారు? యుద్ధాలు, హింసాత్మక ఘటనల ద్వారా బాల్యాన్ని అణచివేస్తే, చిదిమివేస్తే వారి బాల్యం తాలూకు జ్ఞాపకాలు వారిని ఎటువైపు నడిపిస్తాయి? పెరిగి పెద్దయ్యాక వారు ప్రతీకారం కోరుకోరా? ఒకవేళ అదే కనుక జరిగితే ప్రపంచంలో శాంతి, సామరస్యాలు ఎలా వెల్లివిరుస్తాయి? భవిష్యత్తులో శాంతియుత సమాజాన్ని ఎలా ఆశించగలం? నేటి పిల్లలే రేపటి పౌరులు. మనం ప్రస్తుతం తప్పులు చేసి, వారికి బాల్యంలో శాంతియుత సమాజాన్ని అందించకుండా.. భవిష్యత్తులో వారి నుంచి శాంతియుత సమాజాన్ని ఆశించగలమా? ఓ హిట్లర్ సృష్టించిన నరమేధం చరిత్ర గతినే మార్చేసింది. మరో హిట్లర్‌లా ప్రవర్తిస్తున్న ప్రస్తుత పాలకుల ఏలుబడిలో యుద్ధ వాతావరణంలో పెరుగుతున్న పిల్లలు భవిష్యత్తులో మరో హిట్లర్‌లా మారితే ఈ ప్రపంచం మనుగడ సాగిస్తుందా? నిత్యం బాంబు పేలుళ్ల మధ్య గడిపిన బాల్యం హింస వైపు మళ్లదని ఎవరైనా హామీ ఇవ్వగలరా?
ఎవరు ఎటుపోతేనేం మనం సురక్షితంగా ఉన్నామని అనుకోవడం సరికాదు. యుద్ధాల్లో చనిపోయిన, గాయపడిన పిల్లల్ని తల్చుకుంటూ వారి తల్లిదండ్రులు పడే ఆవేదనను అర్థం చేసుకోకపోతే సాటి మనుషులుగా మనం ఎందుకున్నట్టు? ఒంటికి తగిలిన గాయం మానుతుంది కానీ, మనసుకు తగిలిన గాయం అంత త్వరగా మానదు. నేడు మనసు విరిగిన బాలల వల్ల భవిష్యత్తులో మరిన్ని యుద్ధాలు జరిగితే అందుకు బాధ్యత వహించాల్సింది మనమే. మనం వారికి ఎలాంటి భవిష్యత్తును ఇస్తున్నామనేది ఇప్పటికైనా ఆలోచించాలి.
‘చిన్నారులు సామూహికంగా కలుసుకుంటారు అనంత విశ్వసాగర తీరంలో పైన గగనం దిగువ అలల అలజడిలో కడలి పిల్లలెప్పుడూ ఆడుతూ, పాడుతూ నవ్వుతూ, నర్తిస్తూ పోగవుతారు తీరంలోని ఇసుకతో గూళ్లుకట్టి ఆటలాడుతారు గవ్వలతో సాగరంలో ఎండుటాకులనే పడవలుగా వదిలి నవ్వుతుంటారు చిన్నారులు ఆడుకుంటారు అనంత విశ్వసాగర తీరంలో’
అంటూ రంగుల బాల్యాన్ని వర్ణించాడు విశ్వకవి రవీంద్రుడు. పిల్లల ముఖంలో ఎప్పుడూ ఆనందాన్నే కోరుకుందాం. ఎలాంటి అలజడి లేని సమాజాన్ని వారికి కానుకగా ఇవ్వడానికి మనవంతుగా ప్రయత్నం చేద్దాం. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛాయుతంగా ఉంటుందో అలాంటి సమాజాన్ని నిర్మించి పిల్లలకు అందిద్దాం.