ఆంధ్ర రాజకీయ చరిత్ర చూస్తే అక్కడి నాయకులకు తమ ప్రాంతం పట్ల, ప్రజల పట్ల అభిమానం, ఆదరం ఏమీ లేవని అర్థమవుతుంది. మద్రాసు కోసం దురాశతో రాష్ట్ర ఏర్పాటు 26 ఏండ్లు ఆలస్యం చేశారు. పోనీ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ప్రజల గురించి పట్టించుకున్నారా అంటే అదీ లేదు.
నిజానికి ఆ రోజుల్లో (1953) రూ.22 కోట్ల ఆదాయం తక్కువేమీ కాదు. అందులోంచి కొంత ఖర్చు పెట్టి అనువైన చోట ఆంధ్రలో ఒక్క కోటి రూపాయలు వెచ్చించి శాసనసభ, మండలి, హైకోర్టు భవనాలు నిర్మించుకొని రాష్ట్రం ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించవచ్చు. ఆంధ్రకు ఉన్న 1,053 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరంతో వాటిని, రేవులను అభివృద్ధి పరిచి రవాణా సౌకర్యాలు, వ్యాపారాలు వృద్ధి చేసుకోవచ్చు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల వల్ల 3 డెల్టా ప్రాంతాలున్న ప్రాంతం కనుక ఆంధ్ర వ్యవసాయాన్ని వృద్ధి చేయవచ్చు. కొద్దిగా ప్రయత్నించి శ్రద్ధపెడితే తర్వాతి కాలంలో బయటపడ్డ సహజవాయువు నిక్షేపాలు గోదావరి బేసిన్లో కాకినాడ దగ్గర ఉన్నవి కనుక్కోగలిగేవారు. ఖనిజ సంపద కూడా అపారంగా ఉన్న ఉత్తరాంధ్రలో ప్రజలకు ప్రత్యామ్నాయ వసతులు చూపించి ఖనిజాలు వెలికితీసి ఉండవచ్చు. ఉత్తరాంధ్రకు కృష్ణా, గోదావరి జలాల గొడవ లేదు. అక్కడ ఐదు ఉపనదులు, అపార ఖనిజ సంపదలు ఉన్నాయి. ఈ రకంగా ప్రకృతి వనరులు ఉపయోగించుకొని ఒక చక్కని, సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దే బదులు, పక్కవారి రాజధాని దొరికితే చాలనుకున్న ఆ దురాశాపరులు తెలంగాణతో కలిశారు.
తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ప్రజలను పీడించటమే కాకుండా తమ సొంత ప్రాంత అభివృద్ధి గురించి అసలు ఆంధ్ర రాజకీయ నాయకులు ఆలోచించలేదు. 1956 నుంచి 2014 దాక ఆంధ్ర నాయకులు కోటీశ్వరులయ్యారే కానీ, తమ ప్రాంతంలో నగరాలు ఎందుకు నిర్మించలేదు? కనీసం ఒక్క నగరమైనా మచ్చుకు అభివృద్ధి ఎందుకు చేయలేదని అడిగితే వారి సమాధానం ఏమిటి? అత్యంత ప్రాచీన దేవాలయాలు, అరకు వ్యాలీ వంటి అందమైన ప్రదేశాలు ఉన్న ప్రాంతంలో పర్యాటక శాఖను ఏర్పరిచి ఆ స్థలాలను అభివృద్ధి చేస్తే ఎంత బాగుండేది! వారి స్వార్థం, పదవీకాంక్ష, అవినీతి బుద్ధితో ఇటు తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్నారు, అటు ఆంధ్ర ప్రాంత ప్రజలపై ఏ మాత్రం కనికరం చూపించలేదు, అభివృద్ధి చేయలేదు. ఒక్క నగరమూ నిర్మించుకోలేదు.
రాజకీయ నాయకులే కాదు, ఇతర ధనవంతులు, వ్యాపారస్థులు, కళాకారులు, శాస్త్రజ్ఞులు – ఎవరూ ఆంధ్రలోని సామాన్య ప్రజల గురించి పట్టించుకోలేదు. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మద్రాసును విడిచి రాలేదు. మద్రాసులోనే ఉన్నా, వారే అప్పుడు వచ్చి పరిశ్రమలు, పాఠశాలలు, వైద్యశాలలు ఆంధ్ర ప్రాంతంలో, కనీసం వారి సొంత జిల్లాల్లో పెట్టి ఉంటే ఆంధ్ర దుస్థితి ఇట్లా ఉండేది కాదు కదా! మళ్లీ 2014లో రాష్ట్రం విడిపోయాక కూడా ఇక్కడ వ్యాపారాలు పెట్టి కోట్లు సంపాదించిన వ్యాపారస్థులు, వేల కోట్లు సంపాదించిన ఆంధ్ర సినిమా నటులు కాని, ఇతర ధనవంతులు కాని హైదరాబాద్‌ను ఆక్రమించుకొని ఇక్కడే తిష్ఠ వేశారు. కానీ, ఆంధ్రాలో ఒక్క పరిశ్రమ, సినిమా రంగ వ్యవస్థ, ఏదీ ఏర్పాటు చేయలేదు. ఉద్యోగస్థులు కూడా రోజూ రైలులో వెళ్లి, వచ్చి ఉద్యోగాలు చేశారు గానీ, అక్కడికి తమ నివాసాలను మార్చలేదు. ఇంకా తమాషా ఏమిటంటే వీళ్లెవరూ తెలంగాణ మీద ప్రేమ కలిగినవారు కాదు. ఈ ప్రాంతానికి చెందనప్పుడు, ఈ రాష్ట్రం అంటే ఇష్టం లేనప్పుడు ఆంధ్రలోనే ఉండవచ్చు కదా! తెలంగాణ రాష్ట్ర గీతం పాడటానికి అంగీకరించని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వీళ్లలాగా హైదరాబాద్ వలస రాలేదే! తనను పెంచి పోషించిన మద్రాసులోనే ఉండిపోయారు. ఈ ఆంధ్ర సినిమారంగం అమరావతికి తరలిపోతే అక్కడ అభివృద్ధి కాదా? ఇదీ ఆంధ్రులకు వారి ప్రాంతం మీద ఉన్న ప్రేమ. స్వార్థపరత్వం, అవకాశవాదం, ఏ పద్ధతిలోనైనా డబ్బు సంపాదించటమే వారి ధ్యేయం, వ్యక్తిత్వం. మాతృభూమి మీద లాలసే కానీ, ప్రేమ లేదు!
దీనికి తోడు వార్తా పత్రికలు, ఇప్పటిలాగే
రాజకీయ నాయకులకు వంతపాడటం!
ఆంధ్ర పత్రిక ఆంధ్రలో రాజధాని గురించి
ఏం రాసిందో చూడండి, రెచ్చగొడుతూ…
‘విశాఖలో ఒక్క రోడ్డు మీద కూడా రెండు లారీలు ఒకేసారి ప్రయాణించలేవు. కాకినాడలో రాజధానికి కావలసిన భవనాలు ఏవీ?’
ఎక్కడైనా 150 ఏండ్లు తమ ప్రాంతాన్ని పట్టించుకోకుండా ఉమ్మడి రాజధాని అయిన మద్రాసులోనే రాజకీయ నాయకులు కాలం గడిపినప్పుడు భవనాలు ఎక్కడి నుంచి వస్తాయి? తర్వాత నిర్మించుకోవాలి గాని! ఇంకా చూడండి.. ‘రాజమండ్రిలో కనీస వసతులు లేవు’- వసతులు ఎక్కడా పుట్టుకురావు, కల్పించుకోవాలి. ‘బెజవాడ అయితే స్థలాల కంటే మనుషులు ఎక్కువ ఉన్నారు’. మరి వినుకొండ ప్రాంతంలో 2014లో కూడా కనీసం 20,000 ఎకరాలు ఉన్నట్టు విన్నాం. మరి 67 ఏండ్ల కిందట జనాభా తక్కువగా ఉండి, అటువంటి స్థలాలు బాగానే ఉండి ఉంటాయి కదా! అసలు ఆంధ్ర నాయకులకు తమ ప్రాంతం గురించిన కనీస అవగాహన అయినా ఉందా?
‘గుంటూరు అయితే అక్కడి జనాభాకు సరిపోయినంతే ఉంది’. ఇలా తమ ప్రాంతానికి మద్రాసు నుంచి ఆంధ్ర పత్రిక నడిపే సంస్థ రాస్తుంటే, ఆంధ్రా నాయకులు కనీసం ప్రయత్నాలైనా చెయ్యవద్దా, తమ సొంత రాజధాని కోసం? ఇంక ఈ పత్రిక లాగానే వారు కూడా తమ అసమర్థతను బయట పెట్టుకున్నారు. సూర్య నారాయణరావు అనే నాయకుడి మాటలు.. ‘ఇప్పటికే మనం కోటి రూపాయలు కర్నూలు మీద ఖర్చు చేశాం. ఇంకా చేస్తున్నాం కానీ, రాజధానిగా కర్నూలు పనికివస్తుందా? (29.9.1554, ఆంధ్ర పత్రిక)
‘మన ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు మద్రాసులోనే ఉన్నారు, అద్దె ఇంట్లో ఉన్నట్టు. వారికి ఇక్కడ ఇండ్లు అమర్చాలి. సెక్రటేరియట్ భవనాలు పూర్తవుతాయన్న నమ్మకం లేదు. పైగా ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడికి వచ్చినా, వారి పిల్లలకు విద్యా వసతులు ఉండవని భయపడుతున్నారు’. (ఆంధ్ర పత్రిక, 1.9.1954)
మరి ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీలో బతికినా తమ ప్రాంతంలో కనీస అవసరాలు సమకూర్చుకోకుండా, కనీస పాఠశాలలు కూడా లేకపోతే అన్నేండ్లు ఈ నాయకులు ఏమి చేసినట్టు? మద్రాసులో, ఇతర ప్రాంతాల్లో చక్కటి ఇంగ్లిషు మీడియం విద్యాసంస్థలు ఉండేవి. మరి తాము తమ ప్రాంత పిల్లల గురించి ఆలోచించవద్దా, ఏమొచ్చినా పట్నం (మద్రాసు) పరిగెత్తడమేనా? అప్పుడు అక్కడ చదువుకున్న చాలామంది ఐసీఎస్ (ఇప్పటి ఐఏఎస్‌తో సమానం) ఆఫీసర్లయ్యారు. మరి ఆంధ్ర ప్రాంత పిల్లలను గాలికొదిలిన ఈ నాయకులను ఏమనాలి? ఇంకా రాష్ర్టానికి ఉప ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి మాటలు చూడండి. ‘రాష్ట్ర ప్రజలంతా ఉత్సాహంగా హైదరాబాద్ తరలివెళ్లాలని ఎదురుచూస్తున్నారు. కర్నూల్ నుంచి రాజధాని తరలించటానికి ఎవ్వరూ ఇసుమంత కూడా బాధపడటం లేదు’. ఈయనకు ఆంధ్రపత్రిక సంపాదకీయంలో దీటైన చక్కటి ప్రత్యుత్తరమిచ్చారు, ఇలా.. ‘ఈ మహానుభావుడే కర్నూలుని రాజధాని చేయకపోతే నేను మద్రాసు నుంచే పాలన చేస్తానని నెహ్రూని బెదిరించాడు. ఇప్పుడు ఇలా అంటున్నాడు’. (9.8.1954, ఆంధ్ర పత్రిక)
అయినా హైదరాబాద్ రాజధాని అయితే ఆంధ్రలోని సామాన్య ప్రజలకు ఏం లాభం? తుగ్లక్ లాగ ప్రజలందరినీ తెలంగాణకు తరలించే ప్లానా? పైగా సామాన్య జనాలకు రాజధాని అందుబాటులో ఉండాలి కానీ, 200 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఏం లాభం? ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమా మాటలాడే’ ఆంధ్ర నాయకులకు అడ్డేముంది? 400 ఏండ్ల నుంచీ అత్యంత సుందరమైన నగరంగా ఉన్న తెలంగాణ రాజధానిని తానే కట్టానంటాడు 75 ఏండ్ల నారా పెద్దబాబు. ఇట్లా మల్లగుల్లాలు పడుతున్న ఆంధ్ర నాయకుల అదృష్టం బాగుండి, తెలంగాణకు దుర్దశ మొదలై నాటి ప్రధాని నెహ్రూ పార్లమెంటులో రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ (ఎస్ఆర్సీ) కమిషన్ త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇంకేముంది, కోతికి కొబ్బరి చిప్ప దొరికింది!
(మిగతా వచ్చే వ్యాసంలో)
– కనకదుర్గ దంటు
89772 43484