టైగర్ రిజర్వ్ కాదు.. చెంచు రిజర్వ్
పులికి ప్రపంచం అంతటా ఆవాసమే. చెంచులకు నల్లమల మాత్రమే నివాసం. ఎతైన గుట్టలు, దట్టమైన మట్టలు, ఎప్పటిదో ఈ నల్లమల పుట్టుక. పులి..పుట్ర..పూరేడు..మారేడు జాతుల్లో తమ జీవనాన్ని వెతుకుంటూ చెంచులు నల్లమలకు ఏనాడొచ్చారో? జీవరాశితో కలిసి చెట్ల తొరల్లో నివశించే వీళ్లు చెట్టు దిగి పెంట మీదకి ఎప్పుడొచ్చారో? ఏమో..!
పులికి ప్రపంచం అంతటా ఆవాసమే. చెంచులకు నల్లమల మాత్రమే నివాసం. ఎతైన గుట్టలు, దట్టమైన మట్టలు, ఎప్పటిదో ఈ నల్లమల పుట్టుక. పులి..పుట్ర..పూరేడు..మారేడు జాతుల్లో తమ జీవనాన్ని వెతుకుంటూ చెంచులు నల్లమలకు ఏనాడొచ్చారో? జీవరాశితో కలిసి చెట్ల తొరల్లో నివశించే వీళ్లు చెట్టు దిగి పెంట మీదకి ఎప్పుడొచ్చారో? ఏమో..! కానీ ప్రపంచంలో ఒక్క నల్లమల అడవిలో తప్ప మరెక్కడా కనిపించని అత్యంత అరుదైన అడవి జాతి. జీవన వైవిధ్యంలో చెంచులది అతి సున్నిత స్థానం. పులి తరహాలోనే చెంచులు అంతరిస్తున్న జాతుల జాబితాలోనే ఉన్నారు. అటువంటి ఆదిమ మానవుని అస్తిత్వంపై రాజ్యం పగబట్టకుండా సానుకూల ఆలోచనలు చేయాలి. పులుల రిజర్వ్ ప్రాజెక్టు తరహాలో నల్లమలను చెంచుల కోసం రిజర్వు చేయాలి.
2003లోఅనుకుంటా చెంచుల మూలాలను తడుముంటూ వెళ్లి అమ్రాబాద్ మండలం కుమ్మెనపెంటలో రాత్రి నిద్ర చేశాను. అప్పుడప్పుడే చలికాలం వెళ్లిపోతూ వసంత కాలం చొరబడుతున్నది. అప్పటికీ అడవి మీద చలి ఆధి పత్యం కొనసాగుతున్నది. చెంచు సోదరులు ఆర్తి అంజన్న గుడిసె ముందు నెగడి అంటేస్తే..దాని పక్కన మూడ్సుకున్న. ఆ రాత్రి ఎలా గడిచిపోయిందో ఏమో..! తెల్లారి వేకువ పొద్దు వేళ ‘వెంకన్న..పులి పులి’ అని అరుస్తూ నన్ను తట్టి లేపిండు అంజన్న. నిద్రలోంచి ఉలిక్కి పడిలేచిన. గుడిసె ముందు నుంచి పులి మెల్లగా అడుగులు వేస్తూ వెళ్తున్నది. ఊళ్లలో ఇంటి ముందు కుక్కను చూపించినట్టు అంజన్న నాకు పులిని చూపించిండు. పులి మీద పడదా? అని అంజన్నను అడిగితే.. ‘అది పెంటింది.. వేట రాదు..ఉరికి జంతువును కొట్టలేదు. అప్పుడో ఇప్పుడో జీవాన్ని కొడితే మిగిలిన మాంసాన్ని కూడ మేం ముట్టం, సేతగాంది అని అంత దానికే వదిలిపెడతం’అని చెప్పిండు.
అంజన్న చెప్పింది అసాధారణ విషయం. తన పరిసరాల్లో ఉన్న పులి సైకాలజీ. తన చుట్టూ జీవుల మనుసెరిగి నడుచుకునే వైవిధ్య జీవనం వారిది. చెంచులు అడివిలో అంతర్భాగం. అడవిని, అకడి పక్షులను, జీవజాతులను, ఆదివాసీని వేరుగా చూడలేము. అటవి ఆవరణ గొలుసులో ఒకొక జాతి ఒకొక అంతస్థు. చెంచు వారు కూడ అటవీ ఆవరణ వ్యవస్థలో ఒక అంతస్థు అని పర్యావరణ శాస్త్రం చెప్తున్నది. చెంచులు రేపటి గురించి ఆలోచన చేయరు. దాచుకోవటం అనే మార్మికం తెలియదు. ఉన్నప్పుడు తినడం, లేనప్పుడు పస్తులు పండటం మాత్రమే తెలుసు. అడవిలో కాలానుగుణంగా దొరికే కాయలు, పండ్లు, గడ్డలు తిని బతుకుతారు.
ఆహార సేకరణ పర్యావరణ సమతుల్యతను సూచించే ఆహారపు గొలుసులోని నిబంధనలకు అనుగుణంగానే ఉంటుంది. ఉడతలు, ఉడుములు, ఎలుకలు, కుందేళ్లను వేటాడుతారు. అరుదుగా జింకల వేట కూడ చెంచు జీవనంలో ఉన్నది. పులులు తిని వదిలేసిన మాంసాన్ని కూడ తింటారు. ఒకసారి జంతువును వేటాడితే దాన్ని పూర్తిగా ఆరగించే వరకు ఆహార సేకరణ ఉండదు. చెంచులకు వ్యవసాయం లేదుకాబట్టి నల్లమలలో పోడు వ్యవసాయం లేదు.
ఎకడా కూడా చెంచులు అడవిని నాశనం చేసినట్లు మనకు ఆధారాలు దొరకవు. అడవిలో వర్షాకాలం, చలికాలాల్లో ఐదు గంటలకే చీకటి పడుతుంది. చీకటి పడక ముందే ఇళ్లు చేరుతారు. కుందేటి సుక పొడిచే యాళ్లను నిద్ర పోతారు. అదే సమయంలో అడవి తావుల నుంచి జంతువులు బయటికి వస్తాయి. రాత్రంతా ఆహార అన్వేషణ చేస్తాయి. పొలిపొద్దు యాళ్లకు మళ్లీ తావుకు చేరుకుంటాయి. ఆ సమయంలో చెంచుల జీవన చర్య మొదలవుతుంది.
జంతువుల జీవన చక్రంలో చెంచుల జీవన చర్యలు ఎకడ కూడ జోక్యం చేసుకోవు. ప్రకృతే చెంచులకు, అటవి జంతువుల మధ్య అటువంటి సర్దుబాటు చేసింది. మరి ఎందుకు చెంచులను అడవికి శుత్రులగా చిత్రీకరిస్తున్నారు? ఎందుకు వారిని అడవి నుంచి దూరం చేసే కుట్రలు చేస్తున్నారు? ఇకడ ఇంకో మాట చెప్పుకోవాలి. పులి ఆకలి తీరాలంటే కచ్చితంగా ఏదో ఒక జంతువును వేటాడాలి. ఆకలిగొన్న పులి తన కంటే పెద్ద జంతువును కూడా వేటాడి వెంటాడి చంపి తింటుంది. అంత మాత్రం చేత పులిని అటవీ వినాశనకారిగా భావించగలమా? అడవిలో పులికి, చెంచుకు పెద్దగా తేడా లేదు. అయినా.. ఆదివాసీ చెంచుల మీద రాజ్యం ఆగిఆగి దాడులు చేస్తూనే ఉన్నది. ప్రజలను, ప్రజా సంఘాలను ఏమార్చే ఎత్తుగడలు వేస్తూనే ఉన్నది. ఇదంతా ఒక పద్దతి ప్రకారం జరుగుతున్నది. మొదట పోలీసు బలగాలు అడవిలోకి చొరబడ్డాయి. అన్నలు, ఆదివాసీల హననం జరిగిపోయింది. తరవాత పులుల సంరక్షణ కోసమంటూ చెంచుల వెంట పడుతున్నారు.
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమలలో 338 చెంచు పెంటలున్నాయి. వేరుబడ్డ తెలంగాణలో 169 పెంటల్లో 14,438 మంది చెంచులు జీవిస్తున్నారని అంచనా. ఇది కూడ రాజ్యం ఉద్దేశ్యపూర్వకంగా వారి జనాభా లెకలను పెంచి చూపిస్తున్నది. 1921 మహా విభాజక సంవత్సరం నుంచి దేశ జనాభా పెరుగుతూ వస్తుంటే ..చెంచుల జనాభా మాత్రం ఊహించనంత వేగంగా తగ్గుకుంటూ వస్తున్నది. పాలకులు ఇదేమీ పట్టనట్టు చెంచులను అడవి దాటించే ప్రయత్నం చేస్తున్నారు. గిరిజనేతరుల అటవి ఆక్రమణను వదిలేసి చెంచులను మాత్రమే అటవికి దూరంగా తరలిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలోని మొదటి దశలో వట్వార్లపెల్లి, సార్లపెల్లి, కుడి చింతలబైలు, కుమ్మెనపెంట, కొల్లంపెంటను బలవంతంగా తరలించేందుకు సర్కార్ సిద్ధమైంది. ఎకో సెన్సిటివ్, సైలెంట్ జోన్ల పర్యవేక్షణ కోసం రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు. అటవీ ఆక్రమణలు, చెట్ల నరికివేత ల పేరుతో అడవిలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు.
నిజానికి చెంచులను అడవి దాటించే ప్రయత్నం ఈనాటిది కాదు.. 1910లో ఒకసారి, 1932-34 మధ్య కాలంలో మరోసారి, 1937లో ఇంకోసారి చెంచులను తరలించే ప్రయత్నాలు జరిగాయి. 1941-42 మధ్య కాలంలో అమ్రాబాద్ మండలం అప్పాపూర్ పరిసర ప్రాంతం చెంచు పెంటలను తరలించి, పునరావాసం కల్పించాలని ప్రభుత్వం భావించింది. తరలింపు కార్యక్రమం జరుగక ముందే 400 మంది చెంచులు గుండె పగిలి చనిపోయారు. దీంతో ప్రభుత్వం తన అభిప్రాయం మార్చుకుంది. వారిని స్థానిక ప్రాంతంలో ఉంచి అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. 2003లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15 పెంటలకు చెందిన దాదాపు 300 మంది కుటుంబాలను బలవంతంగా తరలించారు. ఆప్రయత్నంలో 70 మంది చెంచులు మరణించారు.
ఈ అనుభవాలను అధ్యయనం చేసిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చెంచులను అడవి దాటించాలనే ఆలోచనను వ్యతిరేకించారు. అటవి హకుల చట్టం కింద చెంచులకు సాంక్రమించిన 7380 ఎకరాల్లో పట్టా భూములకు చట్టబద్దత కల్పించారు. మరో 1000 ఎకరాలకు ఆర్వోఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చారు. ఈ భూములకు రైతుబంధు ఇచ్చారు. పట్టా భూముల్లో ఉపాధి హామీ పథకం కింద 150 రోజుల పని దినాలు కల్పించారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపవద్దని 2019లో కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు.
1940లో సామాజిక పరిశోధకుడు, రచయిత హైమండాఫ్ చెంచు పెంటలను సందర్శించినపుడు చెంచు గుడిసెల ముందు అకడకడ వ్యవసాయం కన్పించిందట. అదే హైమండాఫ్ తిరిగి 1970లో మరో సారి చెంచుల పెంటకు వెళ్లినపుడు వ్యవసాయం కన్పించ లేదని రాశారు. నాటి నుంచి ఇప్పటి వరకు వారు ఆహర సేకరణ నుంచి వ్యవసాయం వైపు పరివర్తనం చెందలేదనే చెప్పాలి. ప్రభుత్వం సేద్యం వైపు ప్రోత్సహిస్తే.. ఒకొక గూడెంలో 400 నుంచి 500 ఎకరాల సాగుభూమి అందుబాటులోకి వస్తుంది. ఈ భూమిని అభివృద్ధి చేసి చెంచులను వ్యవసాయం వైపు మళ్లించాలని హైమండాఫ్ అప్పట్లోనే సూచించారు.
సాగునీటి సౌకర్యంతో పాటు వర్షాధారంగా పంటలు పండే భూమి నల్లమలలో ఉందని, ఇలాంటి భూమి దాదాపు లక్ష ఎకరాల వరకు ఉంటుందని, ఈ మైదాన భూమిని చెంచులకు రిజర్వ్ చేయాలని 1941లో ఆయన ప్రతిపాధించారు. హైమండార్ఫ్ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకున్న అప్పటి నిజాం ప్రిన్సిలీ స్టేట్ గవర్నమెంటు నల్లమల ప్రాంతం చెంచులకే చెందుతుందని 1942 మార్చి ఒకటిన డిక్లేర్ చేసింది. ఈ డిక్లరేషన్తో నల్లమల అడివి. అందులో సాగుకు అనుకూలంగా ఉన్న లక్ష ఎకరాల భూమి కూడా చెంచుల అధీనంలోకి వెళ్లిపోయింది. ఇక ఇకడి నుంచి చెంచులను తరలించటం చట్ట విరుద్ధమే. పులులకు అభయారణ్యాలను రిజర్వ్ చేసినట్టుగానే చెంచు జాతి కోసం నల్లమల ఫారెస్టును రిజర్వ్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞాపణ.
అటవి హకుల చట్టం కింద చెంచులకు సాంక్రమించిన 7380 ఎకరాల్లో పట్టా భూములకు చట్టబద్దత కల్పించారు. మరో 1000 ఎకరాలకు ఆర్వోఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చారు. ఈ భూములకు రైతుబంధు ఇచ్చారు. పట్టా భూముల్లో ఉపాధి హామీ పథకం కింద 150 రోజుల పని దినాలు కల్పించారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపవద్దని 2019లో కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

