కేసీఆర్ ప్రగతి..రేవంత్ దోపిడీ
సమాజం పురోగమించాలన్నా, పతనమవ్వాలన్నా ఆ సమాజం ఎంచుకునే ఆర్థిక నమూనా అత్యంత ప్రాధాన్యత వహిస్తుందని ఆధునిక రాజకీయ ఆర్థిక శాస్త్రం విశ్లేషిస్తుంది.
సమాజం పురోగమించాలన్నా, పతనమవ్వాలన్నా ఆ సమాజం ఎంచుకునే ఆర్థిక నమూనా అత్యంత ప్రాధాన్యత వహిస్తుందని ఆధునిక రాజకీయ ఆర్థిక శాస్త్రం విశ్లేషిస్తుంది. వనరులను సృష్టించి వాటిని స్థిరమైన పద్ధతిలో విస్తరించే, వెల్ఫేర్ క్యాపిటలిస్ట్ ఆర్థిక వ్యవస్థ ఒకటైతే, ఉన్న వనరులను విలువ ఆధారిత మార్పిడి లేకుండా కేవలం అధికారం, వ్యవస్థల బలంతో నిలువునా పిండుకునే, ‘ప్లండర్ ఆర్థిక వ్యవస్థ’ రెండవది. ఈ రెండు నమూనాలూ విభిన్న రూపాల్లో ఉన్నప్పటికీ, సమాజ దీర్ఘకాలిక మనుగడకు, ప్రజల కొనుగోలు శక్తి వృద్ధికి సంపద సృష్టించే వెల్ఫేర్ క్యాపిటల్ ఎకానమీ ఎందుకు మెరుగైనదో ఆర్థికశాస్త్ర సిద్ధాంతాలు వివరిస్తున్నాయి.
క్యాపిటల్ వెల్ఫేర్ ఎకానమీకి పూర్తి విరుద్ధమైన నమూనా ఫ్యూడల్ ప్లండర్ ఎకానమీ. దీనికి చారిత్రక ఉదాహరణ; 16వ శతాబ్దంలో స్పానిష్ సామ్రాజ్యవాదులు అమెరికా ఖండాల్లో స్థానిక ప్రజలను బానిసలుగా మార్చి వెండి, బంగారాలను దోచుకెళ్లడం. ఆ దోపిడీ వల్ల స్థానికంగా ఆర్థిక ఆస్తుల సృష్టి జరుగలేదు. ఫలితంగా ఆయా ప్రాంతాలు శతాబ్దాల పాటు దరిద్రంలోకి జారుకున్నాయి. ఇదే తరహా ఆందోళన ప్రస్తుత తెలంగాణలో కూడా కనిపిస్తున్నది.
పాలమూరు జిల్లాలోని చెరువుల్లో ఉన్న నీళ్లను మోటర్లు పెట్టి ఎత్తి ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కును తరలించడం అనే ఆలోచన ప్రభుత్వ ‘దోపిడీ ఆర్థిక నమూనా’కు దర్పణం పట్టింది. నీళ్లు ఎత్తిపోయాల్సింది నదుల నుంచి చెరువులకు కదా? మరి చెరువుల్లో వానలకు జమ అయిన నీళ్లను ఎత్తుకపోవుడేంది? అంటే అదే రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న దోపిడీ నమూనా. సంక్షేమాన్ని అందించే ‘రిచ్ డాడ్’ ఆలోచనా దృక్పథం నుంచి కాకుండా, సంక్షోభాన్ని సృష్టించే ‘పూర్ డాడ్’ దృష్టి కోణంలో పాలన సాగిస్తే దాని పర్యవసానం ఏమిటో మరోసారి మనకు రేవంత్‌రెడ్డి పాలన రుజువుచేస్తున్నది. భూస్వామ్య పెత్తందారీతనానికి, రాచరిక వ్యవస్థకు మారుపేరుగా నిలిచిన నైజాం పాలన అనంతర కాలంలో తెలంగాణలో, రూమీటోపీ తీసేసి గాంధీటోపీని ధరించిన ఫ్యూడల్ నాయకత్వం పల్లెల్లో నడిపించిందంతా ప్లండర్ ఎకానమీ నమూనానే.
ప్రజల భూములు, ఆస్తులను దోచుకోవడమే తప్ప తెలంగాణ సబ్బండ కులవృత్తుల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టి ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ప్రయత్నం చేయలేదనేది ఈ చారిత్రక విమర్శలోని ప్రధానాంశం. అదే ఫ్యూడల్ ఆలోచనా ధోరణికి కొనసాగింపే నేటి రేవంత్‌రెడ్డి పాలన. చట్టబద్ధమైన పాలన, ఆస్తి హక్కుల భద్రతతోపాటే సంపద సృష్టించేవి ‘ఇంక్లూజివ్’ వ్యవస్థలైతే, కేవలం పాలకుల, కాంట్రాక్టర్ల స్వార్థం కోసం ప్రజల సొమ్మును వసూలు చేసేవి ‘ఎక్స్ట్రాక్టివ్’ వ్యవస్థలు. ప్లండర్ ఎకానమీ రాజ్యమేలే చోట ఎవరూ కొత్త ఆవిష్కరణలు చేయడానికి లేదా కష్టపడి పనిచేయడానికి ఇష్టపడరు. తమ సంపద ఏ క్షణంలోనైనా అధికారం ద్వారా జప్తునకు గురికావచ్చనే భయం వారిని వెంటాడుతుంది. సరిగ్గా తెలంగాణలో అదే జరుగుతున్నది. తమ ఆస్తులు, పెట్టుబడులకు రక్షణ, భద్రత లేవనే ఆత్మన్యూనతకు వినియోగదారులైన సామాన్యులు, పెట్టుబడిదారులైన కార్పొరేట్ సమాజం రెండూ గురయ్యాయి.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తొమ్మిదిన్నరేండ్ల పాలనను ఈ సిద్ధాంతాల పరంగా విశ్లేషిస్తే, అది వెల్ఫేర్ క్యాపిటలిజానికి నిదర్శనంగా నిలుస్తుంది. హైదరాబాద్ నగరంలో ఐటీ, ఫార్మా రంగాలు కేసీఆర్ కాలంలో విస్తరించాయి. టీఎస్ ఐపాస్ వంటి సింగిల్ విండో పారిశ్రామిక విధానాలు పెట్టుబడిదారులకు నమ్మకాన్ని ఇచ్చి, పెట్టుబడులను రాష్ర్టానికి రప్పించాయి. ఇది క్యాపిటలిస్ట్ సంపద సృష్టి.
అయితే కేసీఆర్ దార్శనికత కేవలం నగరాలకే పరిమితం కాలేదు. పల్లెల్లోని విలేజ్ ఎకానమీ పుంజుకుంటేనే సమాజం సుస్థిరంగా ఉంటుందని ఆయన భావించారు. సంప్రదాయ కులవృత్తులను పారిశ్రామిక శక్తులుగా మార్చే వ్యూహాన్ని అమలు చేశారు. అటు వ్యవసాయ రంగాన్ని, ఇటు వ్యవసాయం మీద ఆధారపడిన కులవృత్తులను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేశారు. అనేక పథకాల ద్వారా పల్లె ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించారు. ఆర్థిక శాస్త్రంలో మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనే కీలకమైన సూత్రం ఉన్నది. ఆ సూత్రానికి కేసీఆర్ అనుస రించిన విధానాలే ఆచరణ.
రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, ఆసరా పెన్షన్లు, కులవృత్తులకు ఆర్థిక ప్యాకేజీలు అందించడం వల్ల గ్రామీణ సమాజంలో కొనుగోలు శక్తి పెరిగింది. దీనినే స్పిన్నింగ్ ఎకానమీ అంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా పెరిగిన నీటిపారుదల సౌకర్యాలు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చ డం వల్ల గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తిలో తెలంగాణ గణనీయమైన పురోగతి సాధించింది. నగరాల నుంచి వచ్చిన పారిశ్రామిక ఆదాయాన్ని పల్లెల పునాదులను బలోపేతం చేయడానికి వాడటమే కేసీఆర్ వెల్ఫేర్ క్యాపిటలిస్టు నమూనా. కేసీఆర్ పంచింది కేవలం ఉచిత పథకాలు కాదు. ఒక నిర్దిష్టమైన పథకం ప్రకారమే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, విస్తరింపజేసే ప్రయత్నం చేశారు.
కేసీఆర్ అనుసరించిన వెల్ఫేర్ ఎకానమీకి పూర్తి అపసవ్య దిశలో రేవంత్ నాయకత్వంలోని కాంగ్రె స్ పరిపాలన సాగుతున్నది. మొదటిది; పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి ఆస్తి హక్కుల భద్రతను ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రా కూల్చివేతల విధానం తీవ్రంగా దెబ్బతీసిం ది. చట్టబద్ధమైన ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు రుణా లు ఉన్న నిర్మాణాలను సైతం కూల్చివేయడం వల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం సడలిపోయింది. ఫలితంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం మందగించింది.
రెండవది; గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయడం. గతంలో కులవృత్తులకు అండగా నిలిచిన సాగునీరు, విద్యుత్తు, పంట పెట్టుబడి సాయంతో పాటు సబ్బండ కులాలకు అందించే పథకాలకు నిధులు నిలిపివేయడం వల్ల పల్లెల్లో నగదు చలామణి తగ్గిపోయింది. రైతులకు అందుతున్న పెట్టుబడి సాయంపై రకరకాల ఆంక్షలు విధించడం, ఉత్పాదక ఆస్తులైన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణను నిర్లక్ష్యం చేయడం వల్ల గ్రామీణ ఉత్పాదకత దెబ్బతిన్నది. ఎల్ నినో వంటి కారణాలను ప్రస్తావిస్తూ పంటల సాగు నిలిపివేయాల్సిన పరిస్థితులు, క్రాప్ హాలిడేల ప్రకటనలు రావడం వ్యవసాయ రంగంలో నెలకొన్న స్తబ్ధతకు అద్దం పడుతున్నాయి. రైతుకు నీరు, విద్యుత్తు, పెట్టుబడి భరోసా అందించాల్సిన సమయంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచే వ్యవస్థలే బలహీనపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మూడవది; రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్. ప్రజా సంక్షేమ గ్యారెంటీలకు నిధులు లేవని చెప్తున్న ప్రభుత్వం, లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులను పంతానికి పోయి నడిపించాలని అనుకుంటున్నది.
ఈ ప్రాజెక్టులు ప్రజోపయోగ ఆస్తులను సృష్టించే విధానాలా, లేదా కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు నిధులు మళ్లించే నమూనాలా అనేది పరిశీలించాల్సిన అంశం. భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెంచడం, పన్నుల భారం మోపడం ద్వారా ప్రజల నుంచి ధనాన్ని లాక్కోవడం జరుగుతున్నదే తప్ప, కొత్త సంపద సృష్టి జరగడం లేదు. అప్పుల ద్వారా పదింతలుగా సృష్టించుకున్న ఆదాయాన్ని, దాని కొనసాగింపునకు అవసరమైన ప్రగతి మార్గాన్ని, కక్షపూరిత రాజకీయాలు, తప్పుడు విధానాల ద్వారా మూసేసుకోవడమే అసలు సమస్య. ఇదే ప్లండర్ ఎకానమీ ముఖ్య లక్షణం.
ఉత్పాదక ప్రాజెక్టుల ద్వారా ఆదాయం, ఉపాధి, మార్కెట్ విస్తరణ సాధ్యమైతే అప్పు కూడా అభివృద్ధికి సాధనమవుతుంది. కానీ కొత్త ఆదాయాన్ని సృష్టించకుండా ఉన్న వనరులను ఖర్చు చేయడం, ప్రజలపై భారాలు మోపడం మాత్రమే జరిగితే అది భవిష్యత్తు తరాలకు ఆర్థిక భారంగా మారుతుంది. దాదాపు మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో అదే జరిగింది. తెలంగాణ తన సుస్థిర అభివృద్ధిని, పూర్వ వైభవాన్ని మళ్లీ సాధించాలంటే తక్షణమే ఈ దోపిడీ నమూనా నుంచి బయటపడి, ఉత్పాదక, సంక్షేమ ఆధారిత ఆర్థిక నమూనా వైపు మళ్లాలి. తెలంగాణ ప్రగతి దార్శనికత కలిగిన కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి పాలన కొనసాగించడం ద్వారా మాత్రమే సంక్షేమ ఆర్థిక నమూనా అమలు సాధ్యం. తద్వారా మాత్రమే తెలంగాణ ప్రగతి మళ్లీ పట్టాలు ఎక్కుతుంది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-రమేశ్ హజారి
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

