ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో కార్మికుల సమ్మెతో పెద్ద కలకలం రేగింది. అదిప్పుడు సమస్యలు పరిష్కరించాల్సిన అవసరాల చౌరస్తాలో నిలబడింది. దాదాపు అన్ని ఫిలిం షూటింగులు నిలిచిపోయాయి. సమ్మె కొనసాగుతూనే ఉంది. మొదట ప్రభుత్వం ఉదాసీనంగా కనిపించినా సంబంధిత మంత్రి ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. నిజానికి సినీ నిర్మాణం ఒక పెద్ద ఆర్థిక, వినోద రంగం. పెద్ద పరిశ్రమ. అది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా జోక్యం చేసుకుని, కార్మికులు, పరిశ్రమ ప్రయోజనాల కోసం సమస్యను పరిష్కరించాలి.
ప్రస్తుత సమస్యను సమగ్రంగా పరిశీలిస్తే.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFIEF) 2025 ఆగస్టు 4న సమ్మె ప్రారంభించింది. ఈ సమ్మె ద్వారా పది వేల మందికిపైగా రోజువారీ వేతన కార్మికులు (టెక్నికల్, సపోర్ట్ స్టాఫ్ సహా) తమ వేతనాల్లో 30 శాతం పెంపు కోరుతున్నారు. అలాగే ప్రతిరోజూ వెంటనే వేతనం చెల్లించాలనే డిమాండ్ కూడా ఉంది. సమ్మె కారణంగా టాలీవుడ్‌లోని అనేక చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, ప్రీ-ప్రొడక్షన్, పోస్ట్-ప్రొడక్షన్ దశల్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అయితే, నిర్మాతలు 5 శాతం వేతన పెంపు ప్రతిపాదించగా, ఫెడరేషన్ దాన్ని తిరస్కరించింది.
ఇక తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) తమ ప్రతిపాదనలో రోజుకు రూ.2,000 వరకు వేతనమున్నవారికి మొదటి ఏడాది 15% పెంపు, రెండు, మూడవ సంవత్సరాల్లో 5% పెంపు, రోజుకు రూ.1,000 కంటే తక్కువ పొందేవారికి మొదటి ఏడాది 20% పెంపు, రెండవ సంవత్సరంలో పెంపు లేదు, 3వ సంవత్సరంలో 5% పెంపు, రోజుకు రూ.4,000 పైగా సంపాదించేవారికి ఎటువంటి పెంపు లేదు. కానీ, కార్మికుల సమాఖ్య డిమాండ్లు ఇంకో రకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుచేసే కమిటీ ఏ మేరకు సమస్యను పరిష్కారం వైపునకు తీసుకెళ్తుందో కొద్ది రోజుల్లో తేలిపోనున్నది.
కానీ, మౌలికంగా మన సంస్కృతిలో సినిమా వినోదం మాత్రమే కాదు; అది ఒక శక్తివంతమైన సామాజిక, ఆర్థిక సాధనం. ఇది ప్రజల ఆలోచనలు, భావోద్వేగాలు, దృక్కోణాలను ప్రభావితం చేయగలదు. ఈ శక్తిని సరైన దిశగా మలచడానికి, చిత్ర నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి, ప్రభుత్వ మద్దతు అందించడానికి ఒక సక్రమమైన విధానం అవసరం. ఈ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ పాలసీని రూపొందించి అమలు చేయాలి. దానివల్ల అటు నిర్మాతలు, ఇటు పరిశ్రమలోని సాంకేతిక నిపుణులు, వివిధ రంగాల కార్మికులకు నడుమ సంఘీభావం ఉండేలా ప్రభుత్వం పనిచేయాలి.
ఫిలిం పాలసీ అంటే, ప్రభుత్వం సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయడానికి, ప్రోత్సహించడానికి తీసుకునే విధానాలు, నియమాలని రూపొందించడం. కేంద్రం వద్ద ఇప్పటికే ఒక పాలసీ ఉంది. కేరళ లాంటి రాష్ర్టాల్లో ఫిలిం పాలసీ అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే త్రివేండ్రంలో ఒక పెద్ద సమావేశం కూడా నిర్వహించారు. తెలంగాణ ఫిల్మ్ పాలసీని తీసుకొస్తే, అది ప్రధానంగా రాష్ర్టాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి షూటింగ్ హబ్‌గా నిలపడం కోసం కృషి చేయాలి. అంతేకాదు స్థానిక భాష, సంస్కృతి, కళారూపాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. సినీ పరిశ్రమ అభివృద్ధికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఉండాలి. వీటికి తోడు తెలంగాణ సినిమాను ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాల్ని చేపట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ఫిలిం అకాడమీ ఏర్పాటు, తెలంగాణ యువతకు అటు సాంకేతికంగా, ఇటు నటన, దర్శకత్వపరంగా శిక్షణ ఇవ్వడానికి ఫిలిం ఇన్స్టిట్యూట్ స్థాపన లాంటివి మొదలుపెట్టాలి.
ఇంకా పాలసీలో ఉండాల్సిన ఇతర ముఖ్యాంశాల విషయానికి వస్తే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్.. ప్రభుత్వం, సినిమా పరిశ్రమ మధ్య వంతెనగా పనిచేయాలి. అనుమతులు, సబ్సిడీలు, టెక్నికల్ సపోర్ట్ అందించాలి. సింగిల్-విండో సిస్టమ్ ద్వారా అన్ని అనుమతులు ఒకే వేదికపై లభించేలా చూడాలి. తెలంగాణలో నిర్మించే సినిమాలకు సబ్సిడీ పెంచి త్వరత్వరగా విడుదల చేయాలి. తెలంగాణ చారిత్రక స్మారకాలు, ప్రకృతి సౌందర్యం, ఆధునిక నగర దృశ్యాలను షూటింగ్ లొకేషన్లుగా ప్రోత్సహించాలి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఆలస్యం లేకుండా విడుదల చేయాలి.
ఇక పాలసీ మౌలిక లక్ష్యాలుగా పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడం, తెలంగాణ సంస్కృతి, భాషను ప్రపంచానికి పరిచయం చేయడం, సినిమా ద్వారా పర్యాటకం, ఆర్థికాభివృద్ధి సాధించడం లాంటివి చేయాలి. ఇంకా సినిమా రంగం ఎదుర్కొంటున్న టికెట్ ధరలు, పైరసీ, మౌలిక వసతుల లోపాలు వంటి సమస్యలను పరిష్కరించడం లాంటి అంశాలను కూడా ఫిలిం పాలసీలో పొందుపరచాల్సి ఉంది. మరోవైపు వివిధ రాష్ర్టాల నుంచి పోటీ కూడా పెరుగుతున్నదని రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమ గమనించాలి.
కేరళ, రాజస్థాన్, హర్యానా, జమ్మూకశ్మీర్ లాంటి రాష్ర్టాలు సినీ పరిశ్రమలను సబ్సిడీలు, ప్రోత్సాహకాలతో ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ కూడా అదే చేయాలి. తెలంగాణ ఫిల్మ్ పాలసీ కేవలం చిత్ర నిర్మాణ అనుమతుల పత్రంగా కాకుండా, రాష్ట్ర అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ, ఆర్థిక వృద్ధి కోసం సమగ్ర వ్యూహం కావాలి. సమర్థంగా అమలు చేస్తే, తెలంగాణను భారతదేశంలోనే కాకుండా ప్రపంచస్థాయి సినీ హబ్‌గా నిలబెట్టవచ్చు. అయితే సమస్య వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందించకుండా శాశ్వత ప్రాతిపదికన ఫిలిం పాలసీని రూపొందించడానికి కేరళలో హేమా కమిటీలాగా ఒక ప్రత్యేక కమిటీని వేసి కూలంకషంగా చర్చించి తెలంగాణ ఫిలిం పాలసీని రూపొందించి ప్రకటించాలి. కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా అమలు విషయంలో చిత్తశుద్ధితో కృషి చేయాలి.
– వారాల ఆనంద్