భారతదేశ సామాజిక చరిత్రలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు ఒక మహత్తరమైన అధ్యాయం. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కులు అనే విలువల కోసం ఆయన జీవితాంతం పోరాడారు. పేదరికం, అంటరానితనంతో బలైపోతున్న దళిత సామాజిక వర్గాల కోసం సంస్కరణపూర్వక సంక్షేమ విధానాలకు, స్వాభిమాన ఆర్థిక సాధికారతకు మార్గాన్ని నిర్మించారు. అణగారిన వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత కల్పించాలన్న అంబేద్కర్ ఆలోచనలోనను ఆచరణలో అమలు పరిచిన రాజనీతిజ్ఞుడు, పరిపాలనా దక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. దళితుల అభ్యున్నతికి, సామాజికార్థిక పరివర్తనకు ఆయన మారుపేరుగా నిలిచారు. అంబేద్కర్ ఆశయ సాధకుడు కేసీఆర్ అని దళిత జాతి గర్వంగా చెప్పుకుంటున్నది. కాంగ్రెస్ పాలనలో దళితులకు జరుగుతున్న దగా, అంబేద్కర్‌ను గౌరవించని పాలకులను చూసి తెలంగాణ సమాజం తల్లడిల్లుతున్నది.
తెలంగాణ రాజకీయ చరిత్రలో ప్రత్యేక రాష్ట్ర సాధన అనేది సువర్ణాక్షరాలతో లిఖించచదగిన ప్రత్యేక అధ్యాయం. మహత్తర పోరాటాన్ని నడిపించిన నాయకుడు కేసీఆర్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని, శాంతియుత మార్గంలోనే స్వరాష్ర్టాన్ని సాధించుకోవాలని విశ్వసించారు. ప్రజలకు మార్గదర్శనం చేశారు. రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారు. స్వచ్ఛమైన పాలనను అందించారు. సబ్బండ జాతులను కడుపులో పెట్టుకుని దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపారు. కానీ, అబద్ధాలను ప్రచారం చేయడంలో ఆరితేరిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై అనేక తప్పుడు ఆరోపణలు చేసింది. ప్రజలను మభ్యపెట్టింది. అసత్యాల పునాదులపై అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది. నమ్మించి, నయవంచనకు గురిచేసే అబద్ధపు వాగ్దానాలను డిక్లరేషన్‌లో పేర్కొని దళితులను నిండా ముంచింది.
2023 ఎన్నికలకు ముందు చేవెళ్లలో కాంగ్రెస్ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో అనేక కీలక హామీలు ఇచ్చింది. ఎస్సీల రిజర్వేషన్లను 15 శాతం నుంచి 18 శాతానికి, ఎస్టీల రిజర్వేషన్లను 10 శాతం నుంచి 12 శాతానికి పెంచుతామని నమ్మబలికింది. దళిత, గిరిజన కుటుంబాల సాధికారత కోసం ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని, భూమిలేని కుటుంబాలకు భూమి, ఇల్లు లేని కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు, గురుకులాల విస్తరణ, ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు వంటి ఎన్నో హామీలను కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావొస్తున్నా హామీలు అమలు నోచుకోలేదు. వీటి గురించి ప్రజలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. చేవెళ్ల డిక్లరేషన్‌లో భూమిలేని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు భూమి అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇల్లు లేని కుటుంబాలకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షల సహాయం అందిస్తామని కూడా ప్రకటించింది. ఎస్సీలలోని మాల, మాదిగ వాటి ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం విద్యాజ్యోతుల పథకం కింద ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించింది. కానీ, ఇప్పటివరకు రూపాయి కూడా అందించలేదు. కార్పొరేషన్లు ఏర్పాటు చేయకపోగా, దళితులను చిన్నచూపు చూస్తున్నారు.
2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ర్టాభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉండాలనే సదుద్దేశంతో, దళిత వర్గాలను సముచితంగా ప్రోత్సహించారు. అంతేకాకుండా, రాజకీయంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులు, కాంట్రాక్ట్లపాటు అనేక సందర్భాలలో దళితులకు రిజర్వేషన్లు కల్పించి, వారి అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. అలాగే, గ్రామ స్థాయిలో కూడా దళితులకు రాజకీయంగా చాలా అవకాశాలు కల్పించారు. సమాజ అంచులకు నెట్టివేయబడ్డ సమూహాలకు చెందిన ప్రజల రాజకీయ ఎదుగుదలను ప్రోత్సహించిన మహానేత కేసీఆర్.
దళితుల సాధికారతకు ‘దళితబంధు’
అంబేద్కర్ దృష్టిలో సామాజిక విముక్తికి ఆర్థిక స్వావలంబన కూడా కీలకమైన అంశం. ఈ నేపథ్యంలో దళిత కుటుంబాలకు కేవలం సంక్షేమ ద్వారా సాయం మాత్రమే కాకుండా ఆదాయ వనరులు ఏర్పరచుకోవడానికి కేసీఆర్ అవకాశం కల్పించారు. దళితుల భాగస్వామ్యం లేనిది నిజమైన అభివృద్ధి కాదనే అభిప్రాయంలో నుంచి ఏర్పడ్డదే ‘దళితబంధు’. ఇంతటి మహత్తర సంస్కరణాత్మక పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చారు. దళిత కుటుంబాలు ఆర్థిక సాధికారత సాధించాలనే సదుద్దేశంతో అర్హత కలిగిన కుటుంబాలు ఆదాయాన్ని సృష్టించుకునే విధంగా రూ.10 లక్షల గ్రాంట్‌ను అందించే విధానాన్ని ప్రవేశపెట్టారు. దశలవారీగా అర్హులందరికీ వర్తింపచేసేలా పథకాన్ని రూపొందించారు. అంతేకాకుండా అనుకోని కారణాలతో వ్యాపారం దెబ్బతింటే దానికి ఇన్సూరెన్స్‌ను కూడా పథకంలో భాగం చేశారు. ఇంతటి నిబద్ధత కలిగిన నిజమైన దళితబంధువు కేసీఆర్.
విగ్రహాలు ఒక తరం నుంచి మరో తరానికి మహనీయుల ఆలోచనలను మోసుకెళ్తాయి. అనేక సమూహాలు ధైర్యంగా నిలిచే విధంగా తోడ్పడుతాయి. ఇంతటి నేపథ్యాన్ని ప్రజలవైపు నుంచి ఆలోచించారు గనుకనే హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. తెలంగాణలో అంబేద్కర్ స్మృతికి ఎన్నో విధాలుగా ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టడం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. అంబేద్కర్ ఆశయాలను సాధించడం కోసం కేసీఆర్ విశేషంగా కృషి చేశారు.
కేసీఆర్ పాలన కాలంలో విద్య, వైద్య, వ్యవసాయ, నీటిపారుదల, ఉపాధి రంగాలు అద్భుత ఫలితాలు సాధించాయి. గురుకులాలు, మెడికల్ కాలేజీలు, రైతు బంధు, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, దళితబంధు, గొర్రెల పంపిణీ, కల్యాణలక్ష్మీ/షాదీ ముబారక్ ఇలా ఎన్నో పథకాలను వివిధ వర్గాల సంక్షేమం కోసం చేపట్టిన ఘతన కేసీఆర్‌ది. రైతులు, పేదలు, మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూశారు. సబ్బండ ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేశారు. బహుజన తెలంగాణను తీర్చిదిద్దేలా కృషి చేశారు. నాడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనలో పెద్దన్నగా నిలిచారు. జనమంతా గుండెలపై చేతులు వేసుకొని నిశ్చింతగా ఉన్నారు.
కానీ, నేడు కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనతో అరాచకం సృష్టిస్తున్నది. పేదల సంక్షేమం, సాధికారత దెబ్బతిన్నాయి. కాంగ్రెస్ పాలనను నిలదీస్తారనే భయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి కూడా రాకుండా అడ్డుకుంటూ కాంగ్రెస్ దుర్మార్గాలకు పాల్పడుతున్నది, నియంతృత్వానికి దారులు తెరుస్తున్నది. ప్రతి సమూహంలో సామాజిక మార్పునకు ‘విద్య’ ప్రధాన ఆయుధంగా నిలుస్తుంది. ‘ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య, జ్ఞానం, అవకాశాలు అందరికీ సమానంగా అందాలి’ అని అంబేద్కర్ ప్రతిపాదించారు. ఇదే లక్ష్యంతో అంబేద్కర్ ఆలోచనను కేసీఆర్ అక్షరాలా ఆచరించి చూపారు. అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలను సాధించాలనే కృత నిశ్చయంతో పాలన సాగించి, విద్య విధానంలో విప్లవాత్మక మార్పులకు కేసిఆర్ శ్రీకారం చుట్టారు.
పేద, దళిత, వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. ముఖ్యంగా ఎస్సీ గురుకుల విద్యాసంస్థల విస్తరణకు పెద్దపీట వేసింది. పేద కుటుంబాల విద్యార్థులకు మెరుగైన వసతులతో కూడిన రెసిడెన్షియల్ విద్యను అందించింది. 2014-15లో 134 మాత్రమే ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంఖ్య 2022-23 నాటికి 268కి పెరిగింది. ఒక్కో విద్యార్థిపై ఏటా సుమారు రూ.1.25 లక్షల వరకు ఖర్చు చేస్తూ విద్య, వసతి, భోజనం వంటి సౌకర్యాలను అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది.
రాష్ట్రంలో అన్ని వర్గాలకు కలిపి వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేసింది. అంతేకాదు, పేద దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే కలను సాకారం చేసుకునేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి వంటి పథకాల ద్వారా 20 లక్షల ఆర్థిక సహాయం అందించే పథకాన్ని ప్రారంభించి దళిత విద్యార్థుల విదేశీ విద్యకు ప్రోత్సాహకాన్ని అందించారు. కేసీఆర్ హయాంలో గురుకుల విద్యార్థులు చదువుతోపాటు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే స్థాయిలో రాణించారు. వారిలో ఉండే ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు గురుకుల వ్యవస్థ దోహదపడింది. విద్యార్థులు సాధించిన విజయాలకు నిదర్శనంగా నిలిచింది. కేసీఆర్ హయాంలో కళకళలాడిన గురుకులాలు.. నేడు వెలవెలబోతున్నాయి.
కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల విద్యా వ్యవస్థపై సరైన సదుపాయాలు కల్పించకుండా తక్కువ వ్యవధిలోనే పలువురు గురుకుల కార్యదర్శులను మార్చడం, సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయకపోవడం వల్ల గురుకులాలు అధ్వానంగా మారాయి. అంతేకాకుండా, కలుషితమైన ఆహారం తిని వందలాది మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. పలువురు విద్యార్థులు పాముకాటుకు బలైపోయారు. ఇలాంటి ఘటనలు విద్యా వ్యవస్థలో ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యాశాఖను కూడా తన వద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి అసమర్థ పాలనకు, వైఫల్యాలే నిదర్శనాలు. మరోవైపు అంబేద్కర్ స్మృతి వనం గేట్లు మూసి వేయడం, రాజ్యాంగ నిర్మాతకు గౌరవం ఇవ్వకపోవడం వంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. దళితులను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న పాలన కేసీఆర్‌ది. దళిత వర్గాలకు అడుగడుగునా అన్యాయం, అవమానం చూపిస్తున్న పాలన కాంగ్రెస్‌ది. అట్టడుగు వర్గాల సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, అభ్యున్నతి వంటి అంశాలను తెలంగాణ రాజకీయాల్లో బలంగా ముందుకు తీసుకెళ్లిన నాయకుడిగా కేసీఆర్‌ను దళిత సమాజం గుర్తిస్తున్నది. మళ్లీ సారే రావాలని కోరుకుంటున్నది. తెలంగాణ ప్రజలకు మంచిరోజులు త్వరలోనే వస్తాయని నమ్ముతున్నది.
‘విద్య’ ప్రధాన ఆయుధంగా నిలుస్తుంది. ‘ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య, జ్ఞానం, అవకాశాలు అందరికీ సమానంగా అందాలి’ అని అంబేద్కర్ ప్రతిపాదించారు. ఇదే లక్ష్యంతో అంబేద్కర్ ఆలోచనను కేసీఆర్ అక్షరాలా ఆచరించి చూపారు. అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలను సాధించాలనే కృత నిశ్చయంతో పాలన సాగించి, విద్య విధానంలో విప్లవాత్మక మార్పులకు కేసిఆర్ శ్రీకారం చుట్టారు. పేద, దళిత, వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. కేసీఆర్ హయాంలో కళకళలాడిన గురుకులాలు.. నేడు వెలవెలబోతున్నాయి.
-డాక్టర్ ఆవాల హరిబాబు ,98495 38813