ఒకనాడు ప్రపంచ బ్యాంకు పేరు ఎత్తితే చాలు ఎరుపు మెరుపు గానాలు…‘వీధి’నాటకాలు… రచ్చబండ ముచ్చట్లతో పల్లెలు, కదం తొక్కేవి. సర్కారు భూములు… పడావుపడ్డ శిఖం భూముల్లో గుడిసెలు వేయించి గూడు లేని పేదోళ్ల గుండె ధైర్యంగా నిలబడిన పిడికిళ్లు కుర్చీలను సర్దుబాటు చేసుకుంటున్నాయి. పొత్తుల సంసారంలో పోరు బాటను మరిచిపోయాయనే వాదనకు మరింత బలం చేకూరేలానే రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును ఎత్తుకొని ముద్దాడుతుంటే ముందు నిలిచి ఎర్ర జెండా స్వాగత గీతం ఆలపిస్తున్నట్టుగానే ఉన్నది.
కాంగ్రెస్ సర్కార్‌తో అధికార భాగస్వామ్యం కాగానే కమ్యూనిస్టులు తమ పూర్వ రూపాన్ని కోల్పోయారు. సర్కార్ విసురుతున్న పదవుల వలలో కమ్యూనిస్టులు తరించిపోతున్నారు. తన అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాను కలిశానని, రాష్ర్టాభివృద్ధికి రుణం ఇచ్చేందుకు అంగీకరించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గోల్కొండ కోట సాక్షిగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో వెల్లడించారు. దీనిపై రాష్ట్రంలోని సీపీఐ, సీపీఎం పార్టీలు సర్కారు తీరుపై ఎటువంటి వైఖరిని ప్రకటించకపోవటంతో, అనంతర పరిణామాల్లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రభుత్వ ప్రతినిధులతో వరుస భేటీలవుతున్నారు. ‘సమీప భవిష్యత్తులో సెక్రటేరియేట్‌లో వరల్డ్ బ్యాంకు చాంబర్ కూడా ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న పరిణామాలు చెప్తున్నాయి.
కమ్యూనిస్టు పార్టీల నాయకులు అధికార పీఠానికి, ధూపదీప నైవేద్యాలకు దగ్గరగా చేరి ప్రజా పోరాటాలకు ఎప్పుడో దూరమయ్యారనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ పార్టీతో చెట్టా పట్టాలేసుకొని ఊరేగుతుండటం వల్లే ప్రజా పోరాటాలకు, ప్రజాస్వామిక ఆకాంక్షలకు కమ్యూనిస్టులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సీపీఐ, సీపీఎం పార్టీల్లో సీపీఐ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవటం, ఒక ఎమ్మెల్యే గెలవటం తెలిసిందే. కాంగ్రెస్ సర్కార్ యథేచ్ఛగా తీసుకున్న ప్రజావ్యతిరేక విధాన నిర్ణయాలను ఆ పార్టీ ఖండించకపోగా, గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న కారణం ఏమంటే… ఇప్పటికే దక్కిన ఒక కార్పొరేషన్ పదవితోపాటు, త్వరలో వెలువడే పదవుల కోసం ఆ పార్టీ ఎదురుచూస్తున్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తుల ఒరలో లేకపోయినా సీపీఎం కాంగ్రెస్‌తో సఖ్యతను ప్రదర్శిస్తూ ‘జీ హుజూర్’ తనాన్ని అనుసరిస్తున్నదనే విమర్శలు వినిపించాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల హక్కుల రక్షణ తమ ప్రథమ కర్తవ్యం అని బయటికి గంభీర ప్రకటనలే చేస్తాయి తప్ప వాటికి కార్యాచరణ ఉండదని అనేక సంఘటనలు రుజువు చేశాయి.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ప్రపంచబ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు దేశానికే దిక్సూచిగా మారిన సందర్భాలున్నాయి. డంకెల్ ప్రతిపాదనలు, ప్రపంచబ్యాంకు షరతులు, విద్యుత్తు సంస్కరణలు, సహజ వనరులు కొల్లగొట్టడం వంటి అనేక విషయాల్లో కమ్యూనిస్టు పార్టీలు ప్రజా చైతన్యాన్ని కూడగట్టడంలో ముందు నిలిచాయి. విద్యుత్తు సంస్కరణల పేరు మీద చంద్రబాబు హయాంలో సాగిన పోరాటాలు, బషీర్‌బాగ్ కాల్పులు కమ్యూనిస్టుల పోరాటానికి కొండగుర్తులు.
కార్మికలోకపు కల్యాణానికి ఖరీదు కట్టే షరాబు లేడని ఎలుగెత్తి చాటిన ఎరుపు గొంతుకల్లో ఉన్నపళంగా ‘పదవుల ఎర’ వచ్చిపడింది. కాంగ్రెస్ సర్కార్ ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న వ్యవహారం ఓ వైపు. కొనసాగుతున్న కూల్చివేతలతో పేదల కన్నీటిచాళ్లు పారుతున్న దృశ్యం మరోవైపు కనిపిస్తున్నా ఉభయ కమ్యూనిస్టులు తమ విధానపరమైన వైఖరిని ఇప్పటికీ వెల్లడించకపోవడం పట్ల సర్వత్రా అనుమానాలు కలుగుతున్నాయి. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణపై ప్రపంచబ్యాంకు పిడుగు ఏ రూపంలో పడుతుందోననే ఆందోళనా వ్యక్తమవుతున్నది. నీళ్లు… నిధులు… నియామకాలు అనే ట్యాగ్‌లైన్‌లో ఏ వనరుకు ప్రపంచబ్యాంకు ఎసరు పెట్టనుందోననే భయం వెంటాడుతున్నది.