తెలుగు సాహితీ వనంలో సామల సదాశివుడు ఒక తోటమాలి. తన రచనల పూలతో తెలంగాణ తల్లిని అర్చించిన సరస్వతీమూర్తి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనా, ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిలాషి. తెలుగు, హిందీ, మరాఠీ, పారసీ, ఉర్దూ, ఇంగ్లీష్, సంస్కృతం వంటి ఏడు భాషల్లో ప్రతిభా పాండిత్యం కలిగిన వ్యక్తి. ఇతర భాషల్లో వెలువడిన సాహిత్యాన్ని తెలుగు సాహితీ ప్రపంచానికి అందించిన విభిన్న భాషా సంస్కృతుల కళావారధి.
‘మనసు ఆనందంతో, ఉల్లాసంతో ఉరకలేస్తున్నప్పుడు లేదా రోదిస్తున్నప్పుడు రాసే రచనల్లో మన భావాల్లోని శబ్దాలు వాటంతటవే వచ్చి కూర్చుంటాయి’ అని అంటారు సామల. అందుకే ఆయన రచనాశైలి అంత స్వాభావికంగా ఉంటుంది. నేటి కొమురంభీం జిల్లాలో భాగమైన దహెగాం మండలంలోని ‘తెలుగుపల్లె’లో 1928, మే 11న నాగయ్య-చిన్నమ్మ దంపతులకు సామల సదాశివుడు జన్మించారు. ఆయన తన చిన్నతనంలోనే రామాయణ మహాభారతాలు, బసవ పురాణం, కళాపూర్ణోదయం వంటి పుస్తకాలు చదివారు.
1949లో ‘ప్రభాతము’ అనే పద్య కావ్యాన్ని రాసి సాహితీ లోకంలోకి ప్రవేశించారు. 1950లో 100 పద్యాలతో ‘సాంబశివ శతకం’ను రాశారు. 41 పద్యాలతో ‘అంబాపాలి’ రచించారు. బుద్ధుడి ప్రత్యక్ష బోధనల ప్రభావం వల్ల వేశ్యా వృత్తిని వదిలి సన్యాసిగా మారిన వనితే ‘అంబాపాలి’. ‘సర్వస్వదానము’, ‘పశ్చాతాపము’, ‘విశ్వామిత్రము’, ‘నారద గర్వభంగం’, తదితర రచనలలో సామల శైలి అద్భుతంగా కనిపిస్తుంది. ఆంధ్ర బిల్హణ బిరుదాంకితులు కప్పగంతుల లక్ష్మణశాస్త్రితో పరిచయం సామలను ఒక పరిపూర్ణ సాహితీవేత్తగా తీర్చిదిద్దింది.
కవి మిత్రుడు హనుమంతరావుతో కలిసి ‘వృషభగిరి నివాస వెంకటేశా’ అనే మకుటంతో 102 పద్యాలు గల ఆర్తి శతకాన్ని రాశారు. గోలకొండ పత్రికకు పద్యాలు రాసే క్రమంలో కవికేసరి సురవరం ప్రతాపరెడ్డి మన భాష సుగంధాన్ని ఇతర భాషలకు అందించమన్న సూచనతో పద్య కవిత్వాన్ని వదిలి అనువాదకుడిగా మారారు. ఉర్దూ పత్రికలకు తెలుగు సాహిత్యం గురించి, అలాగే ఇతర భాషల సాహిత్యాన్ని తెలుగు ప్రపంచానికి అందించి సాహిత్య వారధి అయ్యారు. ‘సియాసత్’ పత్రికకు అనేక వ్యాసాలు రాశారు. ఉర్దూలో 300 వ్యాసాలు, తెలుగులో 450 వ్యాసాలు రచించారు. సామల రచించిన ‘అపశృతి’ నవల అత్యంత ప్రజాదరణ పొందింది. ‘అంజద్’ రుబాయీలను ఉర్దూ నుంచి తెలుగులోకి అనువదించి ఏపీ ఉత్తమ అనువాద పురస్కారం అందుకున్నారు. భాష ఏదైనా తన రచనలను ముచ్చట రూపంలో పాఠకులకు అందించడమే సామల ప్రత్యేకత.
సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు అందరితో ఉన్న తన అనుభవాలను, జ్ఞాపకాలను తిరుగులేని విధంగా, ఎవరూ మరిచిపోలేని విధంగా, మరొకరు అనుకరించలేనంత గొప్పగా, ధారావాహికగా, అమృతవర్షంగా కురిపించిన జ్ఞాపక రచనల గొప్ప వచన శిల్పం ‘యాది’. ఇది 2005లో గ్రంథస్థమైంది. ‘యాది’ అంటేనే సామల సదాశివుడు అన్నంతగా గుర్తింపు తెచ్చింది. సదాశివుడు 7వ తరగతి చదివేటప్పుడు ‘జల్ జంగల్ జమీన్’ నినాదంతో పోరాడిన విప్లవ వీరుడు కొమురం భీం చనిపోయారు. ఆయన మృతదేహాన్ని సామల చదువుకునే స్కూల్ పక్కన ఉన్న దవాఖానలో పంచనామా నిమిత్తం ఉంచారు. అది తెలుసుకున్న సామల కొమురం భీం మృతదేహాన్ని కండ్లారా చూశారు. ఆ సంఘటన తన జీవితంలో మరువలేనని తన ‘యాది’లో చెప్పుకొన్నారు. సామలకు 1980లో ఏపీ ప్రభుత్వం పాఠ్యపుస్తక ప్రచురణ సంస్థ నుంచి 7వ తరగతి తెలుగు వాచకం రాసే అవకాశం వచ్చింది. దీంతో ఆయన కొమురం భీం పాఠాన్ని పొందుపరిచి తెలంగాణలో మరుగున పడ్డ పోరాట వీరుడిని ప్రపంచానికి పరిచయం చేశారు. 1968 నుంచి 83 వరకు ఏపీ సాహిత్య అకాడమీ ఉర్దూ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా, 1991 నుంచి 94 వరకు కేయూ సెనేట్ సభ్యునిగా సామల సేవలందించారు. 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2002లో కాకతీయ యూనివర్సిటీలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు అందించాయి. 2006లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ‘ప్రతిభ రాజీవ్ పురస్కార అవార్డు’ అందుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సామల సదాశివుడు తెలంగాణ మాగాణంలో ఒక ‘సాహితీ శిఖరం’. 2012 ఆగస్టు 7న ఈ లోకాన్ని విడిచిన సామల సదాశివుడు తెలుగు సాహితీ ప్రియులకు ‘యాది’గా మిగిలిపోయారు. దాశరథి, కాళోజీ లాంటి కవుల సమకాలికుడిగా ఎదిగిన సామల పేరిట ప్రభుత్వం ఓ పురస్కారాన్ని అందివ్వాలని యావత్ సాహితీ లోకం కోరుకుంటున్నది.