నేపాల్‌లో మరోసారి రాజకీయ అస్థిరత చోటుచేసుకుని ప్రభుత్వం మారిపోయింది. 2008లో రాజరిక వ్యవస్థ రద్దయిపోయి గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత గడిచిన 16 ఏండ్ల కాల వ్యవధిలో అక్కడ 13 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గత రెండేండ్లలోనే మూడో ప్రభుత్వం కొలువుదీరింది. పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ ఇటీవల అవిశ్వాస తీర్మానం కారణంగా తన పదవి కోల్పోయారు. ఆయన స్థానంలో చైనా అనుకూల నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కేపీ శర్మ ఓలీ.. నేపాల్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రధాని పదవి చేపట్టారు. పదే పదే సంకీర్ణాలు మారుతుండటం వల్ల ప్రధానులూ మారిపోవడం నేపాల్‌లో పరిపాటి అయ్యింది. ఓలీ ప్రధాని పదవి చేపట్టడం ఇది నాలుగోసారి.
ఇలా ఎడతెరిపి లేకుండా సాగుతున్న కుర్చీలాటకు ఎన్నికల వ్యవస్థలో ఉన్న చిక్కులు కారణమవుతున్నాయి. నేపాల్ పార్లమెంటులో మొత్తం 275 స్థానాలుండగా అందులో 165 స్థానాలను మెజారిటీ ప్రాతిపదికన, 110 స్థానాలను దామాషా పద్ధతిన ఎన్నుకుంటున్నారు. దళితులు, మహిళలు, మైనారిటీలు సహా పీడిత వర్గాలన్నిటికీ ప్రాతినిధ్యం కల్పించి, కేంద్రీకృత అధికారం స్థానంలో సమాఖ్యవాదం తేవాలనే ఉద్దేశంతో ఈ విధానం తెచ్చారు. ఈ మిశ్రమ విధానం ఫలితంగా ఏ ఒక్క పార్టీకీ పూర్తి మెజారిటీ రాక సంకీర్ణాలు తప్పడం లేదు.
చిన్నచిన్న పార్టీలు పిడికెడు స్థానాలు గెలుస్తున్నందు వల్ల పెద్ద పార్టీల్లో దేనికీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం ఉండటం లేదన్నది వాస్తవం. రాజకీయ అస్థిరతకు కారణమవుతున్న ఈ రెండు రకాల ఎన్నికల విధానాన్ని మార్చి, అంతటా మెజారిటీ పద్ధతి తేవాలని నూతన ప్రధాని ఓలీ భావిస్తున్నారు. అయితే ఇది తేనెతుట్టెను కదిలించడమే అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. రద్దయిపోయిన రాజరిక వ్యవస్థ, హిందూరాజ్య పునరుద్ధరణ డిమాండ్లు తలెత్తవచ్చనే సందేహాలే అందుకు కారణం.
కొత్త ప్రధాని ముందు అనేక సవాళ్లున్నాయనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సరిహద్దు దేశాలైన భారత్, చైనాలతో సమతూకం పాటించడం అనేది అందులో ఒకటి. నేపాల్‌లో చైనా ప్రాబల్యం పెరుగుతుండటం వల్ల భారత్ పాత్ర పెద్దన్నయ్య నుంచి సమవుజ్జీ స్థాయికి చేరుకుంది. నేపాల్‌తో సహా యావత్తు దక్షిణాసియాపై పట్టు కోసం భారత్, చైనా మధ్య పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా అనుకూల ఓలీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం భారత్‌కు ఒక విధంగా ప్రతికూల పరిణామమే. గతంలో భారత్-నేపాల్ సంబంధాల్లో పొరపొచ్చాలకు ఓలీ కారణమయ్యారన్న సంగతి మరచిపోరాదు.
చమురు, ఆహార పదార్థాలతో సహా నిత్యావసర వస్తువుల కోసం నేపాల్ భారత్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నది. అలాగే సుమారు 40 లక్షల మంది నేపాలీలు చదువు, ఉపాధి కోసం భారత్‌కు వలస వస్తుంటారు. చైనా పోటీ వల్ల భారత్ నేపాల్‌లో పెట్టుబడులు కూడా పెంచుకుంటున్నది. గతంలో ఓలీ రెండు దేశాల వాణిజ్యంలో ప్రతిష్టంభన తెచ్చినప్పుడు నేపాలీ ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఓలీ మరోసారి భారత్‌తో గిల్లికజ్జాలకు దిగకపోవచ్చనే వాదన వినిపిస్తున్నది. అదే జరిగితే ఉభయ దేశాలకూ శ్రేయస్కరం.