Shibu Soren | ఉద్యమ నిర్మాతలే ఉద్యమాలను గుర్తిస్తరు. ప్రజా ఆకాంక్షల ప్రతిరూపంగా నిలబడతరు. తమ జాతి అస్తిత్వం కోసం తుది దాకా పోరాడుతరు. అట్లా పోరాడినవాళ్లే చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తరు. భవిష్యత్తుకు చుక్కానిలా మార్గదర్శనం చేస్తరు. దేశంలో జరిగిన అస్తిత్వ, ఆత్మగౌరవ పోరాటాల్లో అట్లా మార్గదర్శనం చేసినవారు శిబూ సొరేన్. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) స్థాపకుల్లో ఒకరుగా ఉండి తక్కినవాళ్లు మధ్యలోనే కారణాంతరాల వల్ల వెళ్లిపోయినా.. పక్కకు తప్పుకొన్నా అంతిమ గమ్యాన్ని ముద్దాడిన ఆదివాసీ గిరిజన మేరు నగధీరుడు శిబూ సొరేన్. ఆదివాసీ గిరిజనుల కోసం పోరాటం చేస్తున్న క్రమంలో తన తండ్రి శోబారణ్ సొరేన్‌ను వడ్డీ వ్యాపారస్థుల ప్రేరేపిత మూకలు దారుణంగా హతమార్చాయి. శిబూసొరేన్ వయస్సు అప్పుడు పదిహేనేండ్లు. సాధారణంగా ఆ వయస్సులో ఉన్నవారెవరైనా ఈ ఘటనతో భీతిల్లిపోతారు. పగతో రగిలిపోతారు. కానీ, శిబూ సొరేన్ మాత్రం ఆ ఘటన నేపథ్యాన్ని వ్యక్తిగత అంశంగా కాకుండా తన జాతి అంశంగా చూసిండు. అప్పటినుంచి తన ఆదివాసీ గిరిజన సమాజ చైతన్య ప్రేరకుడిగా మారిండు. సంతాల్ సుధార్ సమాజ్ను, సంతాల్ నవయువక్ సంఘ్ వంటి సంస్థలను ఏర్పాటుచేసి ఉద్యమాన్ని నిర్మించిండు. కాలక్రమంలో ఏకే రాయ్, కుర్మీ -మహతో నాయకుడు బినోద్ బిహారీ మహతోతో కలిసి ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)ను ఏర్పాటుచేశారు. అప్పటినుంచి దాదాపు నాలుగు దశాబ్దాలు జేఎంఎంకు చీఫ్‌గా కొనసాగారు.
సంతాల్ తెగలో బిర్సా ముండా వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని దేశంలో జరిగిన ఆదివాసీ ఉద్యమాల చరిత్రలో అంతటి ఖ్యాతిని శిబూ సొరేన్ గడించారు. దేశ ప్రజా ఉద్యమాల చరిత్రలో శిబూ సొరేన్ది ప్రత్యేక ముద్ర. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రారంభించిన తుది దశ తెలంగాణ ఉద్యమానికి శిబూ సొరేన్ మొదటినుంచి వెన్నుదన్నుగా నిలిచారు. 2001 నుంచి 2014 దాకా కేసీఆర్ నాయకత్వంలో సాగిన తెలంగాణ ప్రజా ఉద్యమానికి ఉత్తరాది నుంచి అండగా దండగా ఉన్న అతికొద్ది మందిలో శిబూ సొరేన్ ముందువరుసలో నిలుస్తరు.
‘చంద్రశేఖర్! ఢిల్లీల దుర్మార్గమైన రాజకీయాలుంటయి. ఇక్కడ రాజకీయం లాభనష్టాలు తప్ప మరేం ఉండవు. తెలంగాణ పక్వానికి వచ్చింది. తెలంగాణ ఏర్పాటు ఖాయమనే ముచ్చట అందరికీ అర్థమైంది. అప్పటిదాకా ఉద్యమాన్ని కాపాడుకోవాలె. తెలివితో ఇంత ఉద్యమం నడిపినవు. ఏకంగా తెలంగాణను పట్టుకొచ్చి ఢిల్లీల పెట్టినవు. పార్లమెంట్ జా యింట్ సెషన్ సందర్భంగా రాష్ట్రపతి ప్రసం గంలో పెట్టించి చరిత్రలో నిలిచిపోయావు. చా లా సక్సెస్ఫుల్ లీడర్‌గా తెలంగాణ మూవ్‌మెంట్‌ను ఎమర్జ్ చేసినవు’ అని 2004లోనే కేసీఆర్ పోరాటపటిమ, పదునైన వ్యూహంతో తెలంగాణ ప్రజల ఆకాంక్ష తప్పక నెరవేరుతుందన్న నమ్మికను బాహాటంగానే వ్యక్తం చేసిండు.
సంతాల్ తెగ విముక్తి కోసం ఝార్ఖండ్ పేరుతో ప్రత్యేక రాష్ట్రం ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి మధ్య ఉన్న సారూప్యాన్ని 2001లో కరీంనగర్ సింహగర్జన బహిరంగసభలో, 2006 ఫిబ్రవరిలో భద్రాచలంలో కేసీఆర్ నిర్వహించిన ‘పోలవరం గర్జన’లో విడమరచి చెప్పిండు. ఝార్ఖండ్ కోసం ఉద్యమం బలంగా సాగుతున్న కాలంలో బీహార్ నాయకులంతా వద్దని వారించిన సందర్భాలను శిబూ సొరేన్ వివరించిన తీరును తెలంగాణ సమాజం మరచిపోదు.
‘తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి బక్కపలచనోడే అయినా విల్లంబు వంటి నాయకుడు కేసీఆర్ ఉన్నడు. కేసీఆర్‌కు అండగా ఝార్ఖండ్ ఉంటది. జాతిని ఏకం చేస్తది. కేసీఆర్ తెలివైన వ్యూహంతో ముందుకు సాగుతున్నడు. 2001లో ఉద్యమం మొదలుపెట్టి 2004లో అమాంతం ఢిల్లీలో తెలంగాణను పెట్టిండు. అదీ ఒక్క ఉద్యమకారుడిపై ఒక్క లాఠీ దెబ్బ తగలకుండా, ఒక్కరూ జైలుకుపోకుండా.. ఎటువంటి ఇబ్బందుల్లేకుండా తెలంగాణను ఢిల్లీల తెచ్చిపెట్టిండు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించాలన్న తపన తప్ప మరేమీ లేని అరుదైన వ్యక్తిత్వం ఉన్న నాయకుడు’ అని కేసీఆర్‌ను అభినందించిన సందర్భాలనేకం. ఇటు తెలంగాణలో అటు ఢిల్లీలో కేసీఆర్ ప్రతీ అడుగును ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా మన ఉద్యమానికి అండగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి ఝార్ఖండ్ పంథా.. దాని పాఠాలు.. అనుభవాలను కేసీఆర్ పరిగణనలోకి తీసుకున్నరు.
నిజానికి ఝార్ఖండ్ పోరాటం మొదలు మొదలే హింసాత్మక ఉద్యమంగా కొనసాగిందని జేఎంఎం పేరే సూచిస్తుంది. జేఎంఎం ప్రారంభించిన ఎనిమిదేండ్ల తర్వాత ఉద్యమం హింసాత్మక మార్గం సరైంది కాదని గుర్తించింది. కానీ, తెలంగాణ సమాజాన్ని శాంతియుత, అహింసా మార్గంలో నడిపి మూడున్నర కోట్ల తెలంగాణ ఆకాంక్షను సాకారం చేస్తామని మొదట్లోనే కేసీఆర్ ప్రకటించారని ‘రక్తపు బొట్టు రాల్చకుండా తెలంగాణ రాష్ర్టాన్ని సాధిస్తాం’ అనే లక్ష్యం మహత్తరమైనదని హైదరాబాద్, కరీంనగర్, భద్రాచలం సహా అనేక వేదికల మీద శిబూ సొరేన్ అభిప్రాయపడ్డారు.
ఒక సందర్భంలో శిబూ సొరేన్ ఇలా వివరించారు. ‘జేఎంఎం 82 మందితో స్టేట్ కమిటీ ఉండేది. ఆ సందర్భంలో స్టేట్ కమిటీ మీటింగ్‌కు ఇద్దరో ముగ్గురో హాజరైండ్రు. ఇట్లెట్లా అయిందని తెలుసుకుంటే కోర్టు కేసులు, పోలీసు కేసుల్లో హాజరయ్యేందుకు సగానికి పైగా వెళ్లారు. దీని మీద ఒక కమిటీ వేసినం. ఆ కమిటీ అధ్యయనం చేసి ‘హింసాయుత ఉద్యమాన్ని కొనసాగించలేం. నాయకులు, కార్యకర్తల కుటుంబాలు భయపడుతున్నాయి. అయినా సరే ఉద్యమాన్ని నడిపిద్దామని హింసాయుతంగా నడిపితే నాలుగు రోజులు నడుస్తుందేమో కానీ దీర్ఘకాలికంగా నడపలేం. లక్ష్యాన్ని.. అంశాన్ని… ఆశయాన్ని సజీవంగా కాపాడుకుం టూ ముందుకుపోవాల్నంటే మనం పొలిటికల్ పంథాను తీస్కోవాలె’ అని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. అప్పుడు మేం ఎన్నికల కమిషన్ దగ్గ ర జేఎంఎంను ఒక పొలిటికల్ పార్టీగా రిజిస్టర్ చేసుకున్నం. కానీ, మీకు అట్లా కాదు. ఉద్యమ జెండా ‘రాజకీయ పార్టీగానే ఎగిరింది. భారత రాజకీయ వ్యవస్థను మెప్పించే శక్తిగా ముందుకు సాగుతున్నది’ అని జేఎంఎంకు, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సారూప్యాన్ని వివరించిండు.
ఝార్ఖండ్‌లో మిత్తీ కింద చేతికొచ్చిన వరి గొలుసులను నోటికి అందకుండా కోసుకెళ్లే వడ్డీ వ్యాపారుల ఆగడాలను ఎదుర్కొనేందుకు ఆదివాసీ గిరిజన యువతకు, మహిళలకు విల్లంబుల శిక్షణ ఇచ్చి కాపాడుకోవటమే కాదు ప్రజాస్వామ్య వ్యవస్థకు వీరతిలకం దిద్దిన పోరాట యోధుడిగా తెలంగాణకు ఆప్తబంధువుగా శిబూసొరేన్ ఎల్లకాలం నిలిచిపోతారు. ప్రజల ఆకాంక్షలకు, పోరాటాలకు శిబూ సొరేన్ ఎప్పటికీ ‘దిశోం గురువు’గా చిరస్థాయిగా నిలిచిపోతారు.