కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేండ్ల పాలనలో విద్యాశాఖ శక్తివిహీనంగా మారింది. విద్యాశాఖను తన వద్దే పెట్టుకొని ప్రపంచానికే మాడల్‌గా తీర్చిదిద్దుతానంటూ ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణలో విఫలమయ్యారు. ప్రస్తుతం విద్యాశాఖ తిరోగమనంలో పయనిస్తుండగా, అధికారుల అనాలోచిత నిర్ణయాలతో మరింత అభాసుపాలవుతున్నది. తాజాగా అగ్గిరాజేసిన జీవో 97 వివాదం విద్యాశాఖ విధానాలపై మరోసారి చర్చకు తెరతీసింది. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు ఈసెట్ పరీక్ష ద్వారా ల్యాటరల్ పద్ధతిన నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో జాయిన్ కావొచ్చు. ఇదే విధానం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నది. కాగా, రాష్ట్రంలో తెచ్చిన జీవో 97 ద్వారా ఈ అవకాశాన్ని రేవంత్ సర్కార్ తొలగించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ విధానాన్ని ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తున్నదో అర్థం కావడం లేదు.
స్వయంగా ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తున్న విద్యాశాఖ ఎటు పోతున్నదో అర్థం కావడం లేదు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికీ 25 ఎకరాల్లో అన్ని వసతులతో యంగ్ ఇండియా స్కూల్ కడుతామని చెప్పిన ప్రభుత్వం, ఆచరణలో మాత్రం శంకుస్థాపనలకే పరిమితమైంది. అదేవిధంగా 25 ఎకరాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పి, బీఆర్ఎస్ హయాంలో పూర్తయి విజయవంతంగా నడుస్తున్న మాడల్ స్కూళ్లు, జడ్పీ పాఠశాలలను ఎంపిక చేసి, పేర్లు మార్చి కొనసాగిస్తున్నది. ఆ తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటర్నల్ మార్కులను రద్దు చేస్తున్నామని చెప్పి, మళ్లీ వెనక్కి తీసుకున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, గురుకుల, కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు అవసరమయ్యేలా కిట్స్ అందిస్తామని సీఎం మాటలు నీటి పూర్తిస్థాయిలో ఆచరణకు నోచుకోవడంలేదు. ఇలా ప్రతి అంశంలోనూ విద్యాశాఖ పనితీరు అభాసుపాలవుతూనే ఉన్నది.
వాస్తవానికి పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్ల కోసం ఉద్దేశించిన బీటెక్ ల్యాటరల్ ఎంట్రీ పథకం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) 2000లో ప్రారంభించింది. కొన్ని రాష్ర్టాల్లో పలు విశ్వవిద్యాలయాలు 1990లోనే ప్రారంభించాయి. ఒక్కో కోర్సు మొత్తం మంజూరైన సీట్లలో 10 నుంచి 20 శాతం వరకు సీట్లను సూపర్‌న్యూమరీ సీట్లుగా కేటాయిస్తారు. దీని వల్ల పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లు నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరం (మూడో సెమిస్టర్)లో చేరడానికి వీలవుతుంది.
పాలిటెక్నిక్ డిప్లొమా తర్వాత బీటెక్ ల్యాటరల్ ఎంట్రీకి అర్హత పొందాలంటే మూడేండ్ల కోర్సులో 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. రిజర్వ్ క్యాటగిరీకి ఇది 40 శాతంగా ఉంటుంది. దీంతో పాటు ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఈసెట్ పరీక్ష రాస్తే ర్యాంకు ప్రకారం ఇంజినీరింగ్‌లో సీట్లు పొందుతారు. డిప్లొమా విద్యార్థులకు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం అనేది కేంద్రం నియంత్రణలో ఉండే ఒక దేశవ్యాప్త ప్రామాణిక విధానం. ఇప్పుడు ఇదే ఎంట్రీని తెలంగాణలో ప్రభుత్వం నిషేధిస్తూ జీవో 97జీవో ద్వారా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
ప్రభుత్వం జారీ చేసిన జీవో 97 అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద, మధ్య తరగతి విద్యార్థులకు తీరని నష్టం చేకూర్చే విధంగా ఉన్నది. విద్యాశాఖ ప్రక్షాళన కోసం మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యాకమిషన్ నర్సరీ నుంచి ఉన్నత విద్య గురించి ఓ నివేదిక తయారు చేసి, ప్రభుత్వానికి ఇచ్చింది. అందులోని దాదాపు అన్ని సిఫారసులను గాలికొదిలేసిన ప్రభుత్వం.. కేవలం ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్‌ను విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో పేద, మధ్య తరగతి వర్గాలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటిక్నిక్ కళాశాలలు 128 ఉండగా ఈ కళాశాలల్లో అత్యధికంగా దిగువ మధ్య తరగతి విద్యార్థులే ఉన్నారు. వీరు ఉచితం, అతి తక్కువ ఫీజుతో చేరుతున్నారని విద్యాకమిషన్ రిపోర్టులోనే ఉన్నది. వీరంతా మూడేండ్ల పాలిటెక్నిక్ పూర్తి చేసే నాటికి ఇంగ్లిష్ పరిజ్ఞానంతోపాటు కంప్యూటర్ సైన్స్, మిషన్ లెర్నింగ్, లాండ్ స్కేప్ డిజైన్ ఆర్కిటెక్చర్, సెమీకండక్టర్ టెక్నాలజీ, ఈవీ ఇంజినీరింగ్, తదితర అనేక కోర్సుల్లో చేరి చదువుకొని నిష్ణాతులవుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వీరందరికీ నష్టం చేకూర్చేలా ఉన్నది.
పాలిటెక్నిక్ కళాశాలల విషయంలో తెలంగాణ విద్యా కమిషన్ పలు సిఫారసులను పొందుపర్చింది. పరిపాలన, నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాలని సూచించింది. అందులో కొన్నింటిని పరిశీలిస్తే 2026 చివరి నాటికి పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉన్న 1,586 ఖాళీల్లో అధ్యాపకులను నియమించాలి. పాఠ్య ప్రణాళిక ప్రమాణాలను నిర్వహణ, కాలానుగుణంగా నవీకరణ చేపట్టాలి. విద్యా పరిపాలనా పద్ధతులు, బోధనా ప్రమాణాలు పెంపొందించాలి. ప్రస్తుతం అమలులో ఉన్న విధానంలో కాకుండా పాలిటిక్నెక్ విద్యార్థులను ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలోనే చేర్చుకోవాలని సిఫార్సు చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం అన్నింటినీ వదిలేసి అందులో ఉన్న ల్యాటరల్ను మాత్రం రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో ఇది పీపీపీ మాడల్‌లో ప్రైవేటీకరణ చేసే ప్రయత్నమేనని కొన్ని రోజులుగా పాలిటెక్నిక్ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టేందుకే పాలిటెక్నిక్‌ను ప్రైవేట్ పరం చేసే కుట్రలు చేస్తున్నదని మండిపడుతున్నారు.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
గుండా శ్రీనివాస గుప్తా 9182777526