Imports | ఆధునిక కాలంలో ఎవరూ ఊహించని రీతిలో హెజ్బొల్లాపై ఇటీవల ఇజ్రాయెల్ చేసిన వినూత్నమైన దాడులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. హెజ్బొల్లా తీవ్రవాదులే లక్ష్యంగా జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లలో ఆ సంస్థకు భారీ నష్టం జరిగింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. వేల మంది గాయాలపాలయ్యారు. ప్రధానంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పరికరాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడులు సరికొత్త భయాందోళనలకు దారితీశాయి. దిగుమతి చేసుకునే ఆయుధాల వాడకంపై అనుమానాలను రేకెత్తించాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా రక్షణరంగ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉన్న నేపథ్యంలో దేశ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఏడాది కిందట మొదలైన యుద్ధం క్రమంగా పశ్చిమాసియా అంతటా వ్యాపిస్తున్నది. ఈ యుద్ధంలో ఇరువైపులా భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్, లెబనాన్ లాంటి దేశాలు, హెజ్బొల్లా, హౌతీ లాంటి ఉగ్రవాద సంస్థలు పాలస్తీనాకు మద్దతుగా నిలిచాయి. లెబనాన్ పరోక్ష సహకారంతో ఇజ్రాయెల్‌పై మొదటినుంచీ హెజ్బొల్లా విరుచుకుపడుతున్నది. దాన్ని నిలువరించే క్రమంలోనే పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చింది.
టెలిఫోన్లు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు లాంటి అధునాతన కమ్యూనికేషన్ పరికరాలు అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలోనూ హెజ్బొల్లా ఇప్పటికీ పేజర్లు, వాకీటాకీలనే వాడుతుండటం ఆశ్చర్యకరం. అత్యాధునిక పరికరాలను ఉపయోగించి హెజ్బొల్లా జరిపే అన్ని సంభాషణలను ఇజ్రాయెల్ ట్రాక్ చేస్తున్నది. ఈ కారణంగానే ఇజ్రాయెల్ వద్దనున్న ట్రాకింగ్ వ్యవస్థలకు చిక్కకుండా ఉండేందుకు దశాబ్దాల కిందటి పేజర్లనే హెజ్బొల్లా వినియోగిస్తున్నది. తయారీ సమయంలోనే పేజర్లను ట్యాంపర్ చేసి, వాటిలో చిన్న మొత్తంలో పేలుడు పదార్థాలను ఇజ్రాయెల్ అమర్చినట్టు తెలుస్తున్నది.
ఇప్పుడు ఈ అంశమే మన దేశం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్తున్నది. ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నది మన దేశమే కావడం గమనార్హం. ప్రపంచ దిగుమతుల్లో భారత్ వాటా 9.8 శాతం. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రీ) ప్రకారం.. 2014-23 మధ్యకాలంలో బీజేపీ హయాంలో గతంతో పోలిస్తే 4.7 శాతం దిగుమతులు పెరిగాయి. భారత దిగుమతుల్లో 36 శాతం రష్యా నుంచి వస్తున్నవే. ఫ్రాన్స్, అమెరికాల వాటా 46 శాతం. అంతేకాదు, ఇజ్రాయెల్‌తో పాటు మరికొన్ని దేశాల నుంచి కూడా భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నది.
ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లాంటి గొప్ప గొప్ప నినాదాలు ఇచ్చే మోదీ హయాంలోనే రక్షణరంగ దిగుమతులు మరింతగా పెరిగాయి. అదే సమయంలో బడ్జెట్లో రక్షణరంగ కేటాయింపులు భారీగా పడిపోయాయి. 2014లో మొదటిసారి మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో 17 శాతంగా ఉన్న రక్షణరంగ కేటాయింపులు తాజా బడ్జెట్‌కు వచ్చేసరికి 13 శాతానికి దిగజారాయి.
అంతేకాదు, రక్షణరంగ వ్యయం జీడీపీలో 2 శాతం కంటే దిగువకు పరిమితమైంది.
విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుండటం వల్ల మరో నష్టమూ జరుగుతున్నది. ఆలస్యం కారణంగా ఉత్పత్తులు సమయానికి అందుబాటులోకి రావడం లేదు. తేజస్ ఎంకే-1ఏ ఫైటర్ జెట్ విషయాన్నే తీసుకుందాం. ఈ ఫైటర్ జెట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. విదేశాల నుంచి దిగుమతి కావాల్సిన దాని ఇంజిన్ సమయానికి అందకపోవడమే అందుకు ప్రధాన కారణం. అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ ఇంజిన్‌ను సమయానికి అందించడంలో విఫలమవడంతో ఈ ఏడాది మార్చిలో అందుబాటులోకి రావాల్సిన ఈ ఫైటర్ జెట్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. జెట్ ఇంజిన్ ఉష్ణోగ్రతను గణించే ఓ చిన్న పరికరం కూడా ఇంకా దిగుమతి కాలేదు. ఇలా చిన్న చిన్న పరికరాల కోసం కూడా విదేశాలపై ఆధారపడటం మన రక్షణ రంగ దుస్థితికి నిదర్శనం.
పాకిస్థాన్‌కు అతిపెద్ద రక్షణ రంగ ఎగుమతిదారుగా ఉన్న చైనాలో తయారైన డ్రోన్ పరికరాలను దేశంలోని పలు కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. డ్రోన్లలో వాడే కెమెరాలు, సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ పరికరాలకే ఈ నిషేధం పరిమితమైంది. హెజ్బొల్లాపై జరిగిన దాడుల నేపథ్యంలో ఇతర పరికరాలపై నిషేధం విధించడంతో పాటు దిగుమతులను కూడా భారీగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది.
అయితే, దేశంలో ఒక్కసారిగా విదేశీ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించడం అంత సులభం కాదు. దేశంలో ఉత్పత్తిని పెంచుకుంటూ క్రమంగా తగ్గించడం కష్టసాధ్యమూ కాదు. ప్రోటోటైప్ దశలో విదేశీ పరికరాలను వినియోగించడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. కానీ, ఉత్పత్తికి వచ్చేసరికి కచ్చితంగా దేశీయంగా తయారైన పరికరాలనే వాడాలి. అందుకు ఆత్మనిర్భర్ భారత్‌ను మరింత పటిష్ఠం చేయాలి. నినాదాలకే పరిమితమైపోయిన మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లను క్షేత్రస్థాయిలోనూ అమలు చేయాలి. అందుకు బడ్జెట్ కేటాయింపులను పెంచడంతో పాటు ప్రభుత్వ రక్షణరంగ సంస్థలను బలోపేతం చేయాలి. దాంతో పాటు ప్రైవేట్ పెట్టుబడులకు కూడా ఎర్రతివాచీ పరచాలి. అప్పుడే దిగుమతుల తగ్గింపుతో పాటు దేశీయ ఉత్పత్తి లక్ష్యాన్ని కూడా చేరుకోగలం.
– ఎడిటోరియల్ డెస్క్