తనను చూస్తుంటే
నదే కనబడుతుంది
నదే చలనంగా ధ్వనిస్తూ
ప్రశ్నిస్తున్నట్లు వినబడుతుంది
ఇరుకు సందులు గొందుల
విద్వేషపు విష వలయాలను
విజ్ఞతతో విశాలం చేసేందుకు
దిశా దశా దారులు విస్తరించె
దార్శనికతనే దర్శనమిస్తుంది
ఎన్ని ఒడుదుడుకులున్నా
అర్జునుడి గాండీవంలాగ
లక్ష్యాన్ని సాధించేందుకు
అడుగడుగున సంఘర్షణ సమర
వీణను మీటుతున్నట్లే కనబడుతుంది
శత్రువు బలాబలాలను
సరిచూసి గురిపెట్టే
సమయోచిత యుద్ధతంత్ర
సారథ్యమే కనబడుతుంది
స్వాగతం పలికే మట్టిని
సారవంతంగా మార్చి
పైరుపచ్చల ఫలపుష్పాలనందించె
ఆత్మీయ ఆలింగనాల నిత్య భగీరథ
స్నేహ హస్తమే కనబడుతుంది
నెర్రెలు బారిన నేలను
తడారిపోయిన గొంతులను
తడిపేందుకు మమతలు పంచే
మానవతా ప్రేమ మూర్తి అమ్మ చనుబాల
సంరక్షణ కమ్మదనమే కనబడుతుంది
అడ్డగించి అణచివేయాలనుకునే
బలవంతపు రాళ్లు రప్పలు గుట్టల
గుండెలను సుతిమెత్తగా చీల్చే
భయం కనిపించని పదునైన
జలఖడ్గమే కనబడుతుంది
తనను చూస్తుంటే నిండైన
మనిషితనమే కనబడుతుంది
మనిషే చలనంగా అంతటా విస్తరించే
నిత్య చేతనమే కనబడుతుంది..
-వేల్పుల నారాయణ
94404 33475