ప్రపంచవ్యాప్తంగా మైక్రోస్టాప్!
ఆసియా నుంచి అమెరికా వరకు అవుట్‌లుక్, టీమ్స్ వంటి సేవలకు సంబంధించిన మైక్రోసాఫ్ట్ అంతరాయం గంటల తరబడి కొనసాగి లక్షలాది మంది వినియోగదారులను, కంపెనీలను, కొన్ని ప్రభుత్వ కార్యకలాపాలను ప్రభావితం చేసింది.
- నిలిచిపోయిన అవుట్‌లుక్, టీమ్స్ సేవలు
- వినియోగదారులకు అందుబాటులో లేని ఈమెయిల్, వర్క్ యాప్స్
- ప్రభుత్వాలు, కంపెనీలు, విమానయాన సంస్థల సేవలపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ, నవంబర్ 13: ఆసియా నుంచి అమెరికా వరకు అవుట్‌లుక్, టీమ్స్ వంటి సేవలకు సంబంధించిన మైక్రోసాఫ్ట్ అంతరాయం గంటల తరబడి కొనసాగి లక్షలాది మంది వినియోగదారులను, కంపెనీలను, కొన్ని ప్రభుత్వ కార్యకలాపాలను ప్రభావితం చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. సంస్థ సేవలకు అంతరాయం కలగడంతో ఈమెయిల్స్, ఇతర కార్యాలయ అప్లికేషన్లను యాక్సెస్ చేయడానికి వ్యాపార సంస్థలు ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. తమ ఎక్స్చేంజ్ ఆన్లైన్, ఈమెయిల్ సేవలతో అనుసంధానమై ఉన్న అనేక రకాల మైక్రోసాఫ్ట్ 365 సేవలకు ఈ అంతరాయం ఆటంకం కలిగిస్తున్నదని మైక్రోసాఫ్ట్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అవుట్‌లుక్, టీమ్స్, ఏఐ అసిస్టెంట్ కోపైలట్ వంటి సేవలు నిలిచిపోయినట్టు వినియోగదారులు తెలిపారు.
ప్రపంచవ్యాప్త మైక్రోసాఫ్ట్ అంతరాయం భారత్‌లోని విమానయాన రంగాన్ని కూడా తాకింది. ఇండిగో, ఎయిర్ ఇండియా తమ కస్టమర్ సపోర్ట్ సిస్టమ్‌లపై దాని ప్రభావం గురించి వేర్వేరుగా అప్డేట్లను జారీ చేశాయి. తక్షణ సహాయం కోరుకునేవారు విమానయాన సంస్థ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఈ స్కైని సంప్రదించాలని ఇండిగో సూచించింది. ఎయిర్ ఇండియా భిన్నమైన పరిస్థితిని పేర్కొంది. ఈ అంతరాయం తమ విమాన సర్వీసులను గానీ వినియోగదారుల సమాచార మార్గాలను గానీ ప్రభావితం చేయలేదని తెలిపింది. వచ్చే సందేశాలు కోల్పోకుండా ఉండేందుకు ఎయిర్ ఇండియా తన ఈమెయిల్ ట్రాఫిక్‌ను కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించింది.
ఆర్థిక సేవల రంగం
మైక్రోసాఫ్ట్‌కు ఏర్పడిన సమస్య భారతదేశ ఆర్థిక సేవల రంగం అంతటా పనులకు అంతరాయం కలిగించింది. దీంతో ఉద్యోగులు పరిశోధన నివేదికలను పొందడంలో, క్లయింట్లతో కాల్స్ నిర్వహించడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈక్విటీ మార్కెట్లలో పనిచేసే వ్యక్తులు తమ మార్కెట్ నిర్ణయాలకు ముఖ్యమైన ఉదయం సమావేశాలకు ముందు రోజువారీ పరిశోధనా నివేదికలను పొందలేకపోతున్నామని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ అంతరాయం పలు దేశాల్లోని ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రజా సంస్థలను కూడా ప్రభావితం చేసింది. ఆస్ట్రేలియా నిఘా, ఫెడరల్ పోలీసు ఏజెన్సీలు ఈమెయిల్‌కు సంబంధించిన సమస్యలనుధ్రువీకరించాయి.
అయితే దీని ప్రభావం పరిమితంగా ఉందని అధికారులు తెలిపారు.ఈ సమస్య ప్రధానంగా ఈమెయిల్ వ్యవస్థలకు సంబంధించిందని ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ అధిపతి మైక్ బర్గెస్ అన్నారు. జపాన్ ప్రభుత్వం కూడా తమ ఉమ్మడి ఐఈటీ ప్లాట్‌ఫామ్‌కు అంతరాయం ఏర్పడినట్టు పేర్కొంది. అయితే ప్రభుత్వ ఏజెన్సీలకు టెలిఫోన్, చాట్ సాధనాలు, టెక్ట్స్ సందేశాలతో సహా ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ మార్గాలు ఉన్నాయని, వాటి ద్వారా వారి కార్యకలాపాలు కొనసాగడానికి వీలవుతుందని డిజిటల్ మంత్రి తోషిహారు పురుకావా తెలిపారు. సింగపూర్‌లో కొన్ని ప్రభుత్వ వ్యవస్థలు ప్రభావితమయ్యాయి అధికారులు తెలిపారు. ఫిలిప్పీన్స్ సుప్రీంకోర్టు ఈమెయిల్స్, ఇతర లావాదేవీలకు ప్రతిస్పందనలు ఆలస్యం కావచ్చని హెచ్చరించింది.
ఏఐ కంపెనీలపై ప్రభావం
ఈ అంతరాయం ఏఐ కంపెనీలపై కూడా ప్రభావం చూపింది. మైక్రోసాఫ్ట్ సేవలతో ఉన్న అనుసంధానాల్లో తలెత్తిన సమస్యను పరిశీలిస్తున్నట్టు ఓపెన్ఏఐ పేర్కొంది. దీనివల్ల కొన్ని సాధనాలు ఆశించిన విధంగా పనిచేయలేదు. అలాగే, మైక్రోసాఫ్ట్ 365తో ఉన్న అనుసంధానాలకు సంబంధించి సమస్యలు ఉన్నాయని, ఆప్థ్రోపిక్ కూడా గుర్తించింది. మైమ్కాస్ట్కు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుడు నిక్కీ చూ మాట్లాడుతూ వ్యాపారులు ఒకే టెక్నాలజీ ప్రొవైడర్‌పై పూర్తిగా ఎందుకు ఆధారపడకూడదో అ సంఘటన స్పష్టం చేసిందని అన్నారు.
ఇలాఉండగా ఈ అంతరాయం మైక్రోసాఫ్ట్ పునరుద్ధరణ ప్రయత్నాలపై ఒత్తిడిని పెంచింది. ప్రభావిత ప్రాంతాల్లో కంపెనీ ఇంకా స్థిరమైన పునరుద్ధరణను సాధించలేదు. అవుట్‌లుక్, టీమ్స్, కోపైలట్‌తో సహా దాని సేవలు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ సంఘటనకు అన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్‌లోడ్ కారణమని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. సర్వర్ పనితీరును అంచనా వేయడం, పరిష్కారాలు సరిగ్గా నిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయడం కొనసాగిస్తున్నట్టు తెలిపింది. ఈ అంతరాయం గణనీయ స్థాయిలో ఉంది. అవుట్‌లుక్ సమస్యలకు సంబంధించి దాదాపు 1.40 లక్షల ఫిర్యాదు అందినట్టు డైన్డిటెక్టర్ నమోదు చేసింది. కనీసం 74 దేశాలు, భూభాగాల నుంచి కూడా ఇటువంటి ఫిర్యాదులు అందాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

