తమిళనాడు రాజకీయం రసకందాయంలో పడింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ, కూటమికి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో సినీ హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాల్లో గెలిచి మెజారిటీకి చేరువయింది. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమి 73 స్థానాలకు పరిమితం కాగా, పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమి 53 స్థానాలు గెలుచుకున్నది. ఈ మూడింటిలో ఏవో రెండు పార్టీలు కలిస్తే తప్ప ప్రభుత్వఏర్పాటుకు అవకాశం లేదు. ఎవరికి వారే భీష్మించుకొని కూర్చోవడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఆగిపోయింది. గవర్నర్‌ను విజయ్ సంప్రదించినా ఫలితం దక్కలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటే మ్యాజిక్ ఫిగర్ సభ్యుల మద్దతు తప్పనిసరి అని గవర్నర్ స్పష్టంచేశారు. బెంగాల్‌ను మించిన సంచలనానికి కేంద్ర బిందువైన తమిళనాడులో సీఎం పీఠం ఎవరిది అనే తీవ్ర ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొన్నది.
బీహార్‌లో 2005 ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, ఎల్జేపీలో ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. దీంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొన్నది. తాము ఎవరికీ మద్దతిచ్చేదేలేదని మూడు పార్టీల నేతలు భీష్మించుకున్నారు. అప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ బుజ్జగించినా ఎవరూ వినలేదు. విధి లేని పరిస్థితుల్లో గవర్నర్ బూటాసింగ్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. అసెంబ్లీ రద్దు చేశారు. వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. ప్రతిష్టంభన పేరుతో అసెంబ్లీని రద్దు చే యడం అప్రజాస్వామికమని సుప్రీంకోర్టు తప్పుపట్టింది కానీ అప్పటికే రద్దయిన అసెంబ్లీ పునరుద్ధరించలేదు. ఆరునెలలకే అసెంబ్లీ ఎన్నికలు జరిగి జేడీయూ అధికారంలోకి వచ్చింది.
సర్కారియా కమిషన్ సిఫారసుల ప్రకారం గవర్నర్ తొలుత మెజారిటీ సాధించిన పార్టీకి లేదా ప్రీపోల్ సంకీర్ణానికి అవకాశం ఇవ్వాలి. లేదా ఎన్నికల తర్వాత ఏర్పడ్డ సంకీర్ణానికి అవకాశం ఇచ్చి బలపరీక్షకు పురమాయించాలి. సర్వసాధారణంగా జరుగుతున్న తంతు అది. ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాని సందర్భంలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆహ్వానించ వచ్చునా లేదా అన్న విషయంలో మాత్రం గవర్నర్లు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా వ్యవహరిస్తున్నారు. 2016 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 21ని అందుకోలేదు. కాంగ్రెస్ 17, బీజేపీ 13 సీట్లను గెల్చుకున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ను కాదని మిత్రపక్షాల సహకారంతో ముందుకొచ్చిన బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అవకాశమిచ్చారు. ఎన్నికల అనంతరం ఏర్పడ్డ బీజేపీ కూటమిని గవర్నర్ ప్రభుత్వానికి ఆహ్వానించిన ఈ వివాదం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. బలపరీక్షకు వేదిక అసెంబ్లీ కాబట్టి అక్కడే తేల్చుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తుదకు మనోహర్ పారికర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బలం నిరూపించుకుంది.
2018 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 38 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ అయిన 113ను ఎవరూ చేరలేకపోయారు. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినప్పటికీ పెడచెవిన పెట్టిన గవర్నర్ విజుభాయ్ బీజేపీ పక్ష నేత యడ్యూరప్పను ఆహ్వానించారు. బల నిరూపణకు 15 రోజుల సమయాన్ని ఇచ్చారు.
ఈ వివాదం కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని సుప్రీం అడ్డుకోలేదు కానీ బల పరీక్షకు గవర్నర్ ఇచ్చిన వ్యవధిని మూడు రోజులకు కుదించింది. బలనిరూపణకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణం గద్దెనెక్కింది. స్వల్ప కాలవ్యవధిలోనే గోవా కర్నాటక గవర్నర్లు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పరస్పర విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. 1998 ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్, 2005 జార్ఖండ్‌లో శిబుసోరెన్, 2016లో ఉత్తరాఖండ్‌లో హరీశ్‌రావత్ సీఎంలుగా బలపరీక్షల సమయం లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నది. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం గవర్నర్ స్థాయిలోనే సద్దుమణుగుతుందా లేక సుప్రీంకోర్టు వరకు వెళ్తుందా చూడాలి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 నిబంధన ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. ముఖ్యమంత్రి సలహాపై ఇతర మంత్రులను నియమిస్తారు. గవర్నర్ అభీష్టం ఉన్నంతకాలం వారు పదవిలో ఉంటారు. ఈ మేరకు గవర్నర్లు అంతా ఒకే రీతిన వ్యవహరించారు. కానీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే ముందుగా ఎవరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న విషయంలో ఒక పద్ధతి లేకుండా పోయింది. అక్కడే గవర్నర్ల విచక్షణాధికారం రూపుమార్చుకొని ఇష్టారాజ్యంగా అవతరించింది. ఫక్తు రాజకీయనేతలను గవర్నర్లుగా నియమించడం మొదలయ్యాక విచక్షణాధికారం వికృతరూపం దాల్చింది.
బిల్లులు ఆమోదించే విషయంలో గవర్నర్లకు ఒక కాలవ్యవధిని నిర్దేశించిన సుప్రీంకోర్ట్టు.. ఎన్నికల్లో ఒక పార్టీకి లేదా ఒక కూటమికి మెజారిటీ రానప్పుడు, మ్యాజిక్ ఫిగర్‌కు సరిపోయే బలాన్ని సంతరించుకొని, ఎన్నికల అనంతర కూటములేవీ ముందుకు రానప్పుడు, అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలా వద్దా అనే విషయంలో ఒక స్పష్టత ఇస్తే తమిళనాడు వంటి వివాదాలు భవిష్యత్తులో తలెత్తవు.
ఆ దిశగా కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తే మరీ మంచిది. అంతేగాని ప్రతిష్టంభన ఏర్పడిందన్న సాకుతో ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించడం అప్రజాస్వామికమే అవుతుందని సుప్రీంకోర్టు 20 ఏండ్ల క్రితమే బిహార్ అసెంబ్లీ రద్దు, రాష్ట్రపతి పాలన విధింపు కేసులో స్పష్టం చేసింది. తమిళనాడు విషయానికొస్తే విజయ్ నేతృత్వంలోని టీవీకేకు ప్రజలు పట్టం కట్టారన్నది స్పష్టం. అయితే సాంకేతికంగా ఒక పది సీట్లు తగ్గి ఉండవచ్చు. డీఎంకే, అన్నాడీఎంకే కూటములు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాని నేపథ్యంలో విజయ్‌కి గవర్నర్ అవకాశం ఇస్తే పెద్దగా అభ్యంతరాలు ఉండేవి కాదు. విజయ్ కూడా తన బలాన్ని నిరూపించుకోవడానికి కేవలం రెండు వారాల సమయం అడిగారు. కానీ గవర్నర్ మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతుంటే తప్ప ఆహ్వానించడం కుదరదని చెప్పారు. ఇప్పటికే ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్ విజయ్‌కి మద్దతు ప్రకటించింది. కావలసింది ఇంకో ఐదుగురు. నాలుగు సీట్లున్న కమ్యూనిస్టుపార్టీలు, రెండు సీట్లున్న ముస్లిం లీగ్ డీఎంకేతో యథావిధిగా కొనసాగుతామని ప్రకటించాయి. అన్నా డీఎంకే శిబిరంలోనే అభిప్రాయ భేదాలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. ఉభయ ద్రవిడ పార్టీల కూటముల్లో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీలు పీఎంకే (4), ఏఎంకే (1), డీఎండీకే (1), వీసీకే (2) ముందుకొచ్చి విజయ్‌కి మద్దతిస్తే కథ సుఖాంతమవుతుంది. ఒకే సీటుకు పరిమితమైన బీజేపీ పరిణామాలను మౌనంగా గమనిస్తున్నది. అన్నా డీఎంకే, డీఎంకేల్లో ఒకరు మద్దతిస్తే విజయ్ ముఖ్యమంత్రి కావడానికి ఏ సమస్యా ఉండదు. డీఎంకే, అన్నా డీఎంకే కూటములు కలిస్తే కాంగ్రెస్, బీజేపీ సహకారం లేకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే 121 సీట్ల బలం వారికి ఉన్నది. ఆ దిశగా మంతనాలు సాగుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. రాజకీయాల్లో అసంభవాలు ఉండవు కదా… ఏమైనా జరగొచ్చు.
– డాక్టర్ అయాచితం శ్రీధర్