2014 మే నుంచి దేశ రాజకీయ వికృత క్రీడలు, విలువల హననం, ప్రత్యర్థులనుకున్న వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం ఒకళ్లకు ఒకళ్లు సహాయం చేసుకోవటం, ముఖ్యంగా జాతీయ పార్టీలుగా వెలుగుతున్నవి ప్రాంతీయ పార్టీలను ఓడించుకోవటం కోసం రాజ్యాంగ విలువలను, ఎన్నికల నిర్వహణా కార్యక్రమంలో సిద్ధాంతాలను వదిలేయటం మొదలైన ప్రక్రియలన్నీ ప్రజలంతా గమనిస్తున్నారు. దేశంలోని మేధావులు, ప్రగతి కోరుకునేవారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీ మౌలిక సిద్ధాంతాలు ఏమిటి అని స్పష్టంగా చెప్పాలంటే ఈ విధంగా జవాబులివ్వాల్సి వస్తుంది.
భారతీయ జనాతా పార్టీ: కేవలం రాజకీయ లబ్ధి, అధికారం మాత్రమే ధ్యేయంగా పని చేసే పార్టీ. ఈ నాయకులకు రెండే పనులు ముఖ్యం. ఇంకా 6, 8 నెలల్లో ఏ రాష్ర్టాల్లో ఎన్నికలు వచ్చేటట్టు ఉన్నా, ఇక ఆ రాష్ర్టాల మీదే వారి దృష్టి. అక్కడ తమ పార్టీ అధికారంలో ఉంటే ప్రత్యర్థి పార్టీలకు మద్దతు తెలిపే ఓటర్లను ఎలా తిప్పుకోవాలి అనేది ఆ పార్టీ నైజం. ఏదైనా ఒక రాష్ట్రంలో బలమైన పార్టీ, లేక ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న పార్టీతో పొత్తులు పెట్టుకొని, ఆ పార్టీని చీల్చో, నిర్వీర్యం చేసో, తర్వాత ఎన్నికల్లో పైచేయి సాధించటం. 2014లో కేంద్ర ప్రభుత్వాన్ని చేజిక్కించుకోకముందు బీజేపీ కేవలం 5 రాష్ర్టాల్లో (చిన్న గోవా కూడా కలుపుకొని) మాత్రమే అధికారంలో ఉండింది. 2014 నుంచి 2026 లోపల ఆ సంఖ్య 17కు పెరిగిందంటే ఇక ఆ పార్టీ ఎన్ని రకాల అక్రమాలు చేసి ఉండవచ్చో అర్థం చేసుకోవచ్చు. తమాషా ఏమిటంటే తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రజలకైనా న్యాయమైన పరిపాలన అందించటం ఈ పార్టీ ధ్యేయం కాదు. కేవలం రాష్ర్టాలను కైవసం చేసుకొని అక్కడి సంపద అంతా గుజరాతీ పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టడమే ఆశయంగా పెట్టుకున్నదీ పార్టీ. ఇంకో ముఖ్యమైన పని మైనారిటీలను భయభ్రాంతులను చేయటం బీజేపీ ఆశయం.
కాంగ్రెస్ పార్టీ: ఇది ఒక అత్యంత దయనీయమైన స్థితిలోకి జారిపోయింది. ‘మా తాతలు నేతులు తాగారు’ అంటూ కుటుంబంలోని పూర్వనేతల వైభవాన్ని పొగుడుకుంటూ ఓట్లడుగుతున్నది. ఇందిరాగాంధీ తర్వాత రాజకీయాలు నడపగలిగే శక్తిలేని కుటుంబ సభ్యులు, కాస్త వారి పార్టీలో తెలివైన వాళ్లు ఉంటే వారిని తొక్కేయటం వంటి విన్యాసాలు చేసి, ఉన్న కొద్దిమంది మేధావులను పోగొట్టుకున్నది. అంతేకాదు, వారు చెప్పేవారి పూర్వీకుల మరణాలు కూడా వారి గొప్ప పనుల వల్ల జరగలేదు. స్వయంగా తాము చేసిన చేష్టలకు వారు బలయ్యారు.
నెహ్రూ భారత్ మీద చైనా యుద్ధం చేసిందన్న దిగులుతో చనిపోయాడని ప్రచారం చేశారు. కానీ నెహ్రూ 27 మే 1964న మరణించారు. అసలు కారణం ఏమిటంటే, చదువుకోమని లండన్ పంపిస్తే, 18 ఏండ్ల సంజయ్ గాంధీ (ఇందిరా గాంధీ రెండవ కుమారరత్నం) ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. ఫోన్ రాగానే నెహ్రూకు హార్ట్ ఎటాక్ వచ్చిందని ఓ విషయం ప్రచారంలో ఉన్నది. ఆ కుటుంబంలోని అతి ధైర్యవంతురాలైన రాజకీయవేత్త ఇందిరాగాంధీ. నిజానికి ఆవిడ పాలనలోనే భారతదేశానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. కానీ బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం ఇప్పించిన మంచి పనులతోపాటు, ఉగ్రవాదులను పెంచి పోషించారు. చివరకు గోల్డెన్ టెంపుల్లో దాక్కున్న వారిని మిలిటరీ వాళ్లు చంపటంతో సిక్కు మతస్థులకు ఆగ్రహం వచ్చింది. దానికి సమాధానంగా 1984న ఆమెను చంపేశారు.
ఇక రాజీవ్‌గాంధీ తనకు అవసరంలేని శ్రీలంక విషయంలో కల్పించుకున్నారు. నిజానికి శ్రీలంకలో తమిళులకు, ఆ దేశస్థులైన సింహళీయులకు జరిగిన అంతర్యుద్ధం ఆపటానికి చర్చలు జరిపి శాంతి సైన్యాన్ని పంపాలన్నారు రాజీవ్‌గాంధీ. కానీ తెలంగాణలో 1948-1952 మధ్య ప్రవర్తించినట్టే భారత సైన్యం అక్కడ ఉన్న తమిళులను వేధించింది. శాంతి స్థాపించకుండా, తమిళ కుటుంబాలను అన్ని రకాలుగా బాధించింది. నిజానికి భారతదేశంలో కూడా ఈ సైన్యాన్ని పంపిన చర్యను నిరసించారు ప్రజలు. రాజీవ్‌గాంధీ తన పూర్తి క్యాబినెట్‌ను సంప్రదించకుండా చేసిన చర్య అది. దానితో మార్చి 1991న తమిళ ఆత్మాహుతి దళ సభ్యులు బాంబులతో హత్యచేశారు. ఇక తర్వాత ఆయన తమ్ముడు ఆయన కంటే ముందే 23 జూన్ 1980లో చనిపోవటంతో ఇక ఆ కుటుంబంలోని వ్యక్తులకు ప్రధాని పదవి దూరమైనదనే చెప్పాలి. అప్పటి నుంచి (అంతకుముందు ఆ పార్టీ అవినీతి గురించి మనకు స్పష్టమైన ఆధారాలు లేవు) కాంగ్రెస్ పార్టీ అవినీతి బలహీనతకు గురైంది. వేరేవారు కేంద్రంలో, రాష్ర్టాల్లో అధికారంలోకి రావటంతో ఒక అభద్రతా భావంతో దేశంలోని అవినీతిని నియంత్రించకుండా, తానే అవినీతికి పాల్పడింది. ఆ క్రమంలో దేశ గ్రహచారం బాగులేక మతమౌఢ్య సిద్ధాంతాలు కలిగిన ఆర్ఎస్ఎస్ అండదండలతో ఒక పార్టీ అవతరించింది. మొదట 1951లో భారతీయ జనసంఘ్‌గా ఏర్పడి, 1977లో జనతా పార్టీ అన్నదానితో కలిసింది. అయితే గొప్ప రాజకీయవేత్త, మానవీయత కలిగిన నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో 6 ఏప్రిల్ 1980న ప్రస్తుత బీజేపీ ఏర్పడింది. నిజానికి కాంగ్రెస్ అవినీతికి, ఆర్ఎస్ఎస్ మత మౌఢ్యానికి ప్రజలు బలికాకుండా, సుఖశాంతులతో బతకాలని, దేశం ప్రగతి చెందాలని, ఆశించి వాజ్‌పేయి రూపొందించిన పార్టీ బీజేపీ!
ఇక ప్రస్తుత పరిస్థితికి, ప్రజలు అవగాహన పెంచుకొని ఎట్లా ఈ పరిస్థితులను ఎదుర్కోవాలో చూద్దాం. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ అనే విడివిడి పార్టీలు ఏమీ లేవు. వాళ్లందరూ ఒక్కటే. ప్రత్యర్థి పార్టీలను నాశనం చేసి తామే ఉండాలనుకొనే బీజేపీ సిద్ధాంతం ఎంత ప్రమాదకరమో, ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ అవినీతి, అసమర్థత అంతే ప్రమాదం. పైగా ఏ రాష్ట్రంలో అయినా స్థానిక పార్టీలకు ఉన్న అవగాహన ఉత్తరాదిని మాత్రం తమది అనుకొనే ఈ కేంద్ర పార్టీలకు ఉండదు.
ఆరు దశాబ్దాల తెలంగాణ బాధితులను పట్టించుకోకుండా ‘తల్లిని చంపి పిల్లకు జన్మనిచ్చారు’ అని రాష్ట్ర విభజన సమయంలో మోదీ చేసిన మూర్ఖపు వాదన తెలంగాణ ప్రజలు మర్చిపోకూడదు. అంతేకాదు, 54 ఏండ్లు కాంగ్రెస్ పాలనలో జరిగిన దోపిడీ, వివక్ష కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోకూడదు. ఒకసారి కాంగ్రెస్ పార్టీని గమనించాక, దానికి ఓట్లేసి గెలిపించడం వింత అజ్ఞానం! అంతేకాదు తెలంగాణ నుంచి కొల్లగొట్టిన సంపదతో బలిసి, ఇక్కడ స్థిరపడి, ఇంకా తెలంగాణ పార్టీకి, ప్రజలకు ద్రోహం చేయాలని, పెత్తనం సాగించాలని చూసే ఈ ఆంధ్రులు మద్దతు పలికే ఈ 2 జాతీయ పార్టీలు, టీడీపీని తెలంగాణ పూర్తిగా విస్మరించాలి.
అంతేకాదు, నిజానికి ఇప్పుడు పైన చెప్పిన మూడు పార్టీలు ఒకటే పార్టీ, అదే తెలంగాణ వ్యతిరేక పార్టీ (టీవీపీ) కాంగ్రెస్‌లోను, ఇతర చిన్నాచితక, ప్రాంతీయ పార్టీల్లోనూ ఉన్న సంపన్నులైన నాయకుల మీద అవినీతి కేసులు మోపి, భయపెట్టి బీజేపీలో చేర్చుకునే మోదీ, షా తంత్రం వల్ల ఇప్పుడు ఆ పార్టీలో 95 శాతం అవినీతిపరులే ఉన్నారు. ఇక కాంగ్రెస్ వెంటిలేటరు మీద ఉన్న పార్టీ, దక్షిణాది వారు బీజేపీ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్‌ను గెలిపిస్తున్నారు గతిలేక, దక్షిణాది రాష్ర్టాల వారు తమ ప్రాంతీయ పార్టీలను గెలిపించుకొని ఉత్తరాది దాష్టీకాన్ని ఎండగట్టాలి.
ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికలలాగ ప్రజలంతా తమకు మేలు చేసే నాయకుడు ఉన్న పార్టీని ఎన్నుకోవాలి. బీజేపీ, కాంగ్రెస్ ఇంకా తమిళనాడులో అధికారం చేపట్టిన కొత్త పార్టీకి ఎన్ని గండాలు కల్పిస్తారో. ప్రజాస్వామ్యంలో నిజాయతీగా ఉండవలసిన న్యాయస్థానాలను, ఎన్నికల సంఘాన్ని, గవర్నర్ వ్యవస్థను నిర్వీర్యం చేసి నాటకాలాడే ఈ రెండు పార్టీల పాలన ఇక చాలు. నిజానికి అవి రెండు పార్టీలు కావు, ఒకటే. అవినీతి, అక్రమాల జాతీయ పార్టీలు. తెలంగాణలో 800 నాటి గుడిని కూలగొడితే హిందుత్వ పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ దానిని వ్యతిరేకించదు. బీజేపీ నాయకుడి కొడుకు మీద కేసు వస్తే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం స్పందించరు.
తెలంగాణ రాష్ట్రం మీద పార్లమెంట్లో కొందరు అవాకులు, చెవాకులు వాగుతుంటే తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు అక్కడే కూర్చుండి ఎందుకు నోరు మెదపలేదు? ఇలాంటి నేతలు అవసరమా మన రాష్ర్టానికి? ఇకనైనా తెలంగాణ ప్రజలు ఈ కలగాపులగం పార్టీలను తరిమికొట్టి, తెలంగాణ రాష్ర్టానికి మంచి చేసే వారిని ఎన్నుకోవాలి. ఊరికే మన ముఖ్యమంత్రిలాగా పొంకణాలు కొట్టేవారిని కాదు, నిజంగా గతంలో మంచి చేసి తెలంగాణ రాష్ర్టాన్ని నిలబెట్టిన వారిని ఎన్నుకొని సుఖపడాలి. చూద్దాం. కాంగ్రెస్ పాలనలో (2023 నుంచి) బతికిన తెలంగాణ ప్రజలకు ఎంత అవగాహన పెరిగిందో కాలమే చెప్పాలి! జాతీయస్థాయిలో మోదీ, తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు, ఏ పార్టీలో ఉన్నారో తెలియని రేవంత్‌రెడ్డి మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం కావాలని తమ పథక రచన మొదలుపెట్టారు. జాగ్రత్త!