ప్రాథమిక మానవ హక్కులను ఉల్లంఘించే వ్యవస్థీకృత నేరాల్లో మానవుల అక్రమ రవాణా ఒకటి. మానవుల అక్రమ రవాణా లైంగిక దోపిడీ కోసం, బలవంతపు శ్రమతో సహా అనేక ఇతర రూపాల్లో ఉండవచ్చు. దీనికి ప్రధానంగా పేదరికం, నిరక్షరాస్యత, జీవనోపాధి లేకపోవడం మొదలైన కారణాలు ఆజ్యం పోస్తున్నాయి. అక్రమ రవాణా ఎక్కువ భాగం దేశం లోపలే జరుగుతున్నది. అంతర్జాతీయంగా చూస్తే, మధ్యప్రాచ్య ఆసియాకు అక్రమ రవాణా ఎక్కువగా ఉన్నదని గణాంకాలు చెప్తున్నాయి.
అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) మానవ అక్రమ రవాణా నిరోధక ఒడంబడికను మనదేశం ఆమోదించింది. మానవుల అక్రమ రవాణా, అణచివేయడం వ్యక్తి సంక్షేమానికి ప్రమాదమని ఆ ఒడంబడిక ప్రకటించింది. బాధితుల పునరావాసం, సామాజిక సర్దుబాటు, వారి ఉపాధి ప్రోత్సాహానికి ఈ ఒప్పందంలోని ఆర్టికల్-16 ప్రభుత్వ బాధ్యతలను నిర్దేశిస్తుంది. 2011 మేలో ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ ఆన్ ట్రాన్సేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (యూఎన్సీటీఓసీ)ను భారత్ ఆమోదించింది. దాని మూడు నియమాలు..
1. వ్యక్తుల అక్రమ రవాణాను సంపూర్ణంగా నివారించడం. 2.నేరస్థులపై సత్వర నేరవిచారణ. 3. బాధితుల రక్షణ, ఉపాధి కల్పన లాంటివి ఉన్నాయి.
దక్షిణాసియా స్థాయిలో వేశ్యావృత్తి నివారణ, మహిళలు, పిల్లల అక్రమ రవాణాను నిరోధించడంపై దక్షిణాసియా అసోసియేషన్ ఫర్ రీజినల్ కో-ఆపరేషన్ (సార్క్) కన్వెన్షన్లో మన దేశం భాగస్వామిగా ఉన్నది. ఇది సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించి తద్వారా మహిళలు, పిల్లల అక్రమ రవాణాను నిరోధిస్తుంది. ప్రస్తుతం, వ్యక్తుల అక్రమ రవాణాకు సంబంధించి భారత శిక్షాస్మృతి (ఐపీసీ)-1860 అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం ప్రకారం.. శారీరక, లైంగిక దోపిడీలను శిక్షార్హమైనవిగా పరిగణిస్తుంది. అంతేకాకుండా, వ్యభిచారం కోసం బాలికల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన సెక్షన్ 366 ఏ, 366 బీ, 372, 373 కింద ఐపీసీలోని నిర్దిష్ట నిబంధనలు అక్రమ రవాణా సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక చట్టాలకు అనుబంధంగా ఉన్నాయి.
సమాజం అభివృద్ధి చెందుతున్నా మానవ అక్రమ రవాణా సమస్య సమసిపోవటం లేదు, సరికదా ఎక్కువ అవుతున్నది. ఈ క్రమంలో వ్యక్తుల అక్రమ రవాణా సమస్యకు సంబంధించి ఒక సమగ్ర విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉన్నది. భారత ప్రభుత్వం వ్యక్తుల అక్రమ రవా ణా (నివారణ, రక్షణ, పునరావాసం) కోసం ప్రత్యేక కృషి చేయాల్సిన అవస రం ఎంతైనా ఉన్నది. 2017లో దేశవ్యాప్తంగా ‘భారత యాత్ర’ను నిర్వహించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచార ఉద్యమం చేపట్టారు. ‘పిల్లలను పశువుల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసి, అమ్మినంత కాలం, ఏ దేశమూ తనను తాను నాగరికంగా చెప్పుకోజాలద’ని ఉద్ఘాటించారు. కొవిడ్-19 వల్ల అనేక సామాజిక ఆర్థిక సమస్యలతో పాటు మహిళలు, పిల్లల అక్రమ రవాణా పెరిగింది. దీని నివారణకు ఇప్పటికైనా నిబద్ధతతో కృషిచేయాలి. అలాగే ఎంతోకాలంగా నానుతున్న మానవ అక్రమ రవాణా నివారణపై తేదల్చిన బిల్లును కేంద్రం ఆమోదించాలి.
2020 క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం… తెలంగాణలో బాలలపై నమోదైన నేరాల సంఖ్య 1400. పిల్లల అపహరణలో నమోదైన కేసుల సంఖ్య 1258. దీనికి ప్రధాన కారణాలు కొవిడ్ మహమ్మారితో ఉపాధి కోల్పోవటం, పేదరికం. తీవ్రమైన కరువు ప్రభావిత ప్రాంతాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఉపాధి లేకపోవడం లాంటి సామాజిక సమస్యలు కూడా మానవ అక్రమ రవాణాకు హేతువులుగా ఉన్నాయి. సామాజిక ప్రగతితోనే ఇలాంటి వ్యవస్థీకృత సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ దిశగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కృషి జరగాల్సిన ఆవశ్యకత ఉన్నది.
– చందన మరిపల్లి
92055 85962
(వ్యాసకర్త: రాష్ట్ర సమన్వయకర్త, బచ్పన్ బచావో ఆందోళన్)
(నేడు మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం)