సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎంపవన్ కల్యాణ్‌కు తెలంగాణ వికాస సమితి, సింగిడి తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ అస్తిత్వ వేదిక బహిరంగ లేఖ)
‘దశాబ్దాల ప్రజా పోరాటాల ఫలితంగా, వేలాది మంది అమరుల త్యాగాల పునాదులపై మా తెలంగాణ రాష్ర్టాన్ని మేం సాధించుకున్నాం. రాష్ట్రం అవతరించి పుష్కర కాలం దాటినా తెలంగాణపై కుట్రలు, కుతంత్రాలు మాత్రం ఆగడం లేదు. దేశ ప్రధాని నరేంద్రమోదీ గారు ‘తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చారు’ అని పార్లమెంట్లో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటును, అమరుల త్యాగాలను అవమానించారు. నిధులు, ప్రాజెక్టులకు అనుమతులు, నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా తెలంగాణపై సవతి తల్లి ప్రేమనే చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రధానికి తోడుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ నాయకుడైన మీరు తయారయ్యారు. ఇప్పుడిప్పుడే మానుతున్న ఉమ్మడి రాష్ట్రపు గాయాలను మీ గాలి మాటలు, గాయి బొబ్బలతో మళ్లీ పెచ్చరిల్లేలా చేస్తున్నారు. తెలంగాణ సమాజం పక్షాన మీ ముందు కొన్ని పదునైన వాస్తవాలు, ప్రశ్నలను ముఖాముఖిగా పెడుతున్నాం. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆనాడు మేం ఎవరికి వ్యతిరేకంగానైతే పోరాడామో… ఆ చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఉన్న కూటమిలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పటికీ తెలంగాణ ప్రయోజనాలకు మోకాలడ్డుతూనే ఉన్నారు.
కాళేశ్వరం నుంచి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వరకు ప్రతీ ప్రాజెక్టుకూ వ్యతిరేకంగా కేంద్రానికి చంద్రబాబు శరపరంపరగా ఉత్తరాలు రాసింది వాస్తవం కాదా? ఇప్పుడు తాజాగా పోలవరం – బనకచర్ల, పోలవరం – నల్లమలసాగర్, గోదావరి-కావేరీ నదుల అనుసంధానం పేరిట తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టే కుట్రలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన జోరుగా సాగుతున్నాయి. ఏపీ ఉపముఖ్యమంత్రిగా ప్రభుత్వం తరఫున జరుగుతున్న ఈ జల దోపిడీ కుట్రలకు మీరు కూడా బాధ్యులే.
ఇక మీరు తెలంగాణలో పోటీ చేయడంపై మాకేమీ అభ్యంతరం లేదు. ఇది మీకేమీ కొత్త కాదు, గత ఎన్నికల్లోనూ పోటీ చేసి, ఏ స్థానంలోనూ డిపాజిట్లు దక్కించుకోలేకపోయిన చరిత్ర మీది. ఒకవైపు చూస్తేనేమో… ‘తెలంగాణ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు నాశనమైపోయాయి’ అని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మనస్తాపం చెంది 11 రోజులు భోజనం మానేశాను’ అని చెప్పడం ద్వారా మీ తెలంగాణ వ్యతిరేక మనస్తత్వాన్ని బహిరంగవేదికపై బయటపెట్టుకున్నారు. అటువంటి మీరు జూన్ 2న తెలంగాణ రాష్ర్టావతరణ దినోత్సవం నాడు హైదరాబాద్‌లో సభను నిర్వహించ తలపెట్టి ఇక్కడి ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడానికి యత్నించారు. మీ హైదరాబాద్‌లో మీటింగ్‌కు వచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలు ఏకంగా ఇక్కడి ‘ముఖ్యమంత్రిని అడ్డంగా నరికేస్తాం’ అని మాట్లాడుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇది ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయడం తప్ప మరోటి కాదు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారి ఓట్ల కోసం, తద్వారా మీకు అనుకూలమైన రాజకీయ పార్టీలకు (చంద్రబాబుకు, ఢిల్లీ బీజేపీ పెద్దలకు) లబ్ధి చేకూర్చేందుకు కొత్తగా ఈ నాటకానికి తెరదీశారు. రాష్ట్రం ఏర్పడిన ఈ పుష్కర కాలంలో ఇక్కడున్న ఆంధ్రా వారిపై ఎలాంటి దాడులూ జరుగలేదు, ఎవరూ వివక్ష ప్రదర్శించలేదు. ఆంధ్రాలో పార్ట్‌టైమ్ పాలకుడిగా ఉంటూ, హైదరాబాద్‌లోనే వీకెండ్స్ గడుపుతూ, ఇక్కడి ప్రజల గంగా-జమునా తెహజీబ్‌ను కించపరిచే సినిమాలు తీస్తూ, ఇక్కడి ప్రజలు మీకు దిష్టి పెట్టారని అవమానించినా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నిలదీయలేదు. మీ ఇంటి ముందు ధర్నాలు చేయలేదు, చావుడప్పు కొట్టలేదు. ఇది మా బలహీనత కాదు, తెలంగాణ సమాజ ఉన్నత సంస్కారానికి నిదర్శనం.
తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్, ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై మీరు చేసిన అపరిపక్వ వ్యాఖ్యల వల్ల మీ స్థాయిని మీరే తగ్గించుకొన్నారు. అయినా తెలంగాణ ప్రజలు సంయమనం పాటిస్తున్నారు. తెలంగాణలో ఆంధ్రాకు చెందిన కాపులను కూడా బీసీలుగా పరిగణించాలనే ఒక అత్యంత ప్రమాదకరమైన ప్రతిపాదనను మీరు తెరపైకి తెస్తున్నారు. ఇది ఇక్కడి స్థానిక తెలంగాణ బీసీల హక్కులను, అవకాశాలను దారుణంగా దెబ్బతీసి, మళ్లీ వలస దోపిడీకి తలుపులు తెరిచే కుట్ర కాదా? చే-గువేరా సిద్ధాంతాల నుంచి సనాతన ధర్మం వరకు విరుద్ధ భావజాలాల మధ్య సులువుగా యూటర్న్ తీసుకోగల, సందర్భాన్ని బట్టి రంగులు మార్చగల పచ్చి అవకాశవాద, తెలంగాణ వ్యతిరేక పవన్ కల్యాణ్‌లు మాకు అక్కరలేదు. సినీ గ్లామర్‌ను చూసి మోసపోవడానికి, కులమతాల ఉచ్చులో పడటానికి ఇక్కడున్నది సామాన్య యువత కాదు. నాడు ఉద్యమంలో ఉరకలెత్తిన తెలంగాణ యువ చైతన్యం ఇది.
ఉద్యమ సందర్భంలోనే మేం మీకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం. ‘మీరు ఇక్కడికి రావచ్చు.. పోవచ్చు.. కానీ తెలంగాణ సెక్రటేరియట్లో మాత్రం చక్రం తిప్పడం కుదరదు. ఇప్పుడు కూడా అదే విషయాన్ని ముక్తకంఠంతో మరోసారి ప్రకటిస్తున్నాం. ఎవరో ఢిల్లీ, ఆంధ్రా పెద్దలు ‘కీ’ ఇస్తే మీరు ఆడుతున్నారనే విషయం ఇక్కడి ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. మీ కూటమి బంటుగా పనిచేస్తున్న కోవర్టు నాయకులు తెలంగాణలో మీ కుట్రలను కొనసాగించడానికి సహకరిస్తున్నారని తెలుసు. మీ రాజకీయ ప్రయోజనాలు, సొంత లాభం కోసం తెలంగాణ ప్రజలను అవమానించడం, కించపరచడం వంటి పనులు చేయొద్దని హెచ్చరిస్తున్నాం. మీ సిసలైన కార్యక్షేత్రాన్ని వదిలిపెట్టి… మీ స్వార్థ, దోపిడీ ప్రయోజనాల ఉద్ధరణ కోసం, మాపై మళ్లీ మీ వలస పెత్తనాన్ని పాలనకు రుద్దాలని చూస్తున్న ఈ కుట్రను తక్షణమే కట్టిపెట్టండి. మీ వెనుక ఉండి నడిపిస్తున్న వాళ్ల కలలు ఈ గడ్డపై ఎప్పటికీ నెరవేరవు. ఆత్మగౌరవ తెలంగాణ ఎవరికీ తలవంచదు. జై తెలంగాణ.