Air India : పశ్చిమాసియా (West Asia) లో సంక్షోభం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరల భారంతో ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులను కుదించిన ఎయిరిండియా (Air India) ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమాన సర్వీసులను కూడా తగ్గించుకోవాలని నిర్ణయించింది. విమాన ఇంధన ధరలు (Jet fuel price) భారీగా పెరగడమే ఇందుకు కారణమని విమానయాన వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ క్రమంలో ఎయిరిండియా జూలై, ఆగస్టు నెలల్లో తన దేశీయ విమాన సర్వీసులను 15 నుంచి 20 శాతం వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రూట్లను పూర్తిగా రద్దు చేయకుండా కేవలం విమానాల ఫ్రీక్వెన్సీని మాత్రమే తగ్గించాలని సంస్థ భావిస్తోంది. ఈ మార్పులపై ఎయిరిండియా అధికారిక ప్రతినిధి స్పందించారు. ఇంధన ధరల ప్రభావంవల్లే కొన్ని దేశీయ రూట్లలో సర్వీసులను తాత్కాలికంగా క్రమబద్ధీకరిస్తున్నట్లు స్పష్టంచేశారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ పాత షెడ్యూల్ ప్రకారం అన్ని విమానాలను పునరుద్ధరిస్తామని చెప్పారు.
ప్రయాణికుల డిమాండ్, మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తామని ఎయిరిండియా వెల్లడించింది. షెడ్యూల్ మార్పుల వల్ల ఇబ్బంది పడే ప్రయాణికులకు పూర్తి సాయం అందిస్తామని విమానయాన సంస్థ హామీ ఇచ్చింది. టికెట్లు బుక్ చేసుకున్న వారికి ప్రత్యామ్నాయ విమానాల్లో సీట్లు కేటాయించడం, ఎలాంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణ తేదీలను మార్చుకునే అవకాశం కల్పించడం, పూర్తి డబ్బును రిఫండ్ చేయడం వంటి ఆప్షన్లను అందిస్తామని తెలిపింది. రాబోయే రెండు నెలల్లో ప్రయాణించే వారు ముందే ఫ్లైట్ షెడ్యూల్స్ తనిఖీ చేసుకోవడం మంచిది.