ఓడ మల్లయ్య సామెత బీజేపీకి వర్తించినంతగా మరే ఇతర పార్టీకి వర్తించదేమో. మతోద్ధరణ తమ గుత్తహక్కు అని చెప్పుకొంటారు ఆ పార్టీ నేతలు. కానీ మతపరమైన విషయాల్లో ఇచ్చిన హామీని కూడా హుళక్కి చేయడం వారికే చెల్లింది. గత ఎన్నికలకు సుమారు ఏడాది ముందు యూపీలోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు అయోధ్య ఆలయాలు, మఠాలకు అన్నిరకాల పన్నులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అన్న ప్రకారమే అన్ని పన్నులను రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీచేసింది. అంతంతమాత్రం ఆదాయంతో నెట్టుకొస్తున్న మహంతులు, పూజారులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు.
ఎన్నికల్లో గెలిచిన దరిమిలా దొడ్డిదారిన సింబాలిక్ ట్యాక్స్ పేరిట పన్నులు వడ్డిస్తున్నది. దాంతో హర్షం వ్యక్తంచేసిన మహంతులే మండిపడుతున్నారు. ఇదంతా జరుగుతున్నది బీజేపీ గొప్పగా చెప్పుకొనే భవ్య రామమందిరం నిర్మాణమవుతున్న అయోధ్యలోనే కావడం గమనార్హం. అయితే అన్నిరకాల పన్నులు రద్దుచేయడం వల్ల తమ ఆదాయానికి గండి పడుతుందని అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ ప్రభుత్వానికి ఓ వినతిపత్రం ఎన్నికలకు ముందే సమర్పించింది. ఆ సంగతిని ఎన్నికలు పూర్తయ్యేవరకు బీజేపీ సర్కారు దాచిపెట్టింది. ఎన్నికల్లో విజయం దక్కగానే మళ్లీ పన్నుపోటుకు తెగబడింది. ఏప్రిల్ 1 నుంచి స్లాబులవారీగా పన్ను వసూలు చేస్తున్నారు. దీనిపై మహంతులు మండిపడుతున్నారు. చీటికి మాటికి ఆలయాల ఉద్ధరణ గురించి ఊదరగొట్టే బీజేపీకి నిజంగా ఆ విషయంలో ఉన్న శ్రద్ధ ఎంత? అనేది ప్రశ్నగానే మిగులుతుంది. గతంలో బీహార్లో అధికారంలో ఉన్నప్పుడు ఆలయాల మీద నాలుగు శాతం పన్ను వేసి బీజేపీ అభాసుపాలైంది. ఆలయాలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండరాదని సోషల్ మీడియాలో ప్రచారం చేసే బీజేపీ పన్నుల విషయం వచ్చేసరికి ఎలా ప్రవర్తిస్తుందో ఈ ఉదంతాలు తెలియజేస్తున్నాయి.
కేవలం అయోధ్యకు పరిమితమైన సమస్య కాదు. కాశీ, కేదార్నాథ్, జోషీమఠ్ వంటి ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ విషయంలోనూ బీజేపీ పనితీరు సానుకూలంగా ఏమీ లేదు. కాశీ విశ్వనాథ ఆలయం పరిసరాల్లో సుందరీకరణ పేరిట జరిపిన కూల్చివేతలపై తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి. ఆధ్యాత్మిక, చారిత్రక వారసత్వ సంపదను ధ్వంసం చేశారని పత్రికలు రాశాయి. చార్ధామ్లో భాగమైన కేదార్నాథ్ ఆలయంలో గోడలకు బంగారు తాపడాల విషయంలో గోల్మాల్ జరుగుతున్నట్టు అక్కడి పూజారులే ఆరోపించడం గమనార్హం. దీనిని అధికారులు ఖండించారు. ఇక జోషీమఠ్ ప్రాంతం కృంగిపోవడం వెనుక కారణాలను అన్వేషించిన కమిటీ అభివృద్ధి పేరిట చేపట్టిన పనులే ముప్పుతెచ్చాయని పేర్కొన్నది. ఎడా పెడా కొండలను పేల్చి రోడ్లు వేయడం, ఎన్టీపీసీ భారీ ప్రాజెక్టు కట్టడం వంటివి కుంగుబాటుకు దారితీశాయని తేల్చిచెప్పింది. ఆధ్యాత్మికతను కేవలం టూరిజం కోణంలో చూడటం వల్ల సమస్య వస్తున్నదని అంటున్నారు. ఆధ్యాత్మిక కేంద్రాల చుట్టూ నిర్మాణాలు విరివిగా జరుగుతున్నాయి. దీనివల్ల ఆధ్యాత్మిక అంశాలకు ఉండే పవిత్రత గాలికిపోతున్నది. వ్యాపార ధోరణి పెచ్చరిల్లుతున్నది. మతం, దేవుడు, ఆధ్యాత్మికతను రాజకీయం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందే బీజేపీకి దేవుని మీద కన్నా అధికారం మీదే భక్తి ఎక్కువ అని చెప్పవచ్చు.