ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం దేశ రాజకీయాల వైపు అడుగిడటం ఒక చరిత్రాత్మక సందర్భం. తెలంగాణ రాష్ట్రం సాకారం అవుతుందని నాడు ఎవరూ ఊహించలేదు ఒక్క కేసీఆర్ తప్ప.
నేడు కూడా దేశంలో నెలకొన్న పరిస్థితులను, సమస్యలను దూరం చేయటం సాధ్యమేనా అన్న నిరాశ నెలకొన్నది. కేసీఆర్ మరోసారి మహత్తర బాధ్యతలను చేబూని దేశం కోసం, ప్రజల కోసం బయల్దేరుతున్నారు. రాష్ట్ర సాధనే లక్ష్యంగా సాగించిన ఒంటరిపోరులో ముఖ్యమంత్రి కేసీఆర్ నమోదు చేసిన విజయాలు దేశ రాజకీయాలలో అనేక సంచలనాలు సృష్టించాయి. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న విద్యుత్ సమస్య ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యానికి పురుడు పోసిందని చెప్పవచ్చు. అదే సమస్య పెను ఉద్యమంగా మారింది.
హైదరాబాద్ నడిబొడ్డున బషీర్‌బాగ్ చౌరస్తాలో నలుగురు ఉద్యమకారులను నాటి చంద్రబాబు ప్రభుత్వం పొట్టన పెట్టుకోవడంతో నిరసన జ్వాలలు పెల్లుబికాయి. ఆ నేపథ్యంలోంచే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి అడుగులు పడ్డాయి. నాడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్.. బషీర్‌బాగ్ కాల్పుల ఉదంతాన్ని పేర్కొంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చుట్టిందన్నది నిర్వివాదాంశం.
రాష్ట్ర సాధన కోసం ఒంటరిగా కేసీఆర్ ఒక్కడే బయలుదేరిన రోజున ఎకసెక్కాలు, వెటకారాలు చేసిన నోళ్లే తదనంతరకాలంలో.. కేసీఆర్ తలుచుకుంటే ఆయనకు సాధ్యం కానిదేముంది అనే దాకా తీసుకురావడం మాటలు కాదు. నేటి రాజకీయాలలో అది మామూలు విషయం కాదు. తెలంగాణ ఇవ్వాల్సిన నాటి కేంద్రప్రభుత్వం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేయాలని చూసినా వారి వలలో చిక్కుకోకుండా వారినే తన ఉచ్చులో బంధించి రాష్ర్టాన్ని సాధించిన వ్యూహకర్త కేసీఆర్. దేశ రాజకీయ చిత్రపటంలో నమోదు అయిన పార్టీలన్నింటితో తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాయించడమే కాకుండా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని భీష్మించుకుని కూర్చున్న వైరి వర్గాలు అటు చంద్రబాబు ఇటు జగన్‌లతోనూ అనుకూలంగా లేఖలు వచ్చేలా చేసిన చాణక్యుడు కేసీఆర్. బయటకు తెలియని మహత్మ్యం ఏదో ఆయనలో ఉందని అనక తప్పదు ఈ పరిణామాలన్నీ చూస్తే.
వచ్చిన తెలంగాణను సీమాంధ్ర శక్తులు గారడి చేస్తూ గడబిడ చేస్తూ వెనక్కి పోయేలా కేంద్రంతో ప్రకటన ఇప్పించి, శ్రీకృష్ణ కమిషన్ వేయించినా కేసీఆర్ వెనుకంజ వేయలేదు. అది కృష్ణ మాయో… చంద్రశేఖర మాయో తెలియదు కానీ అంతిమంగా మాత్రం ఆరు దశబ్దాల తెలంగాణ ప్రజల సంకల్పం నెరవేరింది అంటే అది ముమ్మాటికీ కేసీఆర్ ప్రతిభా పాఠవాలు తప్ప మరోటి కాదు. చావు నోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా వచ్చిన రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి, అప్రతిహత విజయాలు నమోదు చేశారు కేసీఆర్. ఇప్పుడు దేశ రాజకీయాల వైపు మళ్లడం ద్వారా మరోసారి ఆయన కేంద్రబిందువు అయ్యారు.
దేశ రాజకీయాల వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నప్పుడు కూడా గులాబీ దండు అదే విశ్వసనీయతతో ఆయన వెంట అడుగులు వేసేందుకు ఉద్యుక్తులవుతున్నది. కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే.. దేశ రాజకీయాల్లో ఆయన తీసుకురాదలచిన గుణాత్మక మార్పు కూడా ఎంతో దూరంలో లేదని నిస్సందేహంగా చెప్పుకోవొచ్చు. యాదృచ్ఛికమే అయినప్పటికీ, నాడు ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు సమస్యలతో తెలంగాణ రైతాంగం చిక్కిశల్యమై ఆత్మహత్యలకు పాల్పడిన అంశం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మూలంగా మారితే, ప్రస్తుతం కేంద్రం విద్యుత్ సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు కేసీఆర్. తెలంగాణలో ఎవరూ ఊహించని విజయాలు సాధించినట్లుగానే దేశంలోనూ ఆయన మహత్తర విజయాలు సాధిస్తారు.
– ఒంటెద్దు నరసింహారెడ్డి, 80080 02927
(వ్యాసకర్త: డైరెక్టర్, ఉన్నత విద్యామండలి)