దేశ ఆర్థికవ్యవస్థ రహదారులపై ఆధారపడి ఉంటుంది. రహదారి వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉంటే ఆర్థికవ్యవస్థ అంతా బలోపేతంగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాల్నంటే రహదారులు అభివృద్ధికి చిహ్నం. అభివృద్ధి చెందిన రహదారులున్న ప్రాంతాల్లో వ్యవసాయ, పారిశ్రామిక, ముడిసరుకులు, కూరగాయలు, నిత్యావసర సరుకుల ఎగుమతులు-దిగుమతుల రవాణా సులభతరమవుతుంది.రహదారులు సమర్థవంతంగా ఉండే ప్రాంతాల్లో పర్యాటకరంగం కూడా అభివృద్ధి చెందుతుం ది. రోడ్లు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెరిగి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తా యి. నేడు హైదరాబాద్‌కు భారీగా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు తరలివస్తున్నాయి. అందుకు రాష్ట్రంలో పటిష్ఠమైన రవాణా సౌకర్యం కలిగి ఉండ టం కూడా ఒక ముఖ్య కారణం.
రాష్ట్ర రహదారుల అభివృద్ధి కేసీఆర్ విజన్: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత రహదారుల నిర్మాణం నిర్లక్ష్యానికి గురైంది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి రహదారుల్లో 70 శాతం సింగిల్ లైన్ రోడ్లు ఉండేవి. రోడ్ నెట్వర్క్ అధ్వాన్నంగా ఉండటం, రోడ్ల సామర్థ్యం లోపభూయిష్టంగా మారి కనీస మరమ్మతులకు నోచుకోకపోవడం విషాదం. గుంతలతో ఉన్న రోడ్లు ప్రజల ప్రయాణ, సరుకుల రవాణా సౌకర్యానికి ఇబ్బందులు కలిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభ్యున్నతిని అత్యంత ప్రాధాన్యాంశంగా గుర్తించడం ముదావహం. సీఎం కేసీఆర్ రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారు. ఒక ప్రాంత సర్వోతోముఖాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించే రవాణా వ్యవస్థ అందులో కీలకమైన రహదారుల నిర్మాణం, ప్రమాదరహితంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రణాళికాబద్ధంగా ఉండాలని ఆదేశించారు. రహదారుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం అవలంబించే విధానం యావత్ భారతానికి ఆదర్శంగా నిలిచేలా రూపకల్పన చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి నాలుగు లైన్ల రహదారులు, మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లైన్ల రహదారుల నిర్మాణం చేపట్టాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు మలుపులు తగ్గించి రోడ్డును నేరుగా నిర్మించాలని సూచించారు. జాతీయ రహదారులుగా బదిలీ అయినా, రాష్ట్ర రహదారుల నిర్వహణ పనులు కూడా రహదారులు మరియు భవనాల శాఖ చేపట్టాలని, జాతీయ రహదారుల నిర్మాణం జరిగేవరకు బాధ్యత తీసుకొని మరమ్మతులు చేయాలని ఆదేశించారు. మొత్తంగా దేశంలోనే పటిష్ఠమైన రహదారుల నిర్మాణం తెలంగాణలో జరిగేలా చర్యలు తీసుకోవాలని, అందుకు తగిన నిధులు బడ్జెట్లో కేటాయించారు.
రాష్ట్రం ఏర్పడ్డాక రహదారుల అభివృద్ధి: తెలంగాణ రాష్ట్రం ఎర్పడే నాటికీ 6,712 కి.మీ.పొడవు మాత్రమే తెలంగాణ ప్రాంతంలో డబుల్ లైన్ల రోడ్ల నిర్మాణం ఉండేది. ఇప్పుడు డబుల్ లైన్ల రాష్ట్ర రహదారుల పొడవు 12,921 కి.మీ.లు. అదేవిధంగా జూన్ 2014 నాటికీ 669 కి.మీ.ల నాలుగు లైన్ల రహదారులుంటే, ఇప్పుడు వాటి పొడవు 1,029 కి.మీ. గత ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో డబుల్లైన్ల రోడ్ల పొడవు దాదాపు రెట్టింపయ్యింది. నాలుగు లైన్ల రోడ్ల పొడవు 54 శాతం పెరిగింది. 6 లైన్ల రోడ్ల నిర్మాణం 39 కి.మీ. జరిగింది. రూ.13,030 కోట్లతో 7,360 కి.మీ.ల పొడవునా రోడ్ల నిర్మాణం చేపట్టగా అందులో 6,319 పొడవుతో రోడ్ల నిర్మాణం రూ.7,526 కోట్లలో పూర్తయింది. ఇంకా 1,346 కి.మీ.ల రోడ్ల బ్యాలన్స్ నిర్మాణ దశలో ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఇరుకు రోడ్లు, వంతెనలను పునర్నిర్మించడం, విస్తరించడంతో పాటు కొత్తగా రూ.26 50 కోట్లతో 519 కొత్త వంతెనలను నిర్మించే కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే రూ.1405 కోట్ల వ్యయం తో 391 వంతెనలు పూర్తయ్యా యి. మిగిలిన 128 వంతెనలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఒక వినూత్న అవకాశం ఉన్న ప్రదేశాల్లో వంతెనలతో కూడిన చెక్‌డ్యామ్‌ల నిర్మాణం కూడా చేశారు. ఈ వంతెనలు వాగుల, నదుల ఎగువవైపు నీటిని నిల్వచేయడానికి తోడ్పడి, ఆయా పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెరగడానికి దోహదపడుతాయి.
రాష్ట్రం ఏర్పడేనాటికి వారసత్వంగా ఉన్న జాతీయ రహదారి 2,511 కి.మీ. జాతీయ రహదారుల సాధన లో ప్రభుత్వం పురోగతి సాధించి, జాతీయ సగటును అధిగమించింది. రహదారుల విస్తరణ ప్రాధాన్యాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ రాష్ర్టానికి కావాల్సిన జాతీయ రహదారులను పట్టుబట్టి సాధించారు. నేడు రాష్ట్రంలో 30 జాతీయ రహదారులు 4,983 కి.మీ. పొడవుతో విస్తరించి ఉన్నాయి. ఈ ఎనిమిదేండ్లలో జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్రంలో రెండింతలైంది. జాతీయ రహదారుల సగటు తెలంగాణలో ప్రతి 100 చ.కి.మీ.కు 4.45 కి.మీ. కాగా, జాతీయంగా ప్రతి 100 చ.కి.మీ.కు 4.06 కి.మీ. మాత్రమే. ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం రూ.6,314.17 కోట్లు ఖర్చుచేసింది.
రాష్ట్ర ఆవిర్భావ అనంతరం సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం, రోడ్లు భవనాల శాఖ కృషి ఫలితంగా రాష్ట్ర రహదారులు 1,727 కి.మీ., జిల్లా రహదారులు 11,371 కి.మీ., ఇతర రహదారులు 14,363 కి.మీ., మొత్తం 27,4 61 కి.మీ. రహదారులు నిర్మాణానికి చేరుకున్నాయి. రాష్ట్ర రహదారులు దేశంలోనే ప్రశంసించే స్థాయికి ఎదిగింది.
(వ్యాసకర్త: చైర్మన్, తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్)
-మెట్టు శ్రీనివాస్
7396933799