నవంబర్ 14.. ఈ తేదీకి రెండు ప్రత్యేకతలున్నాయి. మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఒకటైతే, ఈ జనరేషన్‌కు కామన్ సమస్యగా మారిన మధుమేహంపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన, చైతన్యం కల్పించే లక్ష్యంతో ప్రపంచ డయాబెటిస్ దినంగా పాటించడం రెండోది. అయితే, ‘మెరుపు మెరిస్తే.. వాన కురిస్తే.. ఆకసమున హరివిల్లు విరిస్తే.. అవి మీకే అని ఆనందించే కూనలారా..’ అంటూ బాల్యాన్ని వర్ణిస్తారు మహాకవి శ్రీశ్రీ. బాల్యం అంటే..? ఆట.. పాట.. చదువు సంధ్యలతో జోరుగా, హుషారుగా సాగిపోవాల్సిన దశ. 70, 80వ దశకాల్లో సైతం ఈ మాత్రం భాగ్యానికి నోచుకోని పిల్లలు మనకు ప్రతి గ్రామంలోనూ కుప్పలుతెప్పలుగా కనిపించేవారు. అంతకుముందు పరిస్థితి మరీ దారుణం. కానీ, ఆ తర్వాత శ్రామికవర్గంలో, అట్టడుగు వర్గాల్లో చదువుల పట్ల పెరిగిన చైతన్యం, దానికి తగ్గట్టుగా పెరిగిన విద్యాసంస్థల వ్యాప్తి, బాల్య వివాహాలకు, బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన కృషి, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం లాంటి పథకాలు.. అట్టడుగువర్గాల పిల్లల్ని బడిబాట పట్టించాయి. సాంఘిక, సంక్షేమ హాస్టళ్లలో చదువుకొన్న పిల్లలు సైతం స్థితిమంతులైన పిల్లలతో సమానంగా ఉన్నత స్థాయి కొలువుల్లోకి ఎదిగిరావడం, రాజకీయాల్లోనూ రాణించి ఉన్నత పదవులు అధిష్ఠించడం మన కండ్లముందే జరిగిన సంతోషకర పరిణామం.
అయితే, దురదృష్టవశాత్తు ఇప్పుడు బాల్యానికి నిర్వచనం మారుతున్నది. ఇప్పుడు బాల్యమంటే.. వీపు మీద పుస్తకాల బ్యాగ్.. ఒక చేతిలో సెల్‌ఫోన్.. మరో చేతిలో డయాబెటిక్ కిట్..! ఇదేదో సెటైరికల్‌గా చెప్తున్న మాట కాదు. అలాంటి దురవస్థలో బాల్యం చిక్కుకుంటున్నది. అమెరికా, భారత్‌తోపాటు అనేక దేశాల్లో కనీసం పద్నాలుగేండ్లు కూడా నిండని చిన్నారుల్లో టైప్-1 డయాబెటిస్ కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. అమెరికాలో ఏటా ప్రతి లక్ష మంది పిల్లల్లో ఇరవై నుంచి ముప్పై మంది వరకు కొత్తగా డయాబెటిస్ బారిన పడుతున్నారట! అక్కడ ఇటీవల సంవత్సరాల్లో పిల్లల్లో డయాబెటిస్ కేసులు రెండొందల నుంచి మూడొందల శాతం వరకు పెరుగుతున్నాయనేది నివేదికల సారాంశం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారతదేశంలో 2022 సంవత్సరంలో టైప్ -1 డయాబెటిస్ బారినపడ్డ 14 ఏండ్లలోపు వయస్సు గల పిల్లల సంఖ్య 95,600 మంది! నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ అంచనాల ప్రకారం మన దేశంలో ఏటా కొత్తగా డయాబెటిస్ బారినపడుతున్న పిల్లల సంఖ్య 15,900 మంది! గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. ఇది ఇటు తల్లిదండ్రులు, అటు ప్రభుత్వాలు సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయం.
కెరీర్‌కు నిచ్చెన మెట్లు వేసే ‘సెట్లు’ వచ్చిన తర్వాత బడిపిల్లల వీపు మీద పుస్తకాల బరువు, అంతకుమించిన హోంవర్క్ కల్చర్ ఊపిరి సల్పని పరిస్థితిని సృష్టించాయి. మరోవైపు మన జీవితాల్లోకి ఒకదానితో ఒకటి పోటీపడుతూ.. టీవీ, ఫేస్బుక్, యూట్యూబ్, స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌టీవీలు ప్రవేశించాయి. టీవీ చానల్స్ వస్తూ వస్తూనే మన డైనింగ్ సిస్టమ్‌ను, స్లీపింగ్ టైం టేబుల్‌ను మార్చేశాయి. ఆకాశంలో చందమామను చూపిస్తూ చిన్నారులకు గోరుముద్దలు తినిపించే అమ్మనూ మాయం చేశాయి. సాయంత్రాలు ఆరుబయట సైకిళ్లు తొక్కుతూ, ఆటలాడుకునే ఫ్రెండ్షిప్లకు కటీఫ్ చెప్పించేశాయి. పొద్దస్తమానం క్లాసులు.. హోంవర్క్‌లు.. వీక్లీ టెస్టులు.. కాకుంటే, రీల్స్.. మీమ్స్.. వీడియో గేమ్స్.. ఒక్క క్షణమైనా సూర్యరశ్మి సోకని దేహం.. ఇదే ఇప్పటి జెన్ జడ్ స్టూడెంట్ లైఫ్! ఆట-పాట లేని, సూర్యరశ్మి సోకని, ప్రకృతిని ఆస్వాదించలేని, జంక్‌ఫుడ్ తప్ప మరేమీ రుచించని, అనుక్షణం ఈ-వరల్డ్‌తో అనుసంధానమవుతున్న జీవనశైలి ఇప్పుడు బాల్యం పాలిట శాపంగా మారుతున్నది. ఫలితమే చిన్న వయసులోనే కండ్లద్దాలు.. డయాబెటిస్.. విటమిన్-డీ లోపం.. ఊబకాయం.. స్కూల్లో బెంచ్ మీదనే కుప్పకూల్చేస్తున్న గుండెపోట్లు.. మరెన్నో రుగ్మతలు.. ఇంకెన్నో శారీరక, మానసిక బాధలు! ఈ దురవస్థ నుంచి బాల్యాన్ని బయటపడేసే మార్గమే లేదా?
(నేడు చిల్డ్రన్స్ డే & వరల్డ్ డయాబెటిస్ డే)
– కందిబండ కృష్ణప్రసాద్
91827 77010