కేసీఆర్…. తెలంగాణ పోరాట యోధుడు మీరే.. తెలంగాణ రాష్ట్ర ఏరు మీరే.. తెలంగాణకు ఉద్యమ ఊపిరి మీరే.. తెలంగాణ మాగాణంకు జలధార మీరే.. నాగలి ఎత్తుకున్న రైతుబంధువు మీరే.. విద్యుత్తు కోటికాంతుల తెలంగాణ వెలుగు మీరే.. తెలంగాణ చరిత్రలో చెరగని సంతకం మీరే…
తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిన నాయకుడు కేసీఆర్. పరాయి పాలనలో తెలంగాణ అస్తిత్వం వివక్షకు గురై అరిగోస పడుతుంటే.. పాలకుల మోసపూరిత కుట్రలతో తెలంగాణ భాష, యాస, సంస్కృతి హేళనకు గురవుతుంటే.. నీళ్లు, నిధులు, నియామకాలు తరలించుకుపోతుంటే.. జూలు విదిల్చిన సింహంలా కదనరంగంలోకి దిగి తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేశారు కేసీఆర్. పదవులను తృణప్రాయంగా వదిలి తెలంగాణే ప్రాణంగా ఉద్యమానికి ఊపిరులూదారు.
నాడు ఆంధ్రా పాలకుల పెత్తనంలో తెలంగాణ బిడ్డలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వచ్చింది. మన నీళ్లు, నిధు లు, నియామకాలు అన్నీ వారికే. ఆఖరికి మన అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కూడా హేళన చేశారు. అరవై ఏండ్ల పాటు అరిగోస పడ్డం. ఆత్మహత్యలు, ఆకలి చావులు నిత్యకృత్యమయ్యాయి. తెలంగాణ జీవం పోయేటట్టున్న సమయంలో మలిదశ ఉద్యమ పతాక ఎగురవేశారు కేసీఆర్. దగాపడిన తెలంగాణను దరికి చేర్చేందుకు జలదృశ్యంలో గులాబీ జెం డాకు పురుడుపోశారు. పద్నాలుగేండ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి అమరుల త్యాగం సాక్షిగా సంకల్ప దీక్ష చేసి స్వరాష్ట్రం సాధించారు. ఉద్యమ నేత కేసీఆరే తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు పెట్టాయి. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కేసీఆర్ నిలబెట్టారు. మొత్తంగా తెలంగాణకు ప్రాణం పోశారు.
‘ఎట్లుండె తెలంగాణ.. ఎట్ల అయిపోయింది’. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చరిత్రను చెరిపేసేందుకు కుట్రలు పన్నుతున్నది. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడిచేస్తూ అమరులను అవమానిస్తూ కుట్రల రాజకీయం చేస్తున్నది. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేసి అస్తిత్వ పునాదులను పాలకులు పెకిలిస్తున్నారు. అంతేకాదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెట్టారు. మన ఆత్మ గౌరవాన్ని దెబ్బకొడుతూ పైశాచికానందాన్ని పొందుతున్న సీఎం రేవంత్‌రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు. అమ్మను ఆటబొమ్మగా మార్చడం, తెలంగాణ తల్లి రూపా న్ని కాంగ్రెస్ తల్లిలా మార్చడాన్ని చరిత్ర ఎప్పటికీ క్షమించదు. బతుకమ్మను తొలగించడం హేయం.
ఈ సృష్టిలో మనం అమ్మను తొలి దేవతగా భావిస్తాం. అమ్మ లేనిదే సృష్టి లేదు. మన అమ్మలకే అమ్మ తెలంగాణ తల్లి. ఆ అమ్మనే మార్చేస్తున్న పాలకులను ఏమనాలి? ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోవడం తథ్యం. ఉద్యమంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో ముందుండి నడిచిన కేసీఆర్ ఇప్పుడు మరో ఉద్యమం చేసే అవకాశాన్ని మనకు ఇచ్చా రు. కేసీఆర్ వెంట మరోసారి నడుద్దాం. తెలంగాణ వ్యతిరేక సర్కార్‌ను గద్దె దింపుదాం. మన అస్తిత్వాన్ని చాటుకుందాం.
అరువై ఏండ్ల యుద్ధంలో
ఉదయించిన ఉద్యమ సూర్యుడు..
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పోరాట యోధుడు..
తెలంగాణ జాతి పిత..
బంగారు తెలంగాణ నిర్మాత..
అరువై ఏండ్ల దోపిడీదారులను ఉగ్ర నరసింహ అవతార పురుషుడై అంతమొందించిన సూర్యుడు..
తెలంగాణను హింస పెట్టి ధ్వంసరచన చేసినవారిపై
ఉక్కుపాదం మోపి ఆమరణ దీక్ష బూని..
అమరుల త్యాగం నిలిపి తెలంగాణ రాష్ట్రం
సాధించిన ధీరుడు..
అంబేద్కర్ స్ఫూర్తితో
ఆశయసాధన నెరవేర్చిన
ఉక్కు సంకల్పం కేసీఆర్‌ది.
కాళేశ్వరం నీళ్లు తెచ్చి
బీడు భూములను సస్యశ్యామలం చేసిన
జల ప్రదాత, భగీరథుడు..
తొలి ముఖ్యమంత్రిగా
తెలంగాణ ఉక్కు కవచమై నిలిచిందీ కేసీఆర్..
నాలుగు కోట్ల ప్రజల కంటివెలుగు కేసీఆర్..
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కేసీఆర్..
కోట్లాది గుండెల్లో ఆశాజ్యోతి కేసీఆర్..
తెలంగాణకు మీరే శ్రీరామరక్ష కేసీఆర్..
మళ్లీ మరో ఉద్యమానికి వెలుగు మీరే కేసీఆర్…
– చిటుకుల మైసారెడ్డి 94905 24724