అమెరికా వీసా అందని పండుగా మారుతుంటే డాలర్ కల చెదిరిపోతున్నది. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించి, అక్కడే కొంతకాలం ఉద్యోగానుభవం సంపాదించి, ప్రతిభకు తగిన అవకాశాలు అందుకోవాలన్నది వేలాదిమంది భారతీయ విద్యార్థుల కల. ముఖ్యంగా ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్, ఏఐ, బయోటెక్నాలజీ వంటి ‘స్టెమ్’ కోర్సుల కోసం అమెరికా విశ్వవిద్యాలయాల వైపు భారతీయుల ప్రవాహం కొన్నేండ్లుగా సాగుతున్నది. కానీ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన వలస విధానాలు ఆ ఉరవడికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నాయి. తాజాగా డిపార్టుమెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఎఫ్-1 విద్యార్థి చెల్లించాల్సిన అప్రెంటిస్‌షిప్ ఫీజును (దీనిని ఓపీటీ అంటున్నారు) 70 వేల డాలర్లకు పెంచాలని నిర్ణయించడం అతిపెద్ద అడ్డంకిగా నిలుస్తున్నది. ఆప్షన్ పొడిగింపులకు మరో 30 వేల డాలర్లు వెరసి మొత్తం ఫీజు లక్ష డాలర్లకు చేరుకుంటుంది. అంటే మన కరెన్సీలో కొంచెం అటూఇటూగా రూ.కోటి పైనే ఉంటుం ది. కాగితాలపై ఈ భారాన్ని విద్యార్థిపై కాకుండా విశ్వవిద్యాలయంపై మోపుతున్నామని అమెరికా ప్రభుత్వం చెప్తున్నా, అసలు భారం చివరికి విద్యార్థులపైనే పడుతుందని చెప్పాల్సిన పనిలేదు.
ప్రస్తుతం ఓపీటీ దరఖాస్తుకు విద్యార్థి చెల్లించే ఫీజు వందల డాలర్ల స్థాయిలో ఉండటం గమనార్హం. మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ విధానాలతో ట్రంప్ సర్కార్ తెస్తున్న కొత్త కొత్త నిబంధనలు విదేశీ విద్యార్థులకు పొగపెడుతున్నాయి. ఇది ఒక్క ఓపీటీ ఫీజు సమస్య మాత్రమే కాదు. ట్రంప్ పాలనలో విదేశీ విద్యార్థులు, నిపుణులపై వీసా పరిశీలన అంతకంతకూ కఠినతరమవుతున్నది. ఎఫ్-1 విద్యార్థులపై ఇప్పటికే సోషల్ మీడియా, ఆన్లైన్ పోస్టుల పరిశీలన అమల్లో ఉన్నది. అమెరికా విదేశాంగ శాఖ 2026లో ఈ వెట్టింగ్ విధానాన్ని మరింత విస్తరించింది. ఎఫ్-1, ఎం-1, జే-1 దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైళ్లను పబ్లిక్‌గా ఉంచాలని సూచించింది. విద్యార్థి అమెరికాలో చదవడానికి వెళ్తున్నాడా? లేదా భవిష్యత్తులో అక్కడే ఉద్యోగం చేయాలని చూస్తున్నాడా? అతని రాజకీయ అభిప్రాయాలేంది? ఇలా అన్ని విషయాలు లోతుగా తనిఖీ చేస్తున్నారు. విద్యార్థి ప్రతిభ, ఆర్థిక స్థోమత, విశ్వవిద్యాలయ ప్రవేశం వంటి అంశాలకే పరిమితమైన వీసా ప్రక్రియ కాస్తా విస్తృతమైన నిఘా ప్రక్రియగా మారుతున్నది. అదే సమయంలో ఎఫ్-1పై అమెరికా వెళ్లే విద్యార్థులకు నిర్దిష్ట కాలపరిమితి విధించడంతోపాటు అదనపు పొడిగింపు ప్రక్రియలను ప్రవేశపెట్టారు. దీంతో విద్యార్థులు చదువు, పరిశోధన, తదుపరి ఉద్యోగం.. ఇలా ప్రతి దశలోనూ ఇమ్మిగ్రేషన్ విభాగం శల్యపరీక్షలను తట్టుకోవాల్సి వస్తుండటం దినదిన గండంగా తయారైంది. అమెరికా విద్యావ్యవస్థకు అంతర్జాతీయ విద్యార్థులే పెద్ద బలం. అందులో భారతీయుల వాటా అత్యం త కీలకం. అమెరికాలో చదువుతున్న మన దేశ పౌరుల సంఖ్య మూడు లక్షలకు పైగా ఉన్నది.
భారతీయ మధ్యతరగతి కుటుంబం అమెరికా విద్య కోసం అప్పుచేసి మరీ భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తున్నది. అంత డబ్బు పోసి అక్కడికి వెళ్లి సమస్యలు ఎదుర్కోవడం అవసరమా? అనేది ప్రశ్న. ఇప్పటికే వీసా అపాయింట్మెంట్ల ఆలస్యం, రద్దులు, అదనపు పరిశీలనలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొందరు విద్యార్థులు వీసా సమయానికి అందకపోవడంతో తమ కోర్సు ప్రారంభ తేదీలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్నారు. పైకి ఇది కేవలం వీసా సమస్యగా కనిపిస్తున్నది. కానీ ఇది విద్యను వలసల కట్టడితో ముడిపెట్టే విధానం వల్ల తలెత్తిన సమస్య. అమెరికా వెళ్లడమే జీవిత పరమార్థం అనే భావన నుంచి భారతీయ విద్యార్థులు, తల్లిదండ్రులు బయటకు రావాలి. జర్మనీ తదితర ప్రత్యామ్నాయ గమ్యాలు ఎన్నో ముందుకు వచ్చాయనేది గుర్తుంచుకోవాలి. ఈ నేపథ్యంలో అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల నమోదు దారుణంగా పడిపోయిందని వార్తలు వెలువడుతున్నాయి. అమెరికా తలుపులు మూసుకుంటే భారత యువత భవిష్యత్తు మూసుకుపోదు. కానీ ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించుకోవాలనుకునే అమెరికా, ఒక చేత్తో విశ్వవిద్యాలయాలకు అంతర్జాతీయ విద్యార్థులు కావాలని చెప్పి, మరో చేత్తో వీసాలపై ఉచ్చు బిగిస్తే అది చివరికి అమెరికాకే నష్టం. అమెరికా ఫస్ట్ అనే నినాదం అమెరికాకు ప్రతిభను దూరం చేసే విధానంగా మారకూడదు.