కాకతీయులు జన్మించిన కదనభూమి ‘తెలంగాణ’. పోతన, కాళన్న, కుమ్రంభీం, దొడ్డి కొమురయ్య, షేక్ బందగీ, దాశరథి, వట్టికోట, సుద్దాలను కన్న వీరభూమి ‘తెలంగాణ’. సమ్మక్క-సారక్క, ఐలమ్మల సాంస్కృతిక వీరత్వాన్ని పురుడుపోసుకున్న పుడమి ‘తెలంగాణ’.
ఆంధ్రా మీడియా జాగీర్దారీ, నిరంకుశత్వం ఫ్యూడల్ జాగీర్దారీ వలె కొనసాగుతున్నది. తన మేధావితనాన్ని అంగీకరించకుంటే, తనకు జేజేలు కొట్టకుంటే స్ట్రింగ్ ఆపరేషన్లతో వెంటాడే కుటిలత్వం. ‘పెడితే పెండ్లి.. లేకుంటే చావు’, ‘తనకు లొంగితే ఆకాశం కాదంటే పాతాళం’ అన్నట్టుగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కథనాలు వండివార్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలోనే ఆ మేధావి ఆదివారం ఆంధ్రజ్యోతిలో ‘తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా’ అంటూ విద్వేష కథనాన్ని వండి వార్చాడు. ఈ కథనాన్ని తెలంగాణ ఆత్మగౌరవంపై దాడిగా చూడాలి. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఇప్పటిదాకా తప్పుడు రాతలకే పూనుకున్న తెలంగాణ ద్రోహుల మీడియా ఆంధ్రజ్యోతి పేపర్, ఏబీఎన్ చానల్. అందుకే ఆ మీడియా సృష్టిస్తున్న దుర్మార్గానికి చరమగీతం పాడాలి.
2009, నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షతో ఉద్యమం పతాకస్థాయికి చేరుకున్న వేళ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ అనేక కుట్రలకు తెరలేపారు. ఆసలు తెలంగాణనే రాదు, వచ్చే అవకాశమే లేదంటూ కట్టుకథలు అల్లారు. దీంతో చాలామంది తెలంగాణ బిడ్డలు ఆత్మార్పణం చేసుకున్నారు. దీనికి కారణం రాధాకృష్ణ రాసిన విషపు రాతలే. అస్తిత్వవాద మనోభావాలకు విరుద్ధంగా వారం వారం ‘కొత్తపలుకు’లో రాసే చెత్తరాతలతో తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి!
అడ్డమైనోళ్లందరికి తెలంగాణ రాష్ట్రమంటే అలుసైపోయింది. ఇవే రాతలు మహారాష్ట్ర లోనో, తమిళనాడులోనో రాస్తే బతికి బట్టకట్టగలుగుతారా? తెలంగాణ అంటే నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ కేతనం.
ఓ దిక్కు తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో తొలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 369 మంది చావులకు కారకుడైన కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ట్యాంక్‌బండ్ మీది ఆంధ్రోళ్ల విగ్రహాలను గౌరవంగా ప్యాక్‌చేసి ఏపీకి పంపించాలని కవులు, రచయితలు కోరుతున్నారు. ఈ లొల్లి ఇలా ఉండగానే తెలంగాణ గౌరవానికి భంగం కలిగించేలా ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని హైదరాబాద్ గుండెల మీద కుంపటిలా పెట్టిండ్రు. విగ్రహాలు పెట్టడానికి వాళ్ల రాష్ట్రంలో జాగా లేదా? ఇదిలా ఉంటే మరోవైపు ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది తెలంగాణ అస్తిత్వంపై స్వారీ చేయడం కాదా?
తెలంగాణ ప్రజలు విజ్ఞులు. ఇప్పుడిక్కడ టీడీపీ అడుగు పెడితే దానికి ఆదరణ ఎలా ఉంటుంది? తెలంగాణ ఉద్యమ నాయకులను తిడితే ఇక్కడి ప్రజల ప్రతిస్పందన ఎలా ఉం టుంది? తెలంగాణ ఆత్మగౌరవ నినాదం ఇంకా సజీవంగా ఉందా? అని తెలంగాణ ప్రజల మనోభావాలను కొలిచేందుకు ‘మహాన్యూస్’ అసభ్యకరమైన థంబ్ నెయిల్స్ పెట్టి ఒకవైపు తమ టీఆర్పీ రేటింగ్ పెంచుకుంటూనే, మరోవైపు కుట్రపూరిత ఆలోచనలకు తెరతీసింది. తానేది రాసినా చెల్లుతుందనే అహంకార ధోరణితో ఆ చానల్ ఇష్టారీతిన ప్రవర్తించింది. అవి వాస్తవమైతే, వాటిని ‘వెబ్సైట్’లో అలాగే ఉంచాలిగా, ఎందుకు డిలీట్ చేసినట్టు? ఆ మీడియా చేసిన ఘనకార్యాన్ని కప్పిపుచ్చేందుకు కొందరు ‘పొరపాటు’ అని మాత్రమే చెప్తున్నారు. కచ్చితంగా అది పొరపాటు కాదు, అదొక అహంకార, ఆధిపత్య ప్రకటన. తెలంగాణ స్వీయ నాయకత్వాన్ని బద్నాం చేసే కుట్ర, పన్నాగం. మహాన్యూస్ రాతలను ఖండించకుండా కొందరు నాయకులు మంగళహారతుల్లా కండ్లకద్దుకోవడమే మనం చేసుకున్న దౌర్భాగ్యం.
నిజానికి బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ‘మీడియా బాధ్యతగా వ్యవహరించాల’ని మాత్రమే అన్నారు. మీడియా బాధ్యతగా ఉండాలనడం తప్పెట్లయితది? అట్లాగే రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తిని ‘మరుగుజ్జు’ అని హేళన చేయడం ‘గుజ్జు’ ఉన్నవాళ్లు చేసేపని కాదు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన ‘కొత్త పలుకు’లో బీఆర్ఎస్పై అక్కసును తెలంగాణ మీద వెళ్లగక్కిండు. ఇంకెక్కడి ‘సెంటిమెంట్’ అని రాసిండు. తెలంగాణ అనేది సెంటిమెంట్ కాదు. ఆత్మగౌరవ కేతనం, ధిక్కార స్వరం అని ఆయన తెలుసుకోవాలి. ప్రతీ తెలంగాణోడికి ఈ ప్రాంతం మీద చచ్చేదాకా ప్రేమ ఉంటుంది. సచ్చిన తర్వాత కూడా తమ కట్టె ఇక్కడే కాలాలని కోరుకుంటారు. ఈ ఇష్టాన్ని సెంటిమెంట్‌గా చెప్పడం ఇక్కడి ప్రజలను తక్కువచేసి అవమానించడమే! రాజకీయ పార్టీలను విమర్శించడం, పొగడటం ఆ పత్రిక సంపాదకుడి ఇష్టం. అయితే చంద్రబాబు ప్రయోజనాల కోసం తెలంగాణను బజారుకీడ్చడం సరికాదు. రాధాకృష్ణ తన వ్యాఖ్యానంలో ‘గత ఎన్నికల్లో టీడీపీ సానుభూతి పరులు కాంగ్రెస్‌కు ఓటువేశారు. ఈ కారణంగానే ఖమ్మం వంటి జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజారిటీ లభించింది’ అని రాశారు. అలా అయితే గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా గెలువలేదు. అంటే ఇక్కడ టీడీపీ సానుభూతిపరులు లేరన్నట్టేనా? మరి లేనిదానికి చంద్రబాబు అరెస్టు సమయంలో హైటెక్ సిటీలో ఆయన సానుభూతిపరులు ర్యాలీ తీసే ప్రయత్నాన్ని అడ్డుకొని కేటీఆర్ హేళనగా మాట్లాడటమే నష్టం చేసిందని ఎట్లా చెప్తావు? ఈ హేళన జరిగిన ప్రాంతంలోనే కదా బీఆర్ఎస్ గెలిచింది. ఇట్లా గెలవడానికి ‘కమ్మ’ సామాజికవర్గం కార్డు పనిచేసిందని చెప్పినా చెప్తారు. అలాగైతే మరి గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఎందుకు గెలువలేదు? ఇదంతా బీఆర్ఎస్ మీద ప్రేమతో చెప్తున్నది కాదు, మీ తొండి మాటలు, రోత రాతలు ఎత్తి చూపడానికి తీసుకున్న ఉదాహరణలు మాత్రమే.
కాంగ్రెస్‌ను గెలిపించడానికి టీడీపీ తెలంగాణలో పోటీ చేయలేదా? మళ్లీ ఇదే టీడీపీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే లాభమా, నష్టమా? అని బేరీజు వేసుకునేందుకు తన అనుంగు మీడియా ‘మహా న్యూస్’ ‘థంబ్ నెయిల్’ ద్వారా తెలంగాణ ప్రజల అంతరంగాన్ని మాయ చేయడానికి ప్రయత్నిస్తున్నదా? అనే అనుమానం కలుగుతున్నది. తెలంగాణ అస్తిత్వం ఒక్క బీఆర్ఎస్ సొత్తు కాదని, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందినందున ఆ పార్టీకి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ సరిగ్గా గుర్తించలేదు కానీ, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన ఆంధ్రా పత్రికల్లో ‘ఆంధ్రజ్యోతి’ కూడా ఒకటని ఆనాడు తెలంగాణవాదులందరూ నడిరోడ్ల మీద పత్రికా ప్రతులను తగులబెట్టిన సంగతి మరిచిపోయారా? ఇప్పటికీ ఆంధ్రా పేరుతో తెలంగాణలో చెలామణి అవుతున్న పత్రికలు ఉద్యమ సమయంలో చేసిన వాదననే మళ్లీ, మళ్లీ చర్చలోకి తెస్తున్నాయి. ప్రపంచం కుగ్రామం అవుతున్నది. ఎవరెక్కడైనా చదువుకోవచ్చని మాట్లాడుతున్నారు. అవును, ప్రపంచం ఎంత కుగ్రామమైనా కన్నతల్లి తల్లి కాకుండా పోదు కదా. తొడిగిచ్చిన మూలాలు అసలు మూలాలు కావు కదా?
తెలంగాణ వచ్చిన తర్వాత విశాలాంధ్ర ‘మన తెలంగాణ’గా, ప్రజాశక్తి ‘నవ తెలంగాణ’గా రాష్ట్ర అవతరణ దినోత్సవం మరుసటి రోజునే పేరు మార్చుకున్నాయి. ప్రజాస్వామ్యాన్ని, తెలంగాణ స్వాతంత్య్ర పోరాటాన్ని ఆ పత్రికలు గౌరవించాయి. కానీ, ఈ మేధావి పత్రిక అయిన ‘ఆంధ్రజ్యోతి’ పేరు మార్చుకోకుండా తెలంగాణలో కొనసాగుతున్నది. తెలంగాణ ప్రజల కష్టాన్ని ప్రకటనల పేరుతో దోచుకుంటూనే ఉన్నది.
నాడు ‘జై తెలంగాణ’ అంటేనే ఆంధ్రజ్యోతి పత్రిక ఒంటికాలిపై లేచింది. కానీ, నేడు తానే ఉద్యమం నడిపినట్టు కితాబిచ్చుకుంటున్నాడు రాధాకృష్ణ. ఉద్యమా న్ని అణచివేస్తూ నీ పత్రిక పెట్టిన శీర్షికలను తెలంగాణ గడ్డ ఎప్పటికీ మర్చిపోదు. నీ మర్మపు పలుకులు అందరికి తెలుసు. నీ అక్షరం సమైక్యవాదులకు జీవం. నీ పత్రిక కుట్రదారుల చేతిలో కర్ర. అసలు ఉద్యమం అంటే నీకు తెలుసా? ఏనాడైనా తెలంగాణ ఉద్యమమంలో పాల్గొన్నవా? ఉద్యమంలో మీ అక్షరాలు ఎవరి పొదిలో కత్తులో మాకు తెల్వదా? అడ్డగోలు తనాల్ని, అవాంతరాలను ఈ గడ్డ ఇంకా పావురంతో భరిస్తూనే ఉన్నది.
తెలంగాణ సాధన అనంతరం మొదటి శాసనసభలో శాసనసభ్యులకు ప్రమాణస్వీకారం చేయరాదని పెట్టిన వెక్కిరింతల శీర్షికలను తెలంగాణ సమాజం ఇంకా మరిచిపోలేదు. 24 గంటల కరెంటు ఇస్తమంటే కుంగిపోతివి. రైతుబంధు అంటే పొయ్యిలో ఉప్పుపోసినట్టే చేస్తివి. మిషన్ కాకతీయ అంటే లెక్కలేని టీఎంసీల కన్నీళ్లు కార్చితివి. అసలు తెలంగాణ అంటేనే నీకు చీదర అని మాకు తెల్వదా? నీ ‘చెత్త పలుకు’లను చూస్తూ…. ‘ఒక పత్రిక పది వేల సైన్యం’ అన్న నార్ల వెంకటేశ్వర్రావు ఆత్మ ఘోషిస్తున్నదేమో. ‘ఒక పత్రిక కోటి మిత్రులతో సమానం’ అన్న నినాదం నేడు నల్లబడుతున్నది. నీటికైనా, నిప్పుకైనా హద్దున్నది. మరి రాతలకు హద్దు ఉండవద్దా? మాధ్యమాల మధ్య పొంగిపొర్లుతున్న విచ్చలవిడితనానికీ ఓ హద్దుండాలి. నీ విద్వేషాన్వేషణ కపట పలుకులు ఇక చెల్లవుగాక చెల్లవు.
– వనపట్ల సుబ్బయ్య 94927 65358