అమెరికా ఇరాన్ మధ్య ఐదు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం ఒక విచిత్రమైన దశలోకి చేరింది. ఇది పూర్తి స్థాయి యుద్ధమా? లేక శాంతి దిశగా ప్రయాణమా? అనే ప్రశ్నలకు సమాధానం లేని స్థితి. ఒకవైపు బలప్రయోగం ద్వారా ఆధిపత్యం సాధించాలని అమెరికా ప్రయత్నిస్తుండగా, మరోవైపు వ్యూహాత్మక ఒత్తిడి ద్వారా పైచేయి సాధించాలని ఇరాన్ ప్రయత్నిస్తున్నది. కానీ ఈ రెండు దేశాలు తమ లక్ష్యాలను సాధించడంలో విఫలమవడం వల్ల ఈ స్తబ్దత మరింత పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడులు నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించడం ఎవరినీ ఆశ్చర్యానికి గురిచేయలేదు. ఎందుకంటే ఆయన యుద్ధానికి విరామం చెప్పడం ఇదే మొదటిసారి కాదు. సమరమూ-శాంతి దాగుడుమూతలు ఆడుతుండటం ప్రపంచానికి విసుగు తెప్పిస్తున్నది.
అయితే తాజా విరామానికి మాత్రం పశ్చిమాసియాలోని అమెరికా మిత్రదేశాల ప్రోద్బలం ఉండటం గమనార్హం. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ విజ్ఞాపన మేరకు దాడులు నిలిపివేస్తున్నట్టు ట్రంప్ మీడియాకు చెప్పారు. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగిస్తూ విధ్వంసం సృష్టిస్తున్నది. ఈ యుద్ధ వలయం నుంచి బయటపడేందుకు అరబ్ దేశాలు సహజంగానే అమెరికాపై ఒత్తిడి తెస్తున్నాయి.
అమెరికాఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఈ ఏడాది ఫిబ్రవరిలో యుద్ధం మొదలైంది. ప్రతిగా ఇరాన్ హొర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. యుద్ధం సత్వరమే ఓ కొలిక్కొచ్చి అంతా చక్కబడితే చాలని ప్రపంచం వేయికండ్లతో ఎదురుచూస్తున్నది. కానీ క్షేత్రస్థాయిలో యుద్ధం కంటే గందరగోళమే ఎక్కువగా నెలకొన్నట్టు కనిపిస్తున్నది. అమెరికా రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ట్రంప్ మొదలుపెట్టిన యుద్ధంపై అగ్రరాజ్యం పట్టు కోల్పోతున్నది, ప్రపంచాధిపత్యం పట్టు సడలుతున్నది. కొన్ని గంటల్లో లేదా రోజుల్లో తేలుతుందనుకున్న యుద్ధం నెలలైనా ముగియడం లేదు.
ట్రంప్ ఆశించినట్టు నాయకత్వ మార్పు జరగలేదు, ప్రజలు తిరగబడి అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడనూ లేదు. ఇరాన్‌ను తన దారికి తెచ్చుకోవడం వెనెజువెలాను ఆక్రమించుకున్నంత సులువు కాదని అమెరికా అధ్యక్షునికి తెలిసివచ్చింది. ఇరాన్ బలమైన ప్రతిఘటనతో అసలుకే మోసం వచ్చింది. యుద్ధం ముందుకూ వెనుకకూ కదలని ప్రతిష్ఠంభన ఏర్పడింది. యుద్ధం మొదలు పెట్టడం మాకే తెలుసు, ముగించడమూ మా చేతుల్లోనే ఉంటుంది అనేది అమెరికా ఆధిపత్య ధోరణి. ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టనైతే పెట్టింది కానీ ముగింపు కొరకరాని కొయ్యగా మారుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరాక్‌లో, అఫ్గానిస్థాన్‌లో మిషన్ అకాంప్లిష్డ్ (లక్ష్యం పరిపూర్తి అయ్యింది) అనుకుంటూ బయటపడ్డారు. కానీ ఇక్కడ ఉన్నది ఇరాన్ కావడంతో కథ అడ్డం తిరిగింది.
అయితే ఈ యుద్ధం ఎందుకు ముగియడం లేదనేది అసలు ప్రశ్న. కారణం స్పష్టమే. అమెరికా గెలువలేదు. ఇరాన్ ఓడిపోదు. ఈ ప్రతిష్టంభన ఇప్పుడప్పుడే ముగిసేలా మాత్రం కనిపించడం లేదు. తన షరతులను రుద్దాలని అమెరికా శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఇరాన్ మాత్రం హొర్ముజ్ జలసంధిపై నియంత్రణను ఒక ఆయుధంగా ఉపయోగించి ఒత్తిడి పెంచుతున్నది. ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడం వల్లే స్తబ్దత ఏర్పడుతున్నది. చర్చ లు జరుగుతున్నాయని ట్రంప్ ప్రకటిస్తుండగా, వాటిని ఇరాన్ పూర్తిగా ఖండిస్తున్నది.
ఒకరోజు చర్చలు, మరుసటిరోజు బెదిరింపులు, ఆ మరుసటిరోజు మళ్లీ దాడులు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఈ పీటముడి నుంచి బయటపడే ప్లాన్-బీ అమెరికా దగ్గర ఉన్నట్టు లేదు. అందు కే అమెరికా ఊగిసలాటలో పడింది. ప్రపంచదేశాలు యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలికే దౌత్యపరమైన చొరవకు ఇదే అదనుగా భావించాలి. ఈ దాగుడుమూతల యుద్ధం కట్టుతప్పి మరో ప్రపంచ యుద్ధంగా మారకముందే ఆ దిశగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.