‘పాలిచ్చే బర్రెను అమ్మి దొంగ దున్నపోతును కొనుక్కున్నట్టు’ అయింది తెలంగాణ ప్రజల పరిస్థితి. మంచి దున్నపోతు అయితే నాగలి దున్నడానికైనా పనికొచ్చేది. కానీ ఈ దొంగ దున్నపోతు మోపులకు మోపులు, మూటలు మేయడానికి తప్ప.. దేనికీ పనికిరాదు. ఈ రంగం.. ఆ రంగం అని లేకుండా.. పూర్తిగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పాతాళానికి తొక్కేశారు కాంగ్రెస్ పాలకులు. రెండున్నరేండ్లలోనే తెలంగాణను ఏ స్థాయిలో కుప్పకూల్చారో.. మూడు బడ్జెట్లలోనే బహిర్గతమైంది.
2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్ర బడ్జెట్ రూ.1,00,638 కోట్లు. బీఆర్ఎస్ మొదటి విడత పాలన ముగిసే 2018-19 నాటికి దానిని రూ.1,74,454 కోట్లకు తీసుకెళ్లారు. అంటే 73 శాతం పెంచారు. రెండోసారి బాధ్యతలు చేపట్టాక 2018-19 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు దానిని రూ.2,90,296 కోట్లకు పెంచారు. అంటే రెండో దఫాలో 66 శాతం పెంచారు. ఈ ఐదేండ్ల్ల మధ్యలో నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. రెండు, మూడేండ్లు కొవిడ్ విలయతాండవం చేసింది. ఆయా సందర్భాల్లో ఆదాయం కొంతమేర తగ్గినా.. మళ్లీ వెనువెంటనే వేగంగా రికవరీ అయ్యేలా కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలను అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా అభినందించింది.
మొత్తంగా రెండు టర్మ్‌ల కేసీఆర్ పాలనలో బడ్జెట్ 188 శాతం పెరిగింది. అంటే 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్నదాంతో పోలిస్తే మూడింతలకు పెంచిన ఘనత కేసీఆర్‌ది. ఏడాదికి సగటున 18.8 శాతం పెరుగుదల కనిపించింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం పూర్తిగా దివాలా దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లే ఈ లెక్కలు చెప్తున్నాయి. కాంగ్రెస్ గద్దెనెక్కాక రాష్ట్ర ఆదాయం పడిపోయింది. ఆదాయం వచ్చే వ్యవస్థలన్నింటినీ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నది.
‘పోశమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసింది’ అన్నట్టుగా సీఎం, మంత్రులు, ఆ పార్టీ నాయకులు.. వారికి ఆదాయం వచ్చే మార్గాలను పెంచుకుంటున్నారు. మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చినా.. రైతులకు రైతుభరోసా ఇవ్వడంలేదు. రేవంత్‌రెడ్డి తొక్కుడు దెబ్బకు తొలి ఏడాదిలోనే రూ.16,238 కోట్ల బడ్జెట్ పడిపోయింది. ఐదేండ్లు పూర్తయ్యే సరికి.. రాష్ర్టాన్ని పూర్తిగా దివాలా తీయించి.. దండుకొని, సూట్‌కేసులు నింపుకొని పోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారనేది స్పష్టమవుతున్నది. దీనిని అడ్డుకోకపోతే.. తెలంగాణ ఆగం కావడం ఖాయం.
– (వ్యాసకర్త: రెడ్కో మాజీ చైర్మన్) వై.సతీశ్‌రెడ్డి 9641466666