చీకటి ప్రయాణం.. ధనుర్మాసపు పొగ మంచు అడివిని కప్పేసింది. చిమ్మ చీకట్లో చిక్కటి నిశ్శబ్దపు తరంగాలను తడుముకుంటూ మా ప్రయాణం సాగిపోతున్నది. ఏవో ఆదిమ జ్ఞాపకాల్లో తనువు తడుస్తుండగా అడవి దారిలో వడివడిగా అడుగులు పడుతున్నాయి. పులి కనిపించలేదు గానీ, చలి పులై తరుముతుండగా నట్టడవిలో కుమ్మెన్పెంట వెచ్చని నెగళ్లతో అక్కున చేర్చుకున్నది. మా రాక కోసం పెంటకు పెంటంత కళ్లలో ఆర్తి నింపుకొని ఎదురుచూస్తున్నది.
వెదురు కర్రల దడి మీద గడ్డిగోపురాల తీరు గుడిసెలు మంచు నుంచి కాపు కాస్తున్నాయి. ఓ పాతిక దాకా ఉంటాయేమో. ఒక్కో గుడిసెకు రెండేసి సౌర పలకలు విద్యుత్తును వడకట్టి గుడిసెల్లోకి వంపుతున్నాయి. ఎండ పడితే ఓ లైటు వెలుగుతుంది. మబ్బులు కమ్మితే కరెంటు పోతుంది. చెంచుల కట్టూ బొట్టూ మారిపోతున్నయి. మాటామర్మం మనసుకెక్కుతున్నయి. బలవంతపు నాగరికమేదో ఒడుపుగా పెంటల్లోకి చొరబడుతున్నదనే ఆలోచనలను భగ్నం చేస్తూ అంజన్న సుర సుర కాలే తైద అంబలి పట్టుకొచ్చిండు. కాలే కడుపుకు తైదంబలి కమ్మగా అనిపించింది. ఓ పట్టు పడితే పానం నిమ్మలపడ్డది. నులక మంచం ఆల్చుకొని పడుకున్నం. అంజన్నకు అడవిల దొరికిన ఆడబిడ్డను సాకి సవరించి హైదరాబాద్ శ్రీచైతన్య కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నాడట. ఈ మాట విన్నప్పుడు ఆశ్చర్యం, అబ్బురం అనిపించింది. ఆ అడివి దాటి పట్నం దాకా పోయిన తొలి ఆడబిడ్డ ఈ బాలికే కావచ్చు. ఓ రాత్రి కాడ దిక్కులు పిక్కటిల్లుతున్నట్టు అడవి కోడి కూసింది. ఆ కూతకు నాకు మేల్క తట్టింది. చెంచు అంజన్న నిద్ర లేచిండు. ఆకాశం వంక చూసి గోరు కోళ్లు పొడిచినయి. ఇప్పుడే తెల్లారదు, పండుకో సారు అని అంజన్న సూచన. ‘కోడి కూసింది కదనే’ అని నేను అడిగితే… ఓ చిరు నవ్వు నవ్వి అదా..! కారుకోడి. అందరి కంటే ముందే లేచి అడవిని నిద్ర లేపుద్ది అని చెప్పారు.
ఇగో..! ఈ కారు కోడి జాడలను వెతుక్కుంటనే సహచర మిత్రుడు వర్దెల్లి వెంకటేశ్వర్లు మమ్ముల్ని ఈ కీకారణ్యంలోకి తీసుకువచ్చాడు. 12వ శతాబ్దంలో జరిగిన పలనాటి యుద్ధం నేపథ్యంలో చెంచు గిరిజన మానవ జీవిత పార్శ్వాన్ని తడుముతూ తను ‘కారుకోడి’ నవల రాస్తున్నాడు. ఈ నవలకు కావలసిన కథా వస్తువులు సేకరించడానికి ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, నేను, మరో జర్నలిస్టు మిత్రుడు ఆస్కాని మారుతీసాగర్ కలిసివచ్చాం. ఆలోచనలతోనే కన్నంటుకుంది.
‘వెదురు తడకలతోని ఎంతందమీ ఇండ్లు, ఆవు పేడ తోని అలికిన వాకిల్లు, చెంచుల నవ్వులే చెట్లకు పువ్వులు, రాలె పుప్పొడి వాన అడివి పూల వీణ, ఉరిమె నగరి కెరవ అడవి చెంతకు నడువ, అమ్మలా లాలించి అన్నింటిని మరిపించే పరుసుకున్న, రావి నీడల తావున పట్టిన కునుకులో పుట్టెనే ఈ పదం’ అంటూ గొరటి వెంకన్న కమ్మటి పాట పొద్దు పొద్దున్నే చెవులకు ఇంపుగా తాకంగ తెల్లారింది. ఆ రాత్రి గమనించలేదు గానీ, గుడిసె నిట్టారి గుంజకు స్విచ్ బోర్డులో సెల్ఫోన్ చార్జర్లకూ ఇంత చోటు దక్కింది. చెంచుల చేతికి విల్లమ్ములతో పాటు సెల్ఫోన్ వచ్చింది. ఎటొచ్చీ సిగ్నలే కరువు. ఊరి బయట ఏరు పక్కన అటొకటి, ఇటొకటి పంగల కర్రలు పాతి ఉన్నాయి. అందులో ఒకటి రాతియుగం, మరొకటి లోహయుగం. వాటిపై ఉన్న చిన్న బండపరుపు స్టాండ్ మీద ఫోన్ పెడితే సిగ్నల్ అందుకుంటుంది. ఇగ సంబురమే సంబురం. అంగుళం కదిలినా అంతా తుస్.
మానవ కృత్యం మొదలైంది. తోళ్ల వాగుకు ప్రవాహంతో నిండే బంగారి మడుగు దిక్కు బయల్దేరినం. కొద్ది దూరం నడక సాగితే అసలు సిసలైన అడవి ఆరంభమైంది. కింద పదును తేలిన ఏనె రాళ్లు.. పైన మొన తేలిన కొక్కెలా పరిక కంప.. దారికి రెండువైపులా జిట్టీత పొదలు.. శాగ మట్టలు. మిత్రుడు గోరటి వెంకన్నకు, వర్దెల్లికి పాత తొవ్వే. గోరటి అడవి జంతువును మించిన సంచార జీవి. 64 ఏండ్ల వయసులోనూ అలుపు లేకుండా.. అడుగు తడబడకుండా నడుస్తుండు. గోరటి పాటలతో, పరిశీలనతో తెలవకుండానే అడవి సాగిపోతున్నం. అల్లి మట్టల్లకు కలేవచ్చినం. దీన్నే ఎలుగల బయలు అంటారట. ‘ఎలుగులు ఉంటయి. చూసి నడువురి’ అంజన్న ఆదేశం. అంజన్నకు అడవి మీద అంతులేని పట్టుంది. ఏ కుర్వన ఏ జంతువు ఉంటదో… ఏ సార్వకు ఏ పాము ఉంటదో… కార్తెను బట్టి పొద్దును చూసి వాటి నడత, నడక పసిగట్టగల సమర్థత ఆయనది. ‘సీర్పులి తిరిగే సోటు.. మాట్లాడకుంటా నడువురి’ హెచ్చరికగా చెప్పిండు అంజన్న. ఆఖరికి బంగారి మడుగు అందింది. నీళ్లు దోసిళ్లకు తీసుకుంటే చల్లటి, తియ్యటి దివ్య జలంగా అనిపించాయి. స్నాన కార్యం ముగిసింది. దూరంగా భీమ లింగన్న వాగు మడుగు నీళ్లలో నానేసిన వెదురు పుల్లల్ని తీసి దులిపి, వాటికి బద్దలను కలిపి ఒడుపుగా బుట్టలు అల్లుతున్నడు. ఏమి చాకచక్యం? పైనుంచి పూతలు లేకుండానే అల్లికలోనే రంగులు పుట్టించడం తనకు తెలుసు. ఎటొచ్చీ అమ్మకమే సమస్య అని ఆయన కోడలు అంజ మ్మ చెప్పింది. సంతలో మారుబేరాలోళ్లు అడ్డికి పావుశేరు అడుగుతారని గోసతో చెప్పింది. తేనె సేకరణ, నాటుకోళ్ల పెంపకం కొంత ఆదుకుంటాయి. మేకల మంద కూడా ఉంది. లక్కరంగు మచ్చలున్న మేకలు ప్రత్యేకంగా అగుపించాయి.
చెంచులకు వేటంటే ప్రాణం కదా! మరిప్పుడు దాని సంగతేమైంది? గుడిసె చూరులో చెక్కిన పాత బాణం తీసి నా వెంట వచ్చిన మిత్రుడు సవరించబోతే పుటుక్కున ధనుర్భంగమైంది. ‘ఇంకేం యాట సారూ.. పిట్టనో కుందేలునే ఏస్తే ఫారెస్టోళ్లు వచ్చి పట్టుకుంటారు’ అని ఈదమ్మ వాపోయింది. ఒకప్పుడు అన్నలు, పోలీసులు పెంటల్లో దాగుడు మూతలు ఆడేవారు. ఇప్పుడా బాధ పోయింది. కానీ, కొత్త బాధ మొదలైంది. దగ్గర్లోని పట్నంలోనో, ఊరిలోనో ఇల్లు కట్టిస్తాం.. అడివి వదిలి రమ్మని అధికారులు పోరు పెడుతున్నారు. అదేదో సామెతకు భిన్నంగా చెంచులను కాడు పొమ్మంటుంది.. ఊరు రమ్మంటుంది. అందుకే చెట్టు మీద పిట్ట, చెట్టు కింద చెంచు రందిల మునుగుతుండ్రు. అంజన్న ముఖంలో దిగులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. చెటూ ్టపుట్టా నమ్ముకొని ఇన్నాళ్లూ బతుకు గడిపిండ్రు. ఎవుసం వైపు పోలేదు. దాంతో ఎక్కడెక్కడివాళ్లో వచ్చి సేతానం చేస్తుంటే చెంచులు కూలీలైపోయిండ్రు.
ఎనకటి ఇప్పసారా యాడ ఇగిరిపోయిందేమో గానీ, నాటుసారా పిశాచి చాన్నాళ్లుగా చెంచు మొగోళ్లను తెలివి మీరకుండా నిద్ర పుచ్చుతున్నది. ఇటీవలి కాలంలో ఐఎంఎఫ్ఎల్ ఆ పని చేస్తున్నది. కానీ, అంజన్న మేలుకున్నాడు. మూడేండ్లయింది తాగడం మానేసి. అయితే అందరూ అంజన్నలు కారు. ఇప్పటికీ ‘సార్ తాగ్తా సార్ తాగ్తా’ అంటూ మొగోళ్లు సీసెంబడి ఉరుకుతనే ఉన్నరు. ఆడోళ్లను తంతనే ఉన్నరు. తాగినా తాగకపోయినా తంతరు సారూ అని ఆడోళ్ల మీటింగ్లో ఓ చిన్నక్క చెప్పింది. చిన్న పిల్లలు కోళ్ల గుంపు లెక్క చానామందే ఉన్నరు. మట్టిలో ఆడుతున్నరు. వాళ్లల్ల ఓ ఐదారేండ్ల పిల్ల బాణం తయారు చేసుకుని నవ్వుకుంట నా మీదకే ఎక్కుపెట్టింది. ఎక్కడో బ్రెజిల్లో హెలికాప్టర్ మీదకు బాణం ఎక్కుపెట్టిన అడవి బిడ్డలు యాదికి వచ్చి నేనూ నవ్వుకున్న.
గుడిసెలకు వారగా ఓ కూలిన పొడవాటి గుడిసె ఉన్నది. పైకప్పు సగం పైగా లేచిపోయింది. ఎండి బొక్కలు దేలిన పశువు లెక్క కనపడ్డది. దాని ముందున్న సోలార్ ప్యానెల్స్ పనిచేయడం లేదు. అదీ అంగన్వాడీ పరిస్థితి. ‘మరింక పిల్లల చదువెట్ల’ అని ఓ తల్లి మనాది. ‘జర దీని సంగతి చూడుండి సారూ’ అని గోరటి వెంకన్నకు నివేదన. ఇలాంటి వేడుకోళ్లు చాలానే వచ్చినయ్. ఎవుసం జేద్దామంటే పందుల బాధతోని పంట దక్కడం లేదు. ఫెన్సింగ్ వేయించమని ఒకామె, రెండు ఎడ్లు ఇప్పించమని మరొకామె ఇలా పోటా పోటీగా అడిగిండ్రు. వారి రంది వెంకన్న ముఖంలోకి పారింది. ‘పోడు పట్టాలు అందరికీ వచ్చినయా’ అని అడిగితే ఎక్కువమందికైతే వచ్చినయ్ కానీ, ఇంక కొంతమందికి ఏవో కారణాల వల్ల ఆగినయ్ అన్నరు. అంతా విని తన చాతనైనంత చేస్తానని అనుకుంట లేసిండు.
భోజనం తర్వాత రచ్చబండ కాడ గానా బజానా. గోరటి వెంకన్న పాటలు పాతయి, కొత్తయి వాళ్లకు చానా తెలుసు. జీపులు నడిపే పిల్లలైతే ఆ పాటలు బంబం అని మోగిస్తరు. ఎదురుగ వెంకన్న ఉంటే సెల్లల్ల, జీపులల్ల ఇనొచ్చే పాటలెందుకు? మురిపెంగ పాట మీద పాట పాడిచ్చుకున్నరు. అంతల్నే వెంకన్న మీరు పాడరా తల్లీ అని ఆడోళ్ల వైపు తిరిగిండు. ముసి ముసి నవ్వులు నవ్వుకుంట ఎల్లమ్మ పాటందుకున్నది. ‘రామా దశరథ రామో’ అని, ఆ పాటల ఓ కోడెను ఎవరో పెద్దోళ్లు ఎత్తుకుపోయి ఇనుప సంకెళ్లు వేసి కడుపు నిండా గడ్డి పెట్టకుండా మాడ్చి చంపి సావు చేయడం కథ.
ఏ పూర్వకాలంలోనో చెంచుల మీద పాలకులు జరిపిన ఘోర దురన్యాయాల మీద కట్టిన పాటలా ఉన్నది. అయితే, నేరుగా కాకుండా మరుగున పెట్టి ఉంటుందంతా.. ఇంకోటి, ఇంకోటి అంటూ వెంకన్న బతిమాలి మరికొన్ని పాటలు పాడించిండు. సాధారణ జానపద గీతాల్లాగనే ఉన్నప్పటికీ అన్నీ కూడా చెంచులకు సంబంధించిన అస్తిత్వ పోరాట గీతాలే. ఇప్పటికీ వారి కష్టాలు తీరలేదు. అమ్మలాంటి అడవి నుంచి వారిని విడదీసేందుకు జరుగుతున్న కుట్రలు వారిని కృంగదీస్తున్నాయి. అడవులోని పులులను కాపాడాలంటున్నరు. కానీ, చెంచులను మాత్రం కాన వదిలి పొమ్మంటున్నరు. కన్న బిడ్డలకు కాయో ఫలమో ఇచ్చి ఆకలి తీర్చే తల్లిని వదిలి వెళ్లేందుకు మనసొప్పడం లేదు వారికి. ఇప్పుడు చెంచుల తలల మీద వేలాడుతున్న సమస్య ఇదే. పాటలు వెంటాడతుంటే మళ్లీ పట్నం బాట పట్టినం.