గడిచిన పక్షం రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన నాలుగు వీడియోలు ఉత్సుకత కలిగించాయి. ఒక దాంట్లో.. పాలమూరు జిల్లాలో ఊరు ఊరంతా ఒకచోట చేరి, కేసీఆర్ పాటకు ఉత్సాహంగా కోలాటం ఆడుతున్నరు. వారిలో యువకుల మొదలు వృద్ధుల వరకు ఉన్నరు. పంచాయతీ ఎన్నికల అనంతరం గ్రామస్థాయిలో రగిలే కార్పణ్యాలు ఇంకా చల్లారకముందే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, ప్రత్యేకించి పాలమూరు పల్లెలో ఫ్యాక్షన్ నీడలు కమ్ముకుంటున్న తరుణంలో.. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ పాటకు గ్రామ రైతులందరూ కాలు కదపడం కనిపించింది. కేసీఆర్ అందరివాడు.. హద్దుల్లేని అభిమానం ఆయన సొంతం. ఆయనను ఒక పార్టీ కోణంలో చూడటం మూర్ఖత్వం. అది చంద్రుడిని చెంబులో చూడటమే!
కేసీఆర్ పట్ల ప్రజలు అభిమానం చాటుకుంటున్న ఘటనలు నిత్యం మనకు ఎక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉన్నాయి. అందులో ఒకటి.. ఇటీవల కేసీఆర్ జగిత్యాల సభకు వెళ్లివస్తుంటే.. ఆయన ప్రయాణిస్తున్న బస్సు పక్కనుంచే వేగంగా బైక్ నడుపుతూ ఆయనను పలకరించేందుకు తాపత్రయపడిన ముగ్గురు యువకుల సెల్ఫీ వీడియో. అద్దానికి ఆవలివైపు కేసీఆర్ ను చూసి.. ‘బాపూ.. బాపూ’ అంటూ వారు అరుస్తుంటే.. కేసీఆర్ వారిని చూసి చెయ్యి ఊపుతూ కనిపించారు. అన్నింటికీమించి, ‘జాగ్రత్తగా పొండి! పైలం బిడ్డా!’ అన్నట్టు ఆయన సైగ చేసినప్పుడు అచ్చం తండ్రి.. కొడుక్కు చెప్తున్నట్టే అనిపించింది. ఆ వాత్సల్యం వల్లే కదా తెలంగాణ ఆయనను ‘బాపూ’ అని పిలుచుకునేది! కేవలం రాజకీయ నేతగానే తనని చూడటం సంకుచితం. అది గుప్పెడు నీటిని పట్టుకుని ‘ఇదే గంగ’ అనడమే!
అలాగే ఇంకొక వీడియో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ పల్లెలో ఇంటి గోడపై ప్రొజెక్టర్ సాయంతో జగిత్యాల సభలో కేసీఆర్ మాట్లాడుతున్న లైవ్ వీడియోను ప్లేచేసుకుని, గ్రామస్థులందరూ ప్రసంగాన్ని వినడం ఆసక్తికరంగా అనిపించింది. సమకాలీన రాజకీయాల్లో అట్లా పల్లెజనం ప్రొజెక్టర్లు వేసుకొని ప్రసంగాలు వినగలిగే నాయకుడు ఎవరైనా ఉన్నారా? భజన మీడియాతో మరుగుజ్జులనూ భారీకాయులుగా చూపించవచ్చునేమో కానీ, అంగుష్ఠము అంగుష్ఠమే! ఆకాశం ఆకాశమే!
అమెరికాలో ఓ డిపార్ట్మెంటల్ స్టోర్‌లో పనిచేసే తెలంగాణ యువకుడు.. జగిత్యాల సభలో కేసీఆర్ లైవ్ ప్రసంగాన్ని వింటూ పని చేసుకుంటున్న వీడియో మరొకటి. ఎక్కడి తెలంగాణ! ఎక్కడి అమెరికా! అధికారంలో ఉన్న నేత లు మాట్లాడుతుంటేనే టీవీలు బంద్ చేస్తున్నప్పుడు.. 72 ఏండ్ల కేసీఆర్ గురించి తెలంగాణ ఎందుకు ఎదురుచూస్తున్నది? ఆయన మాట కోసం ఎందుకు పరితపిస్తున్నది? మాట్లాడుతుంటే ఎందుకు చెవులొగ్గి వింటున్నది? కేసీఆర్‌పై పాటకు యువతరం ఎందుకు కాలు కదుపుతున్నది? కేసీఆర్ అంటే తెలంగాణకు ఎందుకంత అభిమానం? ఎందరో నాయకులున్నా ఆయనకే ఎందుకంతటి ఆదరణ?
భావోద్వేగ బంధమే కేసీఆర్‌కు, తెలంగాణకు కనెక్టింగ్ పాయింట్. గిమ్మిక్కులకు, ఓట్లకు పరిమితమయ్యే రాజకీయాల్లో సామాన్యుడితో ఆయన అనుబంధం ఆసక్తికరం. కేసీఆర్ ఆలోచనల్లో, ఆచరణల్లోనూ కామన్‌మ్యానే కేంద్రబిందువు అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. కేసీఆర్ పోరాటపటిమ, ఉద్యమం నడిపిన తీరు ప్రపంచం చూసింది. అడ్డంకులను అధిగమించి ముందుకు సాగిన తీరును, దెబ్బతిన్న ప్రతిసారీ.. ఫీనిక్స్ పక్షిలాగా తిరిగి లేచిన తీరును చూసింది. కానీ అంతర్ముఖంలో తెలంగాణ సగటుజీవి తచ్చాడుతూ ఉంటాడు.
కారుమబ్బు కనిపిస్తే.. దుక్కులకు సిద్ధం కావాలని సగటు రైతులా తపిస్తాడు. విత్తనాల బస్తా కోసం దుకాణదారుకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆయనలో సాధారణ కర్షకుడు కనిపిస్తాడు. ఓయూలో విద్యార్థి అమరుడు అయినప్పుడు పంటిబిగువున దుఃఖాన్ని దాచుకునే ఓ సగటు తండ్రి కడుపుతీపిని తెలంగాణ చూసింది. కరోనా సమయంలో కేసీఆర్ టీవీలో కనిపించి, మాట్లాడితే.. లక్షలమందికి గుండెధైర్యం దొరికింది. తెలంగాణతో సంబంధం లేకపోయినా.. ఉత్తరాది నుంచి కాలినడకన స్వగ్రామాలకు బయల్దేరిన కార్మికుల గోసను దేశంలో మొదటగా అర్థం చేసుకున్నది కేసీఆరే. భోజనం సమకూర్చి, వాహనాలు పెట్టి మరీ వారిని రాష్ట్రం సరిహద్దులకు ప్రభుత్వం చేర్చింది.
వాళ్ల సొంతరాష్ర్టానికి వెళ్లే రైళ్లను ఎక్కించింది. కేసీఆర్ ప్రసంగాల్లో సామాన్యుల పేర్లు సర్వసాధారణంగా వినవస్తాయి. ఆయన ప్రస్తావించడం వల్ల చాలామంది రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితులయ్యారు కూడా. రైతు రాంరెడ్డి ఎవరు? నీటి తడికోసం తండ్లాటలో బొక్కెనల్లా బోర్లు వేసి, బొక్కబోర్లా పడిన రైతాంగానికి ఆయన ప్రతినిధి. ఉమ్మడి పాలకులు తెచ్చిపెట్టిన దుర్భిక్షానికి ఎదురొడ్డి భగీరథ ప్రయత్నంలో అలసిన అన్నదాత. అంతకుముందు ఆయన గురించి ఎవరికీ పెద్దగా తెల్వదు. కేసీఆర్ ఊరూరా ఆయన పేరు చెప్పి, తెలంగాణ గోసను వివరించిండు.
బోర్ల రాంరెడ్డి అంటే తెలువని వ్యక్తులు ఇప్పుడు చాలా అరుదు. అట్లనే రెండుకండ్ల సిద్ధాంతి చంద్రబాబును తెలంగాణ మీద వైఖరి చెప్పాలని నిలదీసిన సామాన్య పసులకాపరి ఫణికర మల్లయ్య, మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు, జలసాధన ఉద్యమ నేత దుశర్ల సత్యనారాయణ.. ఇట్ల కేసీఆర్ మాట్లాడుతుంటే పదే పదే ప్రస్తావనకు వస్తారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదిరెడ్డి వంటి అమరుల పేర్లూ కేసీఆర్ నోట ప్రస్తావనకు రావడం సర్వసాధారణం. ఇన్నేండ్ల రాజకీయంలో కానీ, రెండున్నరేండ్ల అధికారంలోకానీ.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోటి నుంచి ఇలాంటి ఒక్కపేరైనా ఎప్పుడైనా విన్నారా? చర్లపల్లి సెంట్రల్ జైలు సహచరుడు నాగయ్య పేరు తప్ప! గుండె తడి, మానవీయత ఉన్న నేత కేసీఆర్.
ఆయన తెచ్చిన అనేకానేక సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనం. అవి రొడ్డకొట్టుడు స్కీములు కావు. ఆత్మహత్యలను రైతుబంధు ఎలా ఆపిందో ప్రజాప్రభుత్వాలకు ఓ కేస్‌స్టడీ. బాల్యవివాహాలను కల్యాణలక్ష్మి పథకం ఎలా నిరోధించిందో మానవీయ పాలనకు ఓ పాఠం. ఆ కార్యక్రమాల వెనుక కూడా సామాన్యుడి వెతలు ఉన్నాయి. గుండెతడి ఉన్న నేతగా కేసీఆర్.. అవి మదిలో నిలుపుకొన్నడు కాబట్టే, అలాంటి పథకాలు తెలంగాణ ప్రజలకు అందినయ్. ఓ కల్పన అనే యువతి కథ కల్యాణలక్ష్మికి కారణమైంది. ఓ చిమ్నిబాయి వెత మిషన్ భగీరథకు నీళ్లుపోసింది. అట్లా ఒక్కో పథకం వెనుక ఒక్కో సామాన్యుడు ఉన్నడు. ఆ కథలను కేసీఆరే స్వయంగా, ప్రజాముఖంగా చాలాసార్లు వెల్లడించారు. సామాన్యుడి చుట్టూ సంక్షేమాన్ని అల్లినందుకే తొమ్మిది న్నరేండ్లలో తెలంగాణ వేగంగా సంతులిత, సమ్మిళిత, సర్వతోముఖాభివృద్ధిని సాధించగలిగింది.
మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసం ప్రాజెక్టులను ప్రకటించే పాలకులను చాలామందిని చూసింది తెలంగాణ. దశాబ్దాలు గడిచినా తట్టెడు మట్టి ఎత్తిందీ లేదు, ఇటుక పేర్చిందీ లేదు. కాలయాపనే తప్ప, కట్టి నీళ్లివ్వాలన్న ఉద్దేశం ఉంటే కదా! తెలంగాణను తామేదో ఉద్ధరిస్తున్నట్టు పోజులే తప్ప.. శిలాఫలకాలు గుదిబండలుగా మారిన ఉదంతాలను చూసిందీ తెలంగాణ. కానీ, కేసీఆర్ విభిన్నం. మూడేండ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్‌ను నిర్మించి చూపించడం అసాధారణం.
వందేండ్లుగా ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న నల్లగొండ జిల్లాను ఆరేండ్లలోనే ఫ్లోరైడ్హ్రితంగా మార్చడం అసామాన్యం. విద్యుత్తు కోతలతో అల్లాడిన ప్రజలకు ఒక భరోసానిచ్చి, రెప్పపాటు కూడా కరెంటు పోని రాష్ట్రంగా రెండేండ్లలోనే తీర్చిదిద్దడం అపూర్వం. తరాలుగా వలసపోయిన పాలమూరును, పసిడిపంటల పొలమూరుగా మార్చి, ఇతర రాష్ర్టాలనుంచి వ్యవసాయ కార్మికులు పనుల కోసం అక్కడికి వలస వచ్చేలా చేయడం అనన్య సామాన్యం. పాలకుడికి ఎంత చిత్తశుద్ధి, తన ప్రజలపట్ల ఎంత బాధ్యత, తన రాష్ట్రం పట్ల ఎంత ప్రేమ, తన పనిపట్ల ఎంత అంకితభావం ఉంటే అది సాధ్యమవుతుంది? కేసీఆర్ అరుదైన రాజకీయవేత్త. ఇరుకిరుకు కొలమానాల్లోనూ ఇరకడు. మూస ఫార్ములా గీటురాళ్లకు దొరకడు. తెలంగాణ గురించి తప్ప మరోవిషయం కలలోనైనా ఆలోచించని నేత కేసీఆర్. తన ప్రజలకు కేసీఆర్ ఏనాడూ అన్యాయం చేయలేడని ఆయన్ను గుడ్డిగా వ్యతిరేకించేవాళ్లూ అంగీకరించే విషయం.
నిన్నటితరం మొదలు, జెన్-జీ దాకా..
అభిమానానికి అంతరాలు చెరిపేసిన నేత కేసీఆర్
ఆయన ముమ్మాటికీ తెలంగాణ ఆత్మబంధువు..
ఆత్మగల్ల నేత.. అంతరాత్మ గల్ల నేత!
-రంగు ప్రవీణ్‌కుమార్