ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ల వేగవిస్తృతిలో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్, కార్పొరేట్, ప్రైవేట్ రంగాల్లో ప్రజా సంబంధాలు అత్యంత కీలక విభాగంగా మారబోతున్నాయి. ప్రజోపయోగ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం, సంస్థ పట్ల ప్రజాభిప్రాయాన్ని సమీకరించి, సంక్షిప్తం చేసి సంస్థకు అందజేసే ప్రజా సంబంధాల అధికారి ఏ వ్యవస్థకైనా గుండెకాయ లాంటి వాడు.
నేటి పోటీ ప్రపంచంలో సంబంధిత ప్రజలకు సమాచారాన్ని స్పష్టంగా, సరళంగా అందజేసే ప్రజా సంబంధాల విభాగానికి నేడు అన్నిరంగాల్లో ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది. మన దేశంలో ప్రజా సంబంధాల ప్రాధాన్యాన్ని గుర్తించిన పీఆర్ మేనేజర్లు సంఘటితమై 1958లో ‘పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా’ను స్థాపించారు. గత 58 ఏండ్ల నుంచి దేశవ్యాప్తంగా పీఆర్ వ్యవస్థ పటిష్టతకు నిరంతరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ దాదాపు 37 ఆల్ ఇండియా సెమినార్లు నిర్వహించింది.
1968, ఏప్రిల్ 21 భారత జాతీయ పీఆర్ వ్యవస్థలో ఒక చారిత్రక దినం. నాడు ఢిల్లీలో జరిగిన జాతీయ సెమినార్లో పెరుగుతున్న పీఆర్ వ్యవస్థ ప్రాధాన్యాన్ని గుర్తించిన నాటి పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ సి.వి.నరసింహారెడ్డి ఏప్రిల్ 21ని జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవంగా ప్రకటించారు. నాటినుంచి నేటిదాకా ఏప్రిల్ 21ని జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవంగా పాటిస్తూ ప్రజా సంబంధాల అధికారులు అనేక శాఖల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా నేడు కమ్యూనికేషన్ విప్లవం నడుస్తున్నది. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ఇలా ప్రచార మాధ్యమాల హవా కొనసాగుతున్నది. కమ్యూనికేషన్ నెట్వర్క్ పరిపరివిధాలుగా విస్తరించిన సమయాన, సామాజిక, ఆర్థిక హోదాల భేదభావం లేకుండా ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ వ్యవస్థ చేరువైంది. ఈ నేపథ్యంలో సంబంధిత సమాచారాన్ని నిర్దేశిత జన సమూహానికి చేరవేసే ప్రజా సంబంధాల విభాగ ప్రాధాన్యం రోజురోజుకు విస్తరిస్తున్నది.
ప్రజా సంబంధాల ఆవశ్యకతను, ప్రాధాన్యాలను గుర్తించిన, పటిష్ఠమైన పీఆర్ విభాగాన్ని ఏర్పరుచుకున్న సంస్థలే విజయ పరంపరలో ముందుకువెళ్తున్నాయి. నేడు విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ సెక్టార్, ప్రైవేట్ పరిశ్రమలు, పీఆర్వోలను నియమించుకోవడం తప్పనిసరి అయింది. ప్రజా సంబంధాల విభాగాల విశేష ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రభుత్వాలు పలుశాఖల ద్వారా పీఆర్ వ్యవస్థను బలోపేతం చేయాలి. వేల కోట్ల రూపాయల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వాలు, ఆయా కార్యక్రమాలు, పథకాలు వాటి లక్ష్యాలు ప్రజలకు చేరవేయడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి శాఖలో, ప్రతి విభాగంలో పీఆర్ వ్యవస్థను పటిష్ఠం చేయాలి. మారుమూల గ్రామీణ ప్రజలకు సైతం అన్ని కమ్యూనికేషన్ల వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్న స్థితిలో ఆయా పరిస్థితులకు అనుగుణంగా సమాచార, ప్రసార, పౌర సంబంధాల విభాగంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది.
సమాచార శాఖ ద్వారా ప్రసారం, ప్రచారం చేసే కార్యక్రమాల్లో మూస పద్ధతులకు స్వస్తి పలికి ప్రచారంలో ఆధునికతను సంచరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లక్షల కోట్ల బడ్జెట్తో ముందుకువెళ్తున్న ప్రభుత్వాలు ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు చేరవేసే ప్రజా సంబంధాల విభాగానికి ప్రతి శాఖలో సముచిత నిధులు కేటాయించాలి. సమాచార శాఖ అంటే కేవలం మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసే విభాగంలా కాకుం డా ప్రజలకు సరైన సమాచారాన్ని సమగ్రంగా అందజేసే వ్యవస్థగా తీర్చిదిద్దాలి.
కేవలం సమాచార శాఖ ఉద్యోగులు ఆయా శాఖల ప్రజా సంబంధాల అధికారులు మాత్రమే ప్రచార కార్యక్రమా లు చూస్తారనే భావన పోవాలి. ప్రతి శాఖలో ప్రతి ఉద్యోగి, ఐఏఎస్ నుంచి అటెండర్ వరకు సమాచార సంబంధాల అధికారిగా మారాలి. ఆయా శాఖల సమాచారం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ప్రతి ఉద్యోగికి ప్రజా సంబంధాలపై శిక్షణ ఇప్పించా లి. ప్రతి మంత్రిత్వ శాఖలో ప్రతి మంత్రికి, ముఖ్య కార్యదర్శులకు జిల్లా కలెక్టర్లకు, ఆంతరంగిక కార్యదర్శులు, వ్యక్తిగత సహాయకులు ఎంత ముఖ్యమో ప్రజా సంబంధాల అధికారి కూడా అంతే ముఖ్యమని భావించి అధికారికంగా ప్రజా సంబంధాల అధికారిని నియమించాలి.
పత్రికా రంగం, టీవీ చానళ్లు విస్తరించి మం డల స్థాయిలో విలేకరులను నియమించుకుంటు న్న నేపథ్యంలో ప్రతి మండలంలో, గ్రామస్థాయిలో ప్రతి ముఖ్యమైన శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బందికి సమాచార పౌర సంబంధాలపై శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ప్రతి మం డల రెవెన్యూ కార్యాలయంలో, ప్రతి పోలీస్స్టేషన్లో ప్రజా సంబంధాల విభాగాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజల కోసం, ప్రజల వరకు ప్రభుత్వం వెళ్లాలంటే ప్రజా సంబంధాల పటిష్ఠత ఒక్కటే మార్గం. ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేసే మం చి ప్రజా సంబంధాల విభాగా న్ని నిర్మించుకోవటం ద్వారానే ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతుంది.
సమాచార శాఖ ద్వారా ప్రసారం, ప్రచారం చేసే కార్యక్రమాల్లో మూస పద్ధతులకు స్వస్తి పలికి ప్రచారంలో ఆధునికతను సంచరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లక్షల కోట్ల బడ్జెట్తో ముందుకువెళ్తున్న ప్రభుత్వాలు ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు చేరవేసే ప్రజా సంబంధాల విభాగానికి ప్రతి శాఖలో సముచిత నిధులు కేటాయించాలి. సమాచార శాఖ అంటే కేవలం మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసే విభాగంలా కాకుండా ప్రజలకు సరైన సమాచారాన్ని సమగ్రంగా అందజేసే వ్యవస్థగా తీర్చిదిద్దాలి.
– సురేష్ కాలేరు
98661 74474
(వ్యాసకర్త: సహాయ ప్రజా సంబంధాల అధికారి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ)