ఇటాలియన్ ఫ్యాషన్ దిగ్గజం ప్రాడాకు వేరొకరి నమూనాలను కాపీ కొట్టడం తప్పని తెలియదనుకోలేం. సౌందర్య ఉపకరణాలు, బ్యాగులు, పాదరక్షలకు సంబంధించి దాని జేబులో 369 పేటెంట్లు ఉన్నాయి. అందులో 269 ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రత్యేకంగా ఇలాంటి వస్తువుల రూపకల్పన, నిర్మాణానికి సంబంధించినవే. బూట్ల నమూనాలు, డిజైన్లు కూడా అందులో భాగమే. అందులో ఏ ఒక్క దానిని ఇతరులు కాపీ కొట్టినా కోర్టుకు ఈడ్చి పరిహారం రాబడుతుంది. కానీ, ఇప్పుడు ఈ బిలియన్ డాలర్ల బహుళజాతి సంస్థ మన దేశంలోని సుప్రసిద్ధ కొల్హాపురి చెప్పుల నమూనాను దొంగిలించి అడ్డంగా దొరికిపోవడం చిత్రాతి చిత్రం. కొల్హాపురి చెప్పులు సున్నితమైన నగిషీలు, అల్లికలు, రంధ్రాలు, గోండాలతో ప్రత్యేకమైన డిజైన్‌తో ఆకట్టుకుంటాయి. సంప్రదాయిక, ఆధునిక దుస్తులు రెండింటికీ నప్పడంతో వీటికి దేశ, విదేశాల్లో డిమాండ్ బాగా ఉంది. ఈ డిమాండ్‌ను ప్రాడా క్యాష్ చేసుకోవాలని చూసింది. ప్రాడా సాండల్స్ పేరిట అమ్ముతున్న కొల్హాపురి కాపీల ధర సుమారు లక్ష రూపాయలు కాగా, అసలైన కొల్హాపురి చెప్పులను మన దేశంలో సుమారు వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాడా వార్షిక ఆదాయం 2024లో 48,400 కోట్ల డాలర్లు, అంటే మన కరెన్సీలో రూ.41 లక్షల కోట్లకు పైగా ఉండటంలో వింతేముంది?
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లోని కొన్ని జిల్లాలోని చర్మకారులు తరతరాలుగా వీటిని తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. కానీ, సమస్య ఏమిటంటే వీటిపై వారికి ఎలాంటి పేటెంటు లేదు. 2019లో భౌగోళిక సూచిక (జీఐ ట్యాగ్) కొల్హాపురి చెప్పులకు లభించింది. ఈ చెప్పుల విశిష్టమైన డిజైన్‌ను కొంచెం అటూఇటూ చేసి ప్రాడా మార్కెట్ చేస్తున్నది. ఇటీవల జరిగిన ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఈ డిజైన్‌ను ప్రదర్శించడంతో దుమారం చెలరేగింది. వాటి మూలం ఇండియాలో ఉన్నదని గాని, వాటిని కొల్హాపురి చెప్పులు అంటారని గాని ప్రాడా వెల్లడించకపోవడం సరికాదని ఫ్యాషన్ నిపుణులు అంటున్నారు. ప్రాడా చర్యపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపీ కొట్టకూడదనే వ్యాపార నీతి ఎదుటివారికే తప్ప తనకు కాదని ప్రాడా అనుకుంటున్నదా?
మహారాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ చాంబర్ అధికారికంగా నిరసన తెలిపిన తర్వాత ప్రాడా ఈ నమూనాల మూలాలు ఇండియాలో ఉన్నాయని, శతాబ్దాలుగా భారతీయ చర్మకారులు వీటిని తయారు చేస్తున్నారని ఓ మొక్కుబడి వివరణ అయితే ఇచ్చింది. కానీ, దాంతో వివాదం చల్లారలేదు. ఫ్యాషన్, సినీ రంగ ప్రముఖులు సోషల్ మీడియాలో ప్రాడాపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో నమూనాపై యాజమాన్యం ఎవరిదనేది కీలక అంశంగా ఉండటమే అందుకు కారణం. ఈ కారణంగా వివాదాలు కోర్టుల దాకా వెళ్తాయి. బిర్కెన్స్టాక్స్ అనే జర్మనీ కంపెనీ తాను తయారు చేసే బూట్ల నమూనాను ఇండియాలో కాపీ కొట్టారంటూ ఢిల్లీ హైకోర్టులో వేసిన కేసు ఇందుకు ఓ ఉదాహరణ. ఈ కేసు పర్యవసానంగా ఢిల్లీ, ఆగ్రాల్లోని పాదరక్షల తయారీదారులు సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రాడా వ్యవహారంలో సీన్ రివర్స్ అయింది. ఓ బహుళజాతి సంస్థ బక్కపేదోళ్ల డిజైన్‌ను కాపీ కొట్టి దర్జాగా ఫ్యాషన్ షోలో పెట్టింది. కాపీరాయుళ్ల వేటకు బిర్కెన్ స్టాక్స్ బయల్దేరితే, ప్రాడా మాత్రం తనే కాపీ కొట్టి వివాదాల సుడిలో చిక్కుకున్నది. అదీ తేడా.
నష్టనివారణ చర్యల్లో భాగంగా భారతీయ కార్మికుల సేవలనూ వినియోగించుకుంటామని ప్రాడా ప్రకటించడం కొంత ఊరటనిస్తున్నది. మన దేశంలో వందలు, వేల సంప్రదాయిక డిజైన్లు పేటెంట్లు లేక, రక్షణ లేక ఎంత దారుణమైన దోపిడీకి గురవుతున్నాయో ఈ ఉదంతం తెలియజేస్తున్నది. తరతరాలుగా వృత్తులను నమ్ముకున్నవారు పరిహారం పొందే పరిస్థితులు అంతగా లేవు. పేటెంట్లు, లైసెన్సుల వంటివాటి విషయంలో ఓ పద్ధతి అంటూ లేకపోవడం వల్లే ఇలా జరుగుతున్నది. గ్లోబల్ మార్కెట్ కమ్మేస్తున్న ప్రస్తుత తరుణంలో స్థానిక, సంప్రదాయిక నమూనాలు, తయారీ పద్ధతులపై పేటెంట్లు పొందడం ఎంతైనా అవసరం. ఇప్పటికైనా మేల్కోనకపోతే మన సాంస్కృతిక విశిష్టతలు, మన వృత్తి కళాకారుల ప్రయోజనాలు మార్కెట్ ప్రభంజనంలో కొట్టుకుపోయే ప్రమాదముంది.