2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది కేవలం ఒక రాజకీయమైన ఘట్టంగా చూడలేం. ఇది ఆర్థిక స్వరూపాన్ని విస్తారంగా పునర్నిర్మించిన కీలకమైన పరిణామంగా భావించవచ్చు. విభజన అనేది దశాబ్దాల ఖజానా అసమతుల్యతలను, ప్రాంతీయ నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్వరూప ముసుగులో వ్యవస్థీకృతమైన పరాధీనతను బయటపెట్టింది. ఎప్పుడైతే విభజన జరిగిందో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను బాధిత రాష్ట్రంగా పరిగణిస్తూ వరాల జల్లు కురిపించింది.. ఆర్థిక సహకారం కూడా అందించింది.
తెలంగాణ రాష్ర్టాన్ని మాత్రం సొంత కాళ్లపై నిలబడాల్సిన అనివార్యమైన పరిస్థితిలో వదిలిపెట్టింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే గొప్ప బహుమతి అనుకున్నది. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత రెండు రాష్ర్టాల ఆర్థిక గమనాన్ని పరిశీలిస్తే, ఖజానా నిర్వహణలో హైదరాబాద్ పాత్ర, రెండు రాష్ర్టాలకు సహకారం అందించడంలో కేంద్రం పారదర్శకత ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆంధ్ర ప్రాంత ప్రజలకు హైదరాబాద్ నగరం వివాదాస్పద అంశంగా మారింది. హైదరాబాద్‌తో ఆంధ్రుల బంధం తెగిపోయిందని చెప్పవచ్చు. వాస్తవానికి ఆంధ్ర ప్రాంతానికి హైదరాబాద్ రాజ్యంతో పరిసర సంబంధం అనుబంధం 1780-1800 సంవత్సరాల మధ్య ముగిసింది. సర్కార్ (కోస్తాంధ్ర) ప్రాంతాన్ని, రాయలసీమ జిల్లాలు (సీడెడ్) ప్రాంతాన్ని నిజాం పాలకులు బ్రిటిష్ పాలకులకు అప్పగించారు. 1953 సంవత్సరానికి ముందు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీ, మద్రాస్ రాష్ట్రంలో 150 ఏండ్లపాటు ఉన్నాయి. అయితే 1591లో హైదరాబాద్ సంస్థానం ఏర్పడినప్పటి నుంచి 1948 వరకు హైదరాబాద్ నగరమే రాజధాని. ఇది తెలంగాణ నగరానికి నడిమధ్యన ఉన్నది. ఆంధ్రా సరిహద్దు ప్రాంతానికి హైదరాబాద్ 250 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.
స్వాతంత్య్రం అనంతరం 1953లో తొలిసారి భాషా ప్రయుక్త రాష్ర్టాలు ఏర్పడినప్పుడు మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి, కర్నూల్ రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పొరపాటు నిర్ణయం, చారిత్రక తప్పిదం అని అనతికాలంలో తేలింది. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం ఆర్థికంగా బలహీనమైనది. మద్రాస్ రాష్ట్రంపై ఆధారపడి ఉండేది. కానీ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇదే సమయంలో ఆంధ్రా ప్రాంత కాంగ్రెస్ నేతలు తమకు ఉన్న సత్సంబంధాలను ఆసరాగా చేసుకొని హైదరాబాద్ రాష్ట్రంతో విలీనం కోసం కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను ప్రభావితం చేశారు.
కేంద్రం రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు చేయగా ఆంధ్రతో కలిసేందుకు తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు. ప్రజల అభీష్టాన్ని పరిగణలోకి తీసుకోకుండానే 1956లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసింది. పెద్దఎత్తున అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను రాజధానిగా చేయడం ద్వారా తెలంగాణ ప్రాంత మిగులు బడ్జెట్‌తో ఆంధ్ర ప్రాంతానికి ఉన్న ఆర్థిక సమస్యలు తీరుతాయనేది విలీనం ప్రధాన ఉద్దేశం. హైదరాబాద్, ఆంధ్ర రాష్ర్టాల విలీనం తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా, బలవంతంగా జరిగింది. ఈ రెండు ప్రాంతాలు 58 ఏండ్లపాటు కలిసి ఉన్నాయి. మద్రాస్ రాష్ట్రంతో ఆంధ్ర ప్రాంతం కలిసి ఉన్న 160 ఏండ్లతో పోల్చితే 58 ఏండ్లు చాలా తక్కువ. తెలంగాణ, ఆంధ్రతో హైదరాబాద్‌కు ఉన్న సంబంధాన్ని, ఆ ప్రాంతాలపై ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి.. ఈ చారిత్రక నేపథ్యం తెలుసుకోవడం చాలా ముఖ్యం.
తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల విలీనం సమయంలో ఆంధ్రరాష్ట్రం రూ.4 కోట్ల లోటు బడ్జెట్‌తో నడుస్తున్నది. అదే సమయంలో తెలంగాణ రూ.కోటి మిగులు బడ్జెట్‌తో ఉన్నది. 1955-56 నాటి రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ లెక్కల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం రూ.15.04, ఆంధ్ర తలసరి ఆదాయం రూ.10.53 ఉన్నది. నిష్పత్తిగా చూసుకుంటే 1.43:1.00 అవుతుంది. రెండు రాష్ర్టాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి, 58 ఏండ్లపాటు కొనసాగినప్పుడు తెలంగాణ ఆదాయం ఉమ్మడి రాష్ట్ర ఖజానాకు ఆసరాగా నిలిచింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నిధుల లోటును పూడ్చటానికి ఉపయోగపడింది.
తెలంగాణలోని 10 జిల్లాలు, కోస్తాంధ్రలోని 13 జిల్లాల నుంచి వచ్చే ఆదాయం రాష్ట్ర ఆదాయంలో దాదాపు 50 శాతం వాటా ఉండేది. కానీ బడ్జెట్ నుంచి ఖర్చులో మాత్రం అసమానత ఉండేది. మొత్తం రాష్ట్ర ఆదాయంలో తెలంగాణ ప్రాంతానికి 35 శాతం మాత్రమే ఖర్చు చేస్తూ మిగిలిన 65 శాతం మాత్రం ఆంధ్ర ప్రాంతానికి వెచ్చించేవారు. తెలంగాణ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలన్న పెద్ద మనుషుల ఒప్పందం ఉన్నప్పటికీ అది ఆచరణకు నోచుకోలేదు.
ఎన్నో ఉద్యమాలు జరిగినప్పటికీ సమైక్య రాష్ట్రంలో పరిస్థితి మారలేదు. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ తిరిగి స్వరాష్ట్రంగా ఏర్పడే వరకు ఇదే విధమైన నిధుల పంపిణీ కొనసాగింది. ఇక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014-15 నాటి రెండు రాష్ర్టాల లెక్కలు చూస్తే ఆసక్తికరమైన విషయాలు అర్థమవుతాయి. ఆంధ్రప్రదేశ్ రూ.13,337 కోట్ల లోటుతో ఉండగా, తెలంగాణ రూ.369 కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్నది. ఇది రెండు రాష్ర్టాల విలీనం నాటి పరిస్థితిని ప్రతిబింబిస్తున్నది. అంటే సమైక్య రాష్ట్రంలో 58 ఏండ్లపాటు లక్షల కోట్ల రూపాయల తెలంగాణ నిధులను, ఆంధ్ర ప్రాంత లోటును పూడ్చటానికి సమైక్యపాలకులు మళ్లించారన్నమాట.
ఇక్కడ మరో విషయం గమనించవచ్చు. తెలంగాణలోని నిధులను తమ ఇష్టానుసారం వాడుకోవచ్చని, వాటిని తరలించుకుపోవడంపైనే దృష్టి పెట్టిన ఆంధ్ర పాలకులు, అక్కడి లోటును పూడ్చటానికి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా విభజన అనంతరం పరిస్థితిని గమనిస్తే రాష్ట్ర మొత్తం ఆదాయంలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వాటా తెలంగాణలో 75 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 52 శాతం మాత్రమే ఉన్నది.
ఆంధ్రప్రదేశ్: 2014-15లో ఏపీకి రూ.13,377 కోట్ల ఆర్థిక లోటు ఉన్నది. ఈ మేరకు కేంద్రం లెక్కలు వేసి రూ.11,500 కోట్లను గ్రాంటుగా ఇచ్చింది. అంతేకాకుండా ఆర్థిక లోటును పూడ్చేందుకు 14వ, 15వ ఆర్థిక సంఘాల ద్వారా రూ.52,000 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులు 2026 వరకు కూడా ఏటా ఏపీకి వస్తున్నాయి. వీటితో పాటు క్రమం తప్పకుండా కేంద్రం నుంచి గ్రాంట్లు అందుతున్నాయి. బడ్జెట్ నిర్వహణలో దూరదృష్టి లేకపోవడం వల్ల 2023-24 నాటికి ఏపీ ఆర్థిక లోటు రూ.38,683కి పెరుగగా, 2014-15లో రూ.1.2 లక్షల కోట్లుగా ఉన్న అప్పు 2023-24 నాటికి రూ.3.1 కోట్లకు పెరిగింది.
తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.369 కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉండగా 2022-23 నాటికి రూ.5,994 కోట్ల మిగులుకు పెరిగింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, విద్యుత్తు ప్రాజెక్టుల విస్తరణ కోసం చేసిన అప్పులతో 2023-24 బడ్జెట్ సమయానికి మిగులు రూ.779గా ఉన్నది. 2014లో విభజన సమయంలో వారసత్వంగా వచ్చిన అప్పులు సుమారు రూ.80 వేల కోట్లు కాగా, 2023-24 బడ్జెట్ సమయానికి అప్పులు రూ.2.3 కోట్లకు పెరిగాయి. అయితే, ఈ అప్పుల ద్వారా పెట్టిన మూలధన వ్యయం సంపద సృష్టి కోసం వెచ్చించారు. ఇలా చేయడం వల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమై రాబడి పెరిగింది.
తెలంగాణ ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.24,000 కోట్లు నిధులు ఇవ్వాలని నీతి అయోగ్ కేంద్రానికి సిఫారసు చేసింది. కానీ ఈ సిఫారసు అమలుకు నోచుకోలేదు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఎలాంటి అదనపు నిధులు అందలేదు. కేవలం చట్టబద్ధంగా లభించే పన్నుల వాటాలు, గ్రాంట్స్ మాత్రం అందాయి. ఈ నిధులు కూడా ఏపీతో పోల్చితే చాలా తక్కువ.
విభజన తర్వాత హైదరాబాద్‌ను నష్టపోయామని ఏపీ రాజకీయ నేతలు పదేపదే అన్నారు.. అంటున్నారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం. హైదరాబాద్‌ను ఆంధ్ర నష్టపోయిందా? లేకపోతే సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్‌పై ఆధారపడిందా? అనేది ప్రశ్న. హైదరాబాద్ ఎప్పుడూ తెలంగాణలో భాగమే. ఇక హైదరాబాద్‌తో ఆంధ్ర ప్రాంతం సంబంధం 1780-1800 మధ్యనే తెగిపోయింది. హైదరాబాద్ నిధులపై ఆధారపడటం అనేది మెజారిటీ ఆంధ్ర పాలకుల నిర్ణయమే కానీ, అది ఆంధ్ర ప్రాంత ప్రజల హక్కు కాదు. సమైక్య పాలనలో ఆంధ్ర ప్రాంత రాబడులను పెంచుకోవడంపై దృష్టి పెట్టని పాలకులు, తెలంగాణలో ఖర్చు పెట్టకుండా ఆ మిగులు నిధులపై ఆంధ్ర ప్రాంతానికి తరలించటం, వాటిపై ఆధారపడటం పరిపాటిగా మార్చుకున్నారు.
ఇదే విషయం విభజన తర్వాత స్పష్టంగా తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నిధులు తెలంగాణకు మాత్రమే పరిమితం చేయడం అనేది, సుదీర్ఘ కాలం జరిగిన అన్యాయాన్ని సరిచేయడమే అవుతుంది. అంతేకానీ ఆంధ్ర ప్రజలు హైదరాబాద్‌ను కోల్పోయారని చెప్పడం, తమను తాము బాధితులుగా చిత్రీకరించుకోవడం, ఆంధ్ర ప్రాంత సంపన్నవర్గాల పెద్దల కేంద్రంగా జరిగే రాజకీయాలకు నిదర్శనం.
కేంద్రం సహకారం: అసమానత, అన్యాయం విభజన తర్వాత కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు 20 జాతీయ సంస్థలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టును మంజూరు చేసింది. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు 6 సంస్థలు ఇవ్వాలి, కానీ రెండు మాత్రమే పట్టాలెక్కాయి. ఏపీలోని పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, నిధులు ఇచ్చింది. ట్రిబ్యునల్ అనుమతి లేకుండానే కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రజిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చింది. కానీ తెలంగాణలోని 9 జిల్లాలను వెనుకబడినవిగా ప్రకటించినప్పటికీ, నిధులు మంజూరు చేయలేదు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం అప్పులు తీసుకోవాల్సిన అనివార్యతను కల్పించింది. ఢిల్లీ పెద్దల పక్షపాత ధోరణి, సమానత్వ భావనపై ప్రశ్నలను రేకెత్తిస్తున్నది. వివక్ష మధ్య తెలంగాణ పదేండ్లలోనే దేశంలోనే నంబర్‌వన్ స్టేట్‌గా సత్తా చాటుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనేది కేవలం తెలంగాణకు రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, ఎవరి ఆర్థిక పరిస్థితి ఎంత, ఇన్నేండ్లు ఎవరు ఎవరిపై ఆధారపడ్డారు? ఎవరి నిధులు ఎవరు తరలించుకుపోయారు? అనే లెక్కలు తేల్చిన ట్టయింది. ఈ పరిణామాలు చెప్పే పాఠం ఏంటంటే… సాంస్కృతిక ఏకీకరణ, ప్రాంతీయ త, ఆర్థిక బాధ్యతలల్లో సమానత్వం లేకపోతే,రాజకీయ ఆధిపత్య ధోరణులను, కేంద్రం వివక్షను భరిస్తూ ఐక్యంగా ఉండటం అసాధ్యం.
– జనార్దన్‌రెడ్డి జనుంపల్లి