సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం సువర్ణాక్షరాల్లో లిఖించాల్సిన తరుణం ఇది.! క్రికెట్‌ను మతంగా భావించే భారతావని మది ఉప్పొంగిపోయిన సందర్భం ఇది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న రీతిలో మన అమ్మాయిలు ప్రపంచకప్‌లో పోరాడిన తీరు న భూతో న భవిష్యతి. రెండు(2005,17) మార్లు అందినట్టే అంది చేజారిన కలల కప్పును ముచ్చటగా మూడో ప్రయత్నంలో అందుకున్న వైనం పరమాద్భుతం. ప్రతీ భారతీయుని మదిలో ఈ విజయం చిరకాలం గుర్తుండిపోవడం ఖాయమని చెప్పాలి. నీతూ డేవిడ్, డయానా ఎడుల్జీ, మిథాలీ రాజ్, అంజుమ్ చోప్రా, జులన్ గోస్వామి లాంటి దిగ్గజాల దరిచేరని వన్డే ప్రపంచకప్ టైటిల్ విజయాన్ని హర్మన్ ప్రీత్‌కౌర్ సారథ్యంలోని టీమ్ ఇండియా దక్కించుకొని ఔరా అనిపించుకున్నది. కొట్టిన పిండి లాంటి సొంత ఇలాఖాలో ప్రత్యర్థుల భరతం పడుతూ ఐదు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించారు మన అమ్మాయిలు.
పురుషాధిక్య క్రికెట్ ప్రపంచాన్ని సవాలు చేస్తూ తాము ఎం దులోనూ తీసిపోమంటూ మహిళామణులు రాణించిన తీరుకు భారతావని హారతి పడుతున్నది. వివక్షను అధిగమిస్తూ, అవరోధాలను, అడ్డంకులను తమ గెలుపు సోపానంగా మలుచుకుంటూ కౌర్ నేతృత్వంలోని టీమ్ ఇండి యా సాధించిన చారిత్రక విజయానికి ఫిదా కాని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కా దు. సరిగ్గా రెండేండ్ల క్రితం ఆస్ట్రేలియా చేతిలో రోహిత్‌సేన ఓటమితో బద్దలైన భారతీయుడి హృదయం.. తాజాగా దక్షిణాఫ్రికాపై అమ్మాయిల చిరస్మరణీయ విజయంతో ఉప్పొంగిపోయింది. ముంబైలో మువ్వన్నెల పతాకం సగర్వంగా రెపరెపలాడింది. కపిల్‌దేవ్, మహేంద్రసింగ్ధోనీ తర్వాత దేశానికి వన్డే ప్రపంచకప్ టైటిల్ అందించిన అరుదైన ఘనత పంజాబీ బిడ్డ హర్మన్‌ప్రీత్‌కౌర్ సొం తం చేసుకుంది. దేశ రాష్ట్రపతి, ప్రధాని నుంచి మొదలుపెడితే దిగ్గజ క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖలు, అతి సామాన్యుల వరకు భారత విజయాన్ని తనివితీరా ఆస్వాదించారు.
మెగాటోర్నీలో భారత గెలుపు ప్రస్థానం అంత సాఫీగా ఏం సాగలేదనేది తెలిసిందే. టోర్నీకి ముందు ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్ ఓటమితో ఒకింత ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా చేసినా.. స్వదేశంలో ప్రపంచకప్ ముద్దాడాలన్న ఆకాంక్ష అమ్మాయిలను ముందుకు నడిపించింది. దేశవాళీ దిగ్గజం అమోల్ మజుందార్ కోచింగ్‌లో రాటుదేలిన మన అమ్మాయిలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా సిద్ధమయ్యారని చెప్పవచ్చు. శ్రీలంకతో మొదలుపెడితే దక్షిణాఫ్రికాతో ఫైనల్ పోరు వరకు ఉత్కంఠ భరిత ప్రయాణం సాగింది. లంకపై భారీ విజయంతో మెగాటోర్నీలో బోణీ కొట్టిన కౌర్‌సేన.. ఆ తర్వాత దాయాది పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి మంచి జోరుమీద కనిపించింది. కానీ సఫారీల రూపంలో టీమ్ఇండియాకు బ్రేక్ పడింది.
ఏడుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా రికార్డు లక్ష్యఛేదన, ఇంగ్లండ్ చేతిలో ఓటమితో ఒక దశలో సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. గెలిస్తే గానీ నిలువలేని పరిస్థితుల్లో న్యూజిలాండ్‌పై విజయదుందుభితో సెమీస్‌లోకి దూసుకెళ్లింది. నాకౌట్లో ఓవైపు డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్.. మరోవైపు తొలిసారి కప్పు కోసం వేటలో టీమ్ఇండియా. ఒత్తిడిలో ఆడటంలో ఆరితేరిన ఆసీస్‌ను కంగారెత్తిస్తూ భారత్ రికార్డు సాధించి మూడోసారి ప్రపంచకప్ ఫైనల్లోకి అడుగుపెట్టడం విశేషం. మరోవైపు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో దక్షిణాఫ్రికా..భారత్‌తో టైటిల్ పోరుకు తలపడటం ఉద్విగ్నతను పెంచింది. నీలిరంగు పులుముకున్న డీవై పాటిల్ స్టేడియంలో కిక్కిరిసిన అభిమానుల మధ్య భారత్ ప్రపంచకప్ విజేతగా నిలిచింది. సచిన్టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రోహిత్‌శర్మ, మిథాలీరాజ్, జులన్ గోస్వామి లాంటి దిగ్గజాల సమక్షంలో కలల కప్పును అందుకోవడం క్రికెట్ అభిమానులకు మరచిపోలేని క్షణంగా నిలుస్తుంది.
1983లో కపిల్‌డెవిల్స్ విజయం దేశ క్రికెట్ గతిని మార్చగా, 2011లో ధోనీ గెలుపుతో అది మరోస్థాయికి వెళ్లగా, 2025 విజయం అమ్మాయిల క్రికెట్‌కు ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని అందించింది. సచిన్, ధోనీ, కోహ్లీ లాగే హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందన, జెమీమా రోడ్రిగ్స్ స్ఫూర్తితో మరింత మంది అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 52 ఏండ్ల సుదీర్ఘ ప్రపంచకప్ ప్రయాణంలో మన అమ్మాయిలు క్రికెట్లో మరో చరిత్రకు నాంది పలుకడం ముదావహం. మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు.