కాకతీయుల సామంతులలో మల్యాల వంశీయులు సామ్రాజ్య విస్తరణకు తమ శక్తి సామర్థ్యాలను జోడించారు. అందులో చౌండసేనాని గణపతిదేవ చక్రవర్తి విజయాలకు, రాజ్య ప్రతిష్ఠకు తోడ్పడినాడు. దివిసీమ మీద దండెత్తి చోడియరాజును ఓడించి అతడి ధనాగారాన్ని స్వాధీనం చేసుకొని చక్రవర్తికి అప్పగించా డు. ఇతడు కొండపర్తి గ్రామంలో శివాలయాన్ని నిర్మించి, ఆలయ ధూప దీప నైవేద్యాలకు దానమిచ్చిన సందర్భంలో శాసనం వేయించాడు. శాసనకాలం శక సంవత్సరం 1125 = క్రీ.శ.1203,
రుధిరోద్గారి సంవత్సరం వైశాఖ శుద్ధ పంచ మి.
శాసనం ప్రారంభంలో మల్యాల వంశ వర్ణన ఉంది. మల్యాల నాథుడైన దంన్న సేనానికి ‘పెదముట్టు గండ’ అనే బిరుదు ఉన్నది. అతని పుత్రుడు సబ్బసేనాపతి. ఇతడు సంకీస పుర పాలకుడు. అతని భార్య ఆచమ. వీరి కుమారుడు కాటయ. రుద్రదేవ మహారాజు వద్ద మంత్రిగా పనిచేశాడు. ఇతనికి ‘కోట గెల్పాట’ అనే బిరుదు న్నది. ఇతని భార్య బొల్లమ్మ. వీరికి పోత, చౌండ అనే ఇద్దరు కుమారులు.
చౌండసేనాని తన పేర చౌండపురాన్ని నిర్మించి అగ్రహారంగా బ్రాహ్మణులకు దానం గా సమర్పించాడు. చౌండ సముద్రమనే చెరువు తవ్వించాడు. కొండిపర్తిలో తన పేర శివలింగాన్ని, చౌండేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాడు. చౌండసేనాని భార్య విరియాల మైలమ. ఆమె గురించి ఈ శాసనంలో..
‘గంగా వక్రగతివ్విమాగ్గ
గమనా సారుంధతీ సవ్వదా
భూరేషాచ భుజంగభోగ
నిరతా సీతా కుజన్మా తథా
పాంచాలీ బహువల్లభా
ప్రనితా జాతా జడాదిందిరా
నిద్దోషా గుణినీచ
యస్య గ్రిహిణీ తాసూపమే
యాకయా॥’
గంగాదేవి పవిత్రమైనదైనను వక్రమార్గంలో పయనిస్తుంది. పతివ్రతా శిరోమణి అయిన అరుంధతి ఆకాశ గమనగా ఉంటుంది. భూమి క్షమాగుణం కలిగినదైనా శేషుని ఫణములపై ఉంటుంది. పతివ్రత సీతాదేవి భూజాతగా ఉంది. ద్రౌపదీ ఐదుగురు భర్తలను కలిగి ఉంది. లక్ష్మీదేవి జడమైన సముద్రంలో పుట్టింది. ఈ పతివ్రతలంద రూ ఏదో ఒక దోషాన్ని కలిగి ఉన్నా రు. కానీ ఎటువంటి దోషాలు లేకుండా మైలమ సకల గుణాలంకృతగా, వారితో పోల్చడానికి వీల్లే కుండా ఉందని వర్ణించబడింది. ఇంకా ఈ శాసనంలో చౌండసేనాని నిర్మించిన ఆల యం వర్ణన ఈవిధంగా ఉంది…
‘ప్రాకారోయం జయతి విశతాం పాపశత్రు ప్రరోధీ॥ శైలేంద్ర
నీల విమలోపల కల్పితేషు
ప్రాకర రమ్య శిఖరేషు సమున్నతేషు. తారాస్ఫురంతి
విపులావిమళ ప్రకాశౌ దీపావళీ
విరచితేవ సురై: సమంతాత్..’
అంటూ.. ఆలయ ప్రాకారాలు, శిఖరా లు ఎంత ప్రకాశవంతంగా ఉన్నా యో తెలుపుతుంది. శాసనం మొత్తం సంస్కృత భాషలో వర్ణనలు, అలంకారాల తో ఉంది. మల్యాల కాటసేనాని, గుండదండాధీశు డు వేయించిన శాసనాల్లో కూడా వారు నిర్మించిన ఆలయాల వర్ణన చాలా విశేషంగా ఉన్నది.
– భిన్నూరి మనోహరి