‘తెలంగాణం తెలుగు తల్లి అందాల కొప్పు, ఆ తల్లి తన కొప్పులో ముద్దుగా ముడుచుకున్న ఒక మల్లె మన భార్గవుడ’ని ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మచే ప్రశంసలందుకున్న సిరిప్రెగడ భార్గవరావు నల్గొండ జిల్లా చండూరు మండలంలోని గుండ్రెపల్లెలో 1923లో జన్మించారు. లక్ష్మణ రావు, రుక్కమ్మ దంపతులకు జన్మించారు. సిరిప్రెగడ రచించిన భార్గవానంద లహరి ఖండకావ్యం ప్రముఖ కవుల ప్రశంసలనందుకున్నది. ఇది పన్నీరు, కన్నీరు, మున్నీరు అనే మూడు పాయలుగా ప్రవహిస్తుంది. ఈ కావ్యంలోని కన్నీరును చదివిన పాఠకులెవరూ కన్నీళ్లు కార్చకుండా ఉండలేరు. అందుకు కారణం తాను ఎంతగానో ప్రేమించిన తన భార్య అకాలమృతితో భార్గవుడు పొందిన హృదయవేదన పద్యరూపాన్ని సంతరించుకోవడమే.
ఈ రచనను చదివిన కరుణశ్రీ జంద్యాల పాపయ్య శాస్త్రి ‘భార్గవానంద లహరి సహృదయ హృద్యంగమైన ఖండ కావ్య సముచ్ఛయం’ అని పేర్కొన్నారు. ఇక ఈ కావ్యాన్ని పరిశీలించిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘పాపమాయిన గతాయువట! పరమేశ్వరుడే పువ్వునెప్పుడెందుకు త్రుంచుకొని పోతాడో యెవరికి తెలియును’ అంటూ సంతాపం వెలిబుచ్చాడు. జలసూత్రం రుక్మిణి నాథ శాస్త్రి భార్గవానంద లహరిని చూసి, చదివి నా మనసు నీరయినది’ అని పేర్కొన్నారు. ఈ కావ్యంలోని కొన్ని పద్యాలు 1970 డిగ్రీ పాఠ్య పుస్తకంలో చోటుచేసుకున్నాయి. తర్వాతి కాలంలో ఓయూ పీజీ సిలబస్‌లో కూడా చేరాయి.
తన కవితా వ్యాసంగంతో పలువురు సాహిత్యాభిమానుల గుండెల్లో ఆయన స్థానం సంపాదించుకోగలిగినా, తెలంగాణ జన బాహుళ్యానికి ఆయన ఒక అజ్ఞాత కవిగానే మిగిలిపోయాడు. అందుకు కారణం ఆయన ఎన్నడూ పేరు కోసం పాకులాడకపోవడమే.
ప్రకృతి జీవించడంతోనే పరవశించే వాడాయన. పల్లెలు ఆయనకు ప్రాణపదం. ఆయన ప్రతిభా పాటవాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి పట్నవాసం దోహదపడుతుందని అందువల్ల పల్లె విడిచి పట్నం రమ్మని ఆయన స్నేహితులు, పలుమార్లు కోరినప్పటికీ, ఆయన పల్లె విడిచి పట్నం పోలేదు అంతేకాదు..
‘పల్లెలు మా నివాసములు పచ్చని పంట పొలాలు మా మనః
పుల్లత గూర్చు చైత్రములు బోదెలపైని
రసాలశాఖికా
పల్లవుముల్ గ్రసించు చిరుపాటల దీయని
తేనె తేటలన్
జల్లు పికంబు మా యనుగు చెల్లెలు గానమె మాదు ప్రాణమౌ’ అని చెప్తూ చివరి శ్వాస వరకు ప్రకృతారాధకుడిగా జీవించాడు. తెనుగు భాష తీయందనాలతో పరవశించిన ఆయన హృదయం తెనుగు సాహిత్య నందనవనంలో ఎన్నో పరిమళ పుష్పాలని వికసింపజేసింది. వాటిలో ఒకటి…
‘కనిపించు నొకసారి కవి సార్వభౌమ రత్న స్వర్ణమకుట శృంగార కాంతి
చెవిసోకు నొకసారి కవితాపితామహు గండపెండేరంబు కలరుతంబు
పులకింతు నొకసారి తులకించు భావాలు సలిపెడి మువ్వంపు చక్కిళులకు
గమకింతు నొకసారి కలితరసోపేత పద్యంపు టనవద్య హృద్యధార
అమ్మా అమ్మా యటంచు నోరార నిన్ను
బిలువజేసిన నా పుణ్య ఫలమునెంచి
సంతసింతును విరిదండ సంతరింతు
లలితగుణ కల్పవల్లి మా తెలుగు తల్లి’ అంటూ తెలుగు తల్లి వైభవాన్ని కీర్తించాడు.
దాశరథికి సిరిప్రెగడ సన్నిహితుడు. దాశరథితో కలిసి ఎన్నో పద్యాలను రచించాడు. అంతేకాదు, ప్రధానసభ్యుడిగా చండూరు ‘సాహితిమేఖల’ సంస్థ స్థాపనలో ఎంతో కృషిచేశారు. అంబటిపూడి వెంకటరత్న మహాకవికి ప్రియమైన శిష్యుడు. వెంకటరత్నం వద్ద సంస్కృతాంధ్ర కావ్యాలను అభ్యసించిన సిరిప్రెగడ పద్య రచనలో ప్రావీణ్యం సాధించి పండిత జనరంజకాలైన పద్యాలనెన్నింటినో రచించాడు. అయితే భార్గవరావు సాహిత్యానికి మాత్రమే పరిమితం కాలేదు. దాశరథి ప్రభావంతో స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో ఒక దేశ భక్తుడిగా తన పాత్ర నిర్వహిస్తూ, సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు నిజాం పాలనలో ఏడాది పాటు కఠిన కారాగార శిక్షను అనుభవించారాయన. జైలు జీవితం ఆయన ఆరోగ్యాన్ని క్షీణింపజేసింది. అయినా ఆయన రచనా వ్యాసంగం ఆగలేదు.
సిరిప్రెగడ భార్గవుడి సాహిత్య గొప్పదనాన్ని గుర్తించిన ఆయన గురువు అంబటిపూడి వెంకటరత్నం భార్గవుణ్ణి ఎంతగానో ప్రోత్సహించారు. తన రచనలన్నీ ఒక నోట్‌బుక్‌లో భద్రపరచమని భార్గవుడికి చెప్పేవాడు. అయినా కేవలం చిత్తు కాగితాల మీదనే పద్యాలని రాసేవాడు సిరిప్రెగడ. కాకపోతే వాటన్నింటినీ ఒక ట్రంకు పెట్టెలో పడేశాడు.
1963లో సిరిప్రెగడ మరణించిన తర్వాత, కుటుంబసభ్యుల సహకారంతో భార్గవుడి ట్రంకుపెట్టెను వెంకటరత్నం తెరిపించి చూడగా అద్భుతమైన సాహిత్యం వెలుగులోకి వచ్చింది. అంబటిపూడి కృషితో ‘సాహితీమేఖల’ సంస్థ సిరిప్రెగడ రచనలను 1967లో భార్గవానంద లహరి పేరుతో ముద్రించింది. ఇందులో మొత్తం 277 పద్యాలున్నాయి. ఇవి 30 ఖండికలుగా విభజించబడ్డాయి. శిష్యుడు సిరిప్రెగడ ప్రతిభను గుర్తించి, ఆయన కావ్యాన్ని తెలుగు సాహిత్య లోకానికి గురువు అంబటిపూడి అందించకపోయి ఉంటే ఒక మహాకావ్యం చిత్తుకాగితాలతో కలిసి మరుగునపడిపోయేదే. అంబటిపూడి కృషికి తెనుగు సాహిత్య సాహితీలోకం ఎంతో రుణపడి ఉన్నది.
-బసవరాజు నరేందర్‌రావు
99085 16549