వైటీపీఎస్పై సోయిలేని సర్కార్
బీఆర్ఎస్ హయాంలో విద్యుత్తు ఉత్పత్తి రంగంలో రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధించింది. గత ప్రభుత్వం అన్నివర్గాల వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును అందించే లక్ష్యంతో చేపట్టిన బృహత్తర ప్రాజెక్టు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్.
రైతులకు నీరు, కరెంట్ రెండు కండ్ల వంటివి. సుమారు 30.60 లక్షల వ్యవసాయ పంపుసెట్ల ద్వారా సేద్యం చేసుకునే రైతులు ప్రస్తుత వానకాలం పంటలను కాపాడుకోలేక నానా అగచాట్లు పడుతున్న అవాంఛనీయ దృశ్యం కనిపిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్తు ఉత్పత్తి రంగంలో రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధించింది. గత ప్రభుత్వం అన్నివర్గాల వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును అందించే లక్ష్యంతో చేపట్టిన బృహత్తర ప్రాజెక్టు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. సుమారు 4,676 ఎకరాల విస్తీర్ణంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో టీజీజెన్కో ఆధ్వర్యంలో చేపట్టిన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు ఇది. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవడంలో కీలకంగా నిలువగలదు. కానీ వైటీపీఎస్ను సర్కార్ విస్మరించింది.
రామగుండం ప్లాంటును 2020లో స్క్రాప్ చేశారు. అక్కడే ప్రస్తుత 800 మెగావాట్ల ప్లాంటును నిర్మించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన 450 మెగావాట్ల దిగువ సీలేరును కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా ఆంధ్రకు కేటాయించిన ఏడు మండలాల్లో భాగంగా తరలిపోయింది. నెల్లూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ స్టేషన్ నుంచి మనకు రావాల్సిన 440 మెగావాట్లు రాకుండా నిలిపివేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తంగా తెలంగాణకు రావాల్సిన 890 మెగావాట్లు రాకుండా పోయింది.
తెలంగాణ ప్రజలు, రైతులు, పారిశ్రామికవేత్తలు, కరెంట్ కోతలతో అల్లాడిపోతున్న నేపథ్యంలో జెన్కోను పరిపుష్టం చేసి విద్యుత్తు ఉత్పత్తి విషయంలో స్వయం సమృద్ధి సాధించడానికి చేపట్టిన ప్రాజెక్టు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఈ ప్రాజెక్టును నల్లగొండ జిల్లా దామరచర్లలో నెలకొల్పే నిర్ణయం తీసుకోవడానికి ముందు పాండురంగాపురం, పునుకుడు చెల్క గ్రామాలను ప్రభుత్వం పరిశీలించింది. ఇవి కేటీపీఎస్కు సమీపంలోనే ఉండడం, కిన్నెరసాని అభయారణ్యం కావడంతో పరిగణనలోకి తీసుకోలేదు.
అంతేకాకుండా వ్యవసాయ యోగ్యం కాని భూమి అందుబాటులో లేకపోవడం పర్యావరణ, అటవీ అనుమతులు పొందడానికి అనుకూలంగా లేకపోవడం మరొక కారణం. దామరచర్ల ప్రాంతాన్ని ఎంపిక చేయడానికి ప్రధాన కారణాల్లో వ్యవసాయ యోగ్యంకాని 4,576 ఎకరాల భూమి అందుబాటులో ఉండడం. కేవలం 5 కిలో మీటర్ల దూరంలోనే కృష్ణానది ఉండడం. అవసరమైన యంత్రాలను దిగుమతి చేసుకోవడానికి సమీపంలో కాకినాడ నౌకాశ్రయం ఉండడం. 7 కిలోమీటర్ల దూరంలోనే నార్కట్పల్ల్లి-అద్దంకి రహదారి. 5 కి.మీలో విష్ణుపురం రైల్వేస్టేషన్ ఉండడం. కేంద్ర పర్యావరణ అటవీ నోటిఫికేషన్లో ఈ ప్రాంతం క్యాటగిరీ ‘ఏ’లో ఉండడంతో పర్యావరణ, అటవీ అనుమతులు సులభతరం అయ్యాయి.
ఉత్పత్తి కేంద్రం నుంచి వెలువడే వ్యర్థాలు, ఫ్లైయాష్‌ను ముడిసరుకుగా వాడుకునే సిమెంట్ కర్మాగారాలు సుమారు 22కు పైగా ఇదే ప్రాంతంలో ఉన్నాయి. విద్యుత్తు డిమాండ్‌కు అతి సమీపంలోనే ప్లాంటును నిర్మించడం, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు 150 కి.మీ. లోపే ఉన్నది. ప్రస్తుతం ఉన్న థర్మల్ ప్లాంట్లు హైదరాబాద్ నగరానికి, డిమాండ్‌కు సుమారు 300 కిలోమీటర్లకు పైగా దూరంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయి. రామగుండం ప్రాంతంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఇప్పటికే 8,000 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ ప్లాంట్లు ఒకే దగ్గర కేంద్రీకృతమై ఉన్నాయి. డిమాండ్‌కు దూరంగా ఒకేచోట నిర్మించడం సహేతుకం కాదు.
ఇక్కడ 7 ఉపరితల గనులు, 13 భూగర్భ గనులు, 1,200 మెగావాట్ల సింగరేణి ఉత్పత్తి కేంద్రం, సిమెంట్ ఫ్యాక్టరీ, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి పరిశ్రమల వలన సుమారు నలభై మిలియన్ టన్నుల బొగ్గు మండుతున్నది. వీటికి తోడు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 1,800 మె.వా, కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ 1,100 మె.వా, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 1,080 మె.వా, సింగరేణి ఆధ్వర్యంలోని జైపూర్ పవర్ ప్లాంట్లు అన్నీ గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోనే ఉన్నాయి. ఎప్పుడైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే, గ్రిడ్ భద్రతా దృష్ట్యా కూడా ఇతర ప్రాంతాల్లో ప్రాజెక్టును నెలకొల్పడం అవసరం. కర్నాటకలోని రాయచూర్, బళ్లారి, ఏపీలోని విజయవాడ నార్ల తాతారావు పవర్ స్టేషన్, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్, కడప జిల్లా మద్దునూరు పిట్‌హెడ్ ప్లాంట్లు కావనే విషయం గమనార్హం. కానీ కృష్ణా పరీవాహక ప్రాంతమైన దామరచర్లలో విధానపరమైన భద్రత దృష్ట్యా నిర్మించిన ప్రాజెక్టుగా వైటీపీఎస్ను చూడాలి.
కేటీపీఎస్కు జీ10/జీ11 గ్రేడ్, భద్రాద్రి థర్మల్ ప్లాంటుకు జీ9/జీ10 గ్రేడ్, యాదాద్రి థర్మల్ ప్లాంటుకు జీ9 గ్రేడ్ బొగ్గును కేటాయిస్తూ సింగరేణి, జెన్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. యాదాద్రి ప్లాంటులోని బాయిలర్లు నాణ్యమైన ‘ఫ్యూయల్ ఫ్లెక్సీ బాయిలర్లు’. వీటి గ్రాస్ కెలోరిఫిక్ వాల్యూ 3,300-5,500 కిలో కేలరీల బొగ్గును ఉపయోగించుకునే విధంగా బాయిలర్లను డిజైన్ చేశారు. బాయిలర్లను దేశీయ బొగ్గు, విదేశీ బొగ్గు లేదా రెండింటి మిశ్రమం ద్వారా కూడా మండించవచ్చు. సింగరేణి సరఫరా చేస్తున్న నాసిరకం బొగ్గు వలన 2024 ఏప్రిల్ నుంచి 2026 జూన్ వరకు 27 నెలల్లో 9,593 మి.యూ ఉత్పత్తి నష్టం జరిగినట్టు జెన్కో చెప్తున్నది. అయితే, ఇది సింగరేణి బొగ్గు గనుల ఓవర్ బర్డెన్ ఎక్కువగా ఉండడం ధరల్లో వ్యత్యాసానికి కారణం కావచ్చు. వైటీపీఎస్ను బీహెచ్ఈఎల్ నిర్మిస్తున్నది. ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లు, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో అదానీ కంపెనీ నిర్మిస్తున్న పవర్ ప్లాంట్లు కూడా బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. వైటీపీఎస్ డిజైన్ కన్సల్టెంట్‌గా టాటా కన్సల్టెంట్ ఇంజినీర్స్ కంపెనీ ఉన్నది.
ఈ జూన్ మొదటివారంలో జెన్కో విజ్ఞప్తి మేరకు ఎన్టీపీసీ నిపుణుల బృందం సందర్శించి డిజైన్‌లో ఎలాంటి లోపాలు లేవని నివేదికలో పేర్కొనట్టు సమాచారం. బొగ్గు పొడిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం టెయిల్ పుల్లీలు, ఐడ్లర్లు పూర్తిగా బొగ్గు పొడిలో మునిగిపోయి ఉండడం వలన రాపిడికి కన్వేయర్లు, పుల్లీలు చెడిపోతున్నాయని చెప్పినట్టు తెలుస్తున్నది.
చిన్న చిన్న కమీషనింగ్ లోపాలను సరిచేసుకుంటూ కన్వేయర్ సిస్టంను 2,500 టీపీహెచ్ పూర్తి సామర్థ్యంలో నడిపించవచ్చని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అదేవిధంగా నూరు శాతం సింగరేణి బొగ్గును వినియోగించినప్పుడు అధికంగా బూడిద వెలువడే అవకాశం ఉన్నదని, ఆ కారణంగానే యాష్ డిస్పోజబుల్ సిస్టం కూడా 3,300 జీసీవీకి తగినట్టు డిజైన్ చేసినట్టు నివేదికలో పొందుపర్చారు. అందులో భాగంగానే బాటం యాష్ హాపర్ (బీఏహెచ్)ను మూడు ‘వీ’ల ఆకారంలో డిజైన్ చేశారు. దీని వలన బూడిదను డిస్పోజ్ చేయడం సులభతరం అవుతుంది. కన్వేయర్ సిస్టంలోని ‘ఛూట్’ అలైన్మెంట్లు మార్చుకోవడం, బొగ్గు నిల్వలను స్థిరపరచుకోవడం లాంటి సూచనలతో పాటు యాష్ హ్యాండ్లింగ్ ప్లాంటు బాగుందని పేర్కొన్నట్లు తెలుస్తున్నది.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం మేరకు సిబ్బందిని, ఇంజినీర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించడం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం బొగ్గు నిల్వలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజోపయోగకరంగా మలచుకోవాలి. ఎల్‌నినోతో దేశవ్యాప్తంగా కరెంట్‌కు కరువు ఏర్పడిన ప్రస్తుత కాలంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు అందుబాటులోకి రావడం ఆషామాషీ కాదు.
మార్కెట్లో యూనిట్ రూ.15 పెట్టినా దొరుకని పరిస్థితుల్లో.. తమిళనాడు రూ.37కు కొనుగోలు చేస్తున్న గడ్డుకాలంలో రూ.6.65కే యూనిట్ లభించే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విలువ అమూల్యం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైటీపీఎస్ను సమర్థవంతంగా వినియోగించుకోకుండా కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు యోచించడం ఎంతవరకు సమంజసం? ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేదు. విద్యుత్తు ఉత్పత్తిలో అంతరాయాలు, ప్రత్యామ్నాయాల ఏర్పాట్లపై ఆలోచించలేదు. దీంతో లేకపోవడం తో రైతులు విలవిల్లాడుతున్నారు. వైటీపీఎస్ పట్ల అలసత్వ మే ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనం.
-తుల్జారాం సింగ్ ఠాకూర్ ,78930 05313
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

