గెలుపు శిఖరాగ్రానికి చేరిన మీదటో
గమ్యం జేరే దారి బట్టి మజిలీల దగ్గరో
నడిచొచ్చిన నడకల తీరుతెన్నులు
లోకంతో పంచుకోవడం మధురానుభూతేనేమో!
కసి మొనల కరకు ముళ్ళకి
కనికరం లేని ఎదురురాళ్ళకి
తరిగిపోని కష్టాల రహదార్లకి
రక్త దాహం తీర్చిన రోజులు…
మెరుపు జిలుగుల మోజులో
మోసపు పిడుగులనోర్చిన క్షణాలు
ప్రవాహపు లోతుల్లో మునిగితేలుతూ
బ్రతుకున నెగ్గటం నేర్చిన సందర్భాలు…
బుడినడకల బుడతలకైతే
గమ్యం వైపుకి ప్రేరణలౌతాయేమో
తొలి సంధ్యలో పడమట నడకల్లో
ముందు నడిచే పొడుగాటి నీడల్లా..
విజయ తీరాలకు త్రోవకై వెదుకుతూ
నడినెత్తిన బాధ్యతల వత్తిడుల భారంతో
ఆశలు ఊహలు అదుపులోనుంటాయేమో
నడి వయస్సునికి మధ్యాహ్నపు నడకల నీడల్లా..
విజయపు కొసకు చేరే రాత లేదని వగస్తూ
కడగండ్లే సఖులుగా సహవాసమయ్యాయని
నిరాశ వెనక్కులాగేనేమో నడక నెమ్మదవునేమో
ముదిమిన మలి సంధ్యలో అలసి వెనక నడిచే నీడల్లా!
– రవికిషోర్ పెంట్రాల
లాంగ్లీ, లండన్