సీ. కాళేశ్వర స్వామి కాళ్లకు ప్రణమిల్లి,
సుందిళ్ల నరహరిస్తుతులొనర్చి,
ఎములాడరాజన్నకెల్ల మొక్కులుదీర్చి,
రంగనాయకుని కీర్తనలు పాడి,
కొమురెల్లి మల్లన్న గుడి ప్రదక్షిణ చేసి,
కొండ పోచమ్మకు దండవేసి,
ఏడుపాయలదుర్గనెదురేగి దర్శించి,
బాసర భారతిన్ ప్రాంజలించి.
తే.గీ. తరగలెత్తింది తల్లి గోదావరిగంగ
నోళ్లుతెరిచినబీళ్లకు నీళ్లొసంగ
కలలు నిజమయ్యె; ఫలియించె కల్వకుంట్ల
చంద్రశేఖర రాయార్య శపథదీక్ష
ఉ. కానెడువాడులేక చిరకాలముగా శిథిలమ్ములైనకృ
ష్ణానదిమీది చెర్వులకు సత్తము శాశ్వతమయ్యె; పూర్తికా
గా నలు సాగునీటి పథకాలవిగో తెలగాణ భూమికిన్
కానుకలయ్యె రైతు జలకమ్ముల నాడగ సస్యసీమలన్
సీ. శిథిలమై చితికిన చెరువుల సరిచేసి
కళలు దిద్దెను “మిషన్ కాకతీయ”
చిక్కులు తొలగించి చీకట్లనురికించి
ధైర్యమిచ్చెను “నిరంతర కరెంటు”
అన్నదాతల ఇంటి ఆపదతీర్చగా
ఊతమై నిల్చెను “రైతుబీమ”
వ్యవసాయ భూమి వివాదాలు, భేదాలు
మోసాలు లేకుండ చేసే “ధరణి”
తే.గీ. విత్తనమ్ముల, ఎరువుల వెతలుదీరె
పల్లెసీమల వలసలు చెల్లిపోయె
“రైతుబంధు”వందిన అన్నదాతమురిసె
దండుగన్నట్టి ఎవుసము పండుగయ్యె
తే.గీ. ఆకుపచ్చని చేలు, జలాశయాలు,
పాలవెల్లువలు, ఫలములు, పూలతరులు,
ధాన్యరాశుల తెలగాణ ధన్యసీమ
కాంతులీనెను రైతు సంక్రాంతి లేమ
–డాక్టర్ అయాచితం శ్రీధర్
98498 93238