Atrocities Against Dalits | దేశంలో దళితులపై దాడులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. రాజ్యాంగ రక్షణలు, రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ అట్టడుగువర్గాల ప్రజలపై కుల వివక్ష, హింస తగ్గకపోగా అంతకంతకు పెరుగుతుండటం గమనార్హం. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన 2022 నివేదిక ఈ విషయాన్నే ఎత్తిచూపింది. మొత్తం నమోదైన కేసుల సంఖ్య 51,656కు పెరిగింది. 2021తో పోలిస్తే ఇది 13 శాతం అధికం. ఇందులో సుమారు 98 శాతం కేసులు 13 రాష్ర్టాలకు చెందినవే. ఉత్తరాదికి చెందిన యూపీలో 12,287 (23.78%), రాజస్థాన్‌లో 8,651 (16.75%), మధ్యప్రదేశ్‌లో 7,732 (14.97%) కేసులు నమోదైనట్టు ఆ నివేదిక వెల్లడించింది.
బీహార్, ఒడిశా, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం కేసుల్లో ఈ ఆరు రాష్ర్టాల వాటా 81 శాతం వరకు ఉంటుంది. గత జూలైలో ఈ అంశంపై సామాజిక న్యాయశాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలే పార్లమెంటులో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు ఒక్కటే పరిష్కారమన్నారు. కానీ, అత్యధిక కేసులున్న 14 రాష్ర్టాల్లో 498 జిల్లాలుంటే 194 జిల్లాల్లోనే ప్రత్యేక న్యాయస్థానాలున్నాయి. అత్యధిక కేసులు నమోదైన యూపీలో ఎస్సీలపై అత్యాచారాలు జరిగే ప్రాంతాల గుర్తింపే జరగలేదు.
దళిత బహుజనుల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని బాకాలూదుకునే పార్టీల పాలనలో ఏండ్ల తరబడి కొనసాగిన రాష్ర్టాల్లో ఎస్సీలపై అత్యాచారాలు అత్యధిక స్థాయిలో నమోదు కావడం గమనార్హం. తూతూమంత్రం చందంగానే దళితుల క్షేమం, సంక్షేమం అక్కడ అమలవుతుండటమే ఇందుకు కారణం. నిచ్చెనమెట్ల కులవ్యవస్థను నడిపించే ఆధిపత్య భావజాలం వెర్రితలలు వేయడంపై అనునిత్యం వార్తలు వెలువడుతూనే ఉంటాయి.
దళిత పెండ్లికొడుకు గుర్రం మీద ఊరేగరాదని, దళితులు చెప్పులు వేసుకుని వీధుల్లో తిరగొద్దని, మీసాలు పెంచొద్దని, తలపాగాలు పెట్టుకోవద్దని హుకుం జారీ చేసే సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుండటం సభ్య సమాజానికి తలవంపులు తెస్తున్నది. ఈ ఆధిపత్య భావజాలమే అంతిమంగా దాడులకు దారితీస్తున్నది. ఇలాంటివి జరిగినప్పుడు పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ పనితీరు సందేహాస్పదం అవుతుంటుంది. నమోదయ్యే కేసుల్లో 61 శాతం మాత్రమే చార్జిషీటు దాకా వెళ్లడం ఇందుకు ఉదాహరణ.
దళితులపై అత్యాచారాల నివారణకు బహుముఖ, దీర్ఘకాలిక వ్యూహం అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పకతప్పదు. సామాజిక నిర్మాణాన్ని సమూలంగా మార్చడమూ తప్పనిసరి. సమాజానికి న్యాయం ప్రాముఖ్యతను వివరించేందుకు పటిష్ఠమైన ప్రచారోద్యమం ఏదీ లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కులవివక్షకు వ్యతిరేకంగా బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించేలా ప్రజల్లో చైతన్యం పెంచేందుకు జాతీయ స్థాయిలో కృషి జరగాలి. బడులు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాల్లో ఈ అంశానికి ప్రాధాన్యమివ్వాలి. చట్టాలకు ప్రజా చైతన్యం తోడైనప్పుడే దళితులపై అత్యాచారాలు, దాడులను రూపుమాపడం సాధ్యపడుతుంది.