హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీని కోలుకొని విధంగా దెబ్బకొట్టింది. సాధారణంగా కాంగ్రెస్ నాయకత్వానికి దేశ స్థాయిలో నష్టం కలిగించే అంశంలో ఉద్యమించడానికి బీజేపీ ముందు వరుసలో నిలవాలి, నిలుస్తుంది కూడా. కానీ, ఈ వ్యవహారంలో రాష్ట్రంలో బీజేపీ అంటీముట్టనట్టుగా వ్యవహరించినా దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన స్పందన కాంగ్రెస్ పరువు తీసింది.
రాష్ట్రంలో బీజేపీ నాయకులు అంటీముట్టనట్టు వ్యవహరిస్తే.. జాతీయ నాయకులు మాత్రం వన్యప్రాణులను రక్షించాలని ఢిల్లీలో భారీగా పోస్టర్లతో ప్రచారం చేశారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల అడవిలో జింకలు, దుప్పులు, నెమళ్లు వంటి అనేక వన్యప్రాణులు ఉన్నాయి. ఇది వాస్తవం. ‘అక్కడ వన్యప్రాణులు లేవు, అసలు చెట్లే లేవు..’ అన్నట్టుగా కాంగ్రెస్ నాయకత్వం సాగించిన ప్రచారం ఆ పార్టీని నవ్వులపాలు అయ్యేట్టు చేసింది.
పార్టీలవారీగా రాష్ట్రంలో మీడియా చీలిపోవడం వల్ల ఇప్పటివరకు ఇక్కడి తెలుగు మీడియా.. ప్రభుత్వం సాగించిన అనుకూల ప్రచారానికి తగ్గట్టు వ్యవహరించింది. కానీ, యూనివర్సిటీ భూములను కాపాడాలని, వన్యప్రాణులను రక్షించాలని దేశవ్యాప్తంగా మీడియా, సామాజిక మాధ్యమాలు, సెలబ్రిటీలు, బాలీవుడ్ నటీనటులు గళమెత్తారు. ఈ ప్రచారంపై ఎదురుదాడి చేసేందుకు ‘అదంతా ఏఐ సృష్టి, అక్కడ వన్యప్రాణులు లేవు, కేసులు పెడతా’మని మీడియాలో అధికార వర్గం వార్తలు రాయించింది. జాన్ అబ్రహాం, దియా మీర్జా, ధృవ్ రాఠీ వంటి వారిపై కేసులు పెడతామని వార్తలు రాయించినా, వాళ్లు భయపడలేదు.
అక్కడ ఉన్న 400 ఎకరాల భూమిని అమ్ముకోవాలని ప్రభుత్వం ప్రయత్నించింది నిజం. ఆ భూముల్లో వన్యప్రాణులు ఉన్నది నిజం, రాత్రికిరాత్రే భారీఎత్తున బుల్డోజర్లను పంపించి, వేలాది చెట్లను నేలకూల్చింది నిజం. బుల్డోజర్లతో రాత్రివేళ చెట్లను నేలమట్టం చేస్తుంటే నెమళ్లు, దుప్పులు, జింకలు, పశుపక్షాదులు హాహాకారాలు చేసింది నిజం. వీటిని విద్యార్థులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలిసేట్టు చేసింది నిజం. విద్యార్థులే కనుక ఈ పని చేయకపోతే బయటివారికి తెలిసేదే కాదు. పైగా ప్రభుత్వం అక్కడో భూతల స్వర్గాన్ని నిర్మించనుందని మీడియా ప్రచారం చేసేది. ప్రచారంలో ఏఐని వాడుకున్నారేమో కానీ అడవిని, అడవి జంతువులను మాయం చేయాలని చూసింది, భూమి అమ్ముకోవాలని చూసింది నిజం కాదా?
కేవలం నాలుగైదు రోజుల విద్యార్థుల ఉద్యమం దేశవ్యాప్తంగా కదలిక తీసుకువచ్చింది. కోర్టుకు వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో ఎవరూ గడప ఎక్కకముందే అడవిని మైదానంగా మార్చేందుకు పెద్దఎత్తున బుల్డోజర్లను రంగంలోకి దింపారు. దాదాపు వంద ఎకరాల్లో అడవిని చదును చేశారు. సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఒక రకంగా తీవ్ర సమస్యల్లో చిక్కుకోకుండా బయట పడింది.
చెల్లాచెదురైన అటవీ ప్రాణులు, వాటి ఆర్తనాదాలు దేశవ్యాప్తంగా కదలిక తెచ్చాయి. ముంబైలోని సెలబ్రిటీలు, ఢిల్లీలోని సుప్రీంకోర్టు అంత సీరియస్‌గా స్పందించడానికి కారణం ఆయా ప్రాంతాల్లో అటవీ సంపద మాయమైతే వాతావరణం ఎలా ఉంటుందో వాళ్లు స్వయంగా చూశారు. వాతావరణ కాలుష్యం వల్ల ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసివేయడాన్ని, వాహనాల్లో ప్రయాణాలు నిషేధించడాన్ని ఢిల్లీ చూసింది. అందుకే అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు రావద్దని స్పందించింది.
‘భూములు తెగనమ్ముకుంటే మనకూ, మనవారికి ఎంతో కొంత దక్కకపోతుందా?’ అని ఆశలు పెట్టుకొన్నవారికి సుప్రీంకోర్టు స్పందన దుందుడుకు చర్యగా అనిపించవచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టు స్టే విధించి ఉండకపోతే దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు విద్యార్థుల ఉద్యమం పాకి ఉండేది.
దేశంలో రోజుకు సగటున 86 లైంగికదాడి కేసులు నమోదవుతున్నాయి. గంటకు నాలుగు లైంగికదాడుల కేసులు నమోదవుతున్న దేశంలో ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు దేశాన్ని కుదిపేసింది. ఒక్కో వాతావరణంలో, ఒక్కో సంఘటనపై అనేక కారణాలతో దేశం తీవ్రంగా స్పందిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, వన్యప్రాణుల విషయంలోనూ అంత తీవ్రస్థాయి ఉద్యమానికి వాతావరణం అంతా సిద్ధం అయిన తరుణంలో సుప్రీంకోర్టు స్టే విధించడంతో కాంగ్రెస్ బతికిపోయింది. భూములు అమ్ముకుంటూ అక్కడ వన్యప్రాణులు లేవని, గుంటనక్కలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన బాధ్యతారహితమైన వ్యాఖ్యలు విద్యార్థుల ఉద్యమానికి ఆజ్యం పోశాయి. అన్ని చోట్ల బూతులతోనే నెట్టుకు వస్తాననుకున్న ఆయన ఆలోచనలకు తాము అడవిని రక్షించేందుకు గుంట నక్కలమే కానీ, అడవిని దోచుకునే పంది కొక్కులం కాదని విద్యార్థులు బదులిచ్చారు.
గతంలో తెలంగాణలో పర్యటించిన రాహుల్‌గాంధీ అదే యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతూ ‘మీరు ఏ సమస్యపై పిలిచినా పది నిమిషాల్లో వాలిపోతాను’ అని హామీ ఇచ్చారు. అటవీ భూమి అమ్ముకొనే వ్యవహారంలో విద్యార్థులు ఉద్యమిస్తూ రాహుల్‌గాంధీకి విన్నవించుకున్నా స్పందన లేదు. ఈ భూముల వ్యవహారంలో ఇప్పటివరకు బహిరంగంగా ఆయన మాట్లాడలేదు. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఈ వ్యవహారం మెడకు చుట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఏకంగా సచివాలయంలో మంత్రులతో ఈ భూముల గురించి సమావేశమయ్యారు.
మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులపై కేసులు ఎత్తేసేలా చేశారు. ఇదంతా అధిష్ఠానం చెప్పకుండానే పార్టీ ఇంచార్జ్ స్వతంత్ర నిర్ణయాలని చెప్పలేం. వివిధ రాష్ర్టాల్లో అదానీకి భూములు కట్టబెట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రాహుల్‌గాంధీ.. ముందు హైదరాబాద్ యూనివర్సిటీ భూములపై సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది. రాహుల్‌గాంధీ దేశంలో ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్ భూములు, వన్యప్రాణులు ఆయన్ని వెంటాడుతాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
అధిష్ఠానం వద్ద రేవంత్‌రెడ్డి మాట ఎంతవరకు చెల్లుబాటు అవుతుందో పాలనను చూస్తే అర్థమవుతుంది. రేవంత్‌రెడ్డి సీఎం కాగానే టీడీపీలో తన సహచరులు వేం నరేందర్‌రెడ్డి, సీతక్క, శోభా, సూర్యాపేట రజనీలకు పదవులు ఇచ్చారు. ఆ తర్వాత శాసనమండలి ఎన్నికల నుంచి ఇప్పటి వరకు తన మాట చెల్లుబాటు కాలేదు. మంత్రివర్గ విస్తరణ అంటూ గత 15 నెలల నుంచి మీడియాలో వార్తలు తప్ప, అధిష్ఠానం అనుమతి లేదు .రేవంత్‌రెడ్డి నిర్ణయాలు రాహుల్‌గాంధీకి గుదిబండగా మారినా ఆయనను తప్పించలేరు, సొంతంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఇవ్వరు అన్నట్టుగా అధిష్ఠానం, రేవంత్ రెడ్డి మధ్య రాజకీయ దోబూచులాట సాగుతున్నది.
– బుద్దా మురళి