Asaram Bapu : ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ (Asaram Bapu) కు రాజస్థాన్ హైకోర్టు (Rajastan High Court) లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మైనర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో కింది కోర్టు విధించిన జీవిత ఖైదును రాజస్థాన్ హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు ఆశారాం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ప్రస్తుతం మధ్యంతర వైద్య బెయిల్‌పై బయట ఉన్న 86 ఏళ్ల ఆశారాం వెంటనే అధికారుల ఎదుట లొంగిపోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న శిల్పి (Shilpi), శరత్‌చంద్ (Sharatchand) లను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు విముక్తి కల్పించింది.
జస్టిస్ అరుణ్ మోంగా, జస్టిస్ యోగేంద్ర కుమార్ పురోహిత్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 2013 ఆగస్టులో జోధ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో మైనర్ బాలికపై ఆశారాం లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సుదీర్ఘ విచారణ అనంతరం జోధ్‌పూర్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు 2018 ఏప్రిల్ 25న ఆశారాంను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆశారాం హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీల్‌పై 2026 ఫిబ్రవరి 16 నుంచి ఏప్రిల్ 20 వరకు హైకోర్టు రోజువారీ విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తుది తీర్పును వెలువరించింది.
విచారణ సమయంలో ఆశారాం తరఫు న్యాయవాదులు ఇది కట్టుకథ అని వాదించారు. బాధితురాలి తల్లిదండ్రుల వాంగ్మూలాల్లో వైరుధ్యాలు ఉన్నాయని, ఘటన జరిగిన రోజు రాత్రి ఆశారాంకు, బాధితురాలికి మధ్య ఎలాంటి ఫోన్ కాల్స్ జరగలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇవే సాక్ష్యాధారాలతో కొందరు సహ నిందితులు నిర్దోషులుగా విడుదలైనందున ఆశారాంను కూడా దోషిగా పరిగణించలేరని వాదనలు వినిపించారు. అయితే ప్రాసిక్యూషన్, బాధితురాలి తరఫు న్యాయవాది పీసీ సోలంకి ఈ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. పోక్సో చట్టం ప్రకారం బాధితురాలి వాంగ్మూలమే శిక్ష విధించడానికి సరిపోతుందని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసిందని గుర్తుచేశారు.
కేసును తప్పుదోవ పట్టించేందుకు సాక్షులపై దాడులు, హత్యలు జరిగాయని కూడా వారు కోర్టుకు తెలిపారు. ఆశారాం ఇప్పటికే గుజరాత్‌లోని గాంధీనగర్ ఆశ్రమంలో మరో మహిళపై అత్యాచారం కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఆ కేసులో 2023 జనవరిలో ఆయనకు శిక్షపడింది. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించిన ఆయనకు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు మధ్యంతర వైద్య బెయిల్ మంజూరు చేసింది. తాజా తీర్పుతో ఆయన మళ్లీ జైలుకు వెళ్లకు తప్పని పరిస్థితి ఏర్పడింది.