కేసీఆర్‌ది పరిష్కారం.. కాంగ్రెస్‌ది పలాయనం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2015లో నైరుతి రుతుపవనాల వల్ల వర్షపాతంలో 15 శాతం లోటు ఏర్పడగా, ఈశాన్య రుతుపవనాల సమయంలో ఏకంగా 76 శాతం వర్షపాతం తగ్గింది.
పరిపాలన అంటే సంక్షోభాన్ని ఎదుర్కోవడమే కానీ… బాధ్యతల నుంచి తప్పుకోవడం కాదు. కాలం కలిసివచ్చి వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు కాదు… ప్రజలు కష్టాల్లో, అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడే పాలకుల నాయకత్వ పటిమ బయటపడుతుంది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునేది నికరమైన చర్యలు, క్షేత్రస్థాయిలో కనిపించే నాయకత్వం, సర్కార్ తమను ఆదుకుంటుందనే బలమైన భరోసా.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను నిందించడమే ఏకైక రాజకీయ వ్యూహంగా మార్చుకున్నట్టు కనిపిస్తున్నది. కానీ 201516 నాటి ఎల్ నినో కరవు రాష్ర్టాన్ని కుదిపేసినప్పుడు… కేసీఆర్ ప్రభుత్వం వనరులను సమకూర్చుకోవడం, ప్రజల జీవనోపాధిని కాపాడటం, వారిలో భరోసా నింపింది. సమస్యను పరిష్కారించడాన్నే అప్పటి ప్రభుత్వం అసలైన సవాల్‌గా భావించింది. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలకులపై నిందలు వేస్తూ బాధ్యతల నుంచి పారిపోతున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2015లో నైరుతి రుతుపవనాల వల్ల వర్షపాతంలో 15 శాతం లోటు ఏర్పడగా, ఈశాన్య రుతుపవనాల సమయంలో ఏకంగా 76 శాతం వర్షపాతం తగ్గింది. భూగర్భ జలమట్టాలు సగటున 2.78 మీటర్ల మేర పడిపోవడంతో తాగునీటి సరఫరా, వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. 2015 నవంబర్ 24న రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ జారీ చేసిన జీవో నంబర్ 6 ద్వారా ప్రభుత్వం ఏడు జిల్లాల పరిధిలోని 231 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది.
(మహబూబ్‌నగర్ (64), మెదక్ (46), నిజామాబాద్ (36), రంగారెడ్డి (33), నల్గొండ (33), వరంగల్ (22), కరీంనగర్ (19)). నాటి సంక్షోభం ఎంత తీవ్రంగా ఉన్నదో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. తాగునీరు, వ్యవసాయోత్పత్తి, గ్రామీణ జీవనోపాధి, ఈ మూడింటిపై ఒకేసారి తీవ్రమైన ఒత్తిడి పడింది. కరవు దానంతట అదే తగ్గుముఖం పట్టే వరకు కాలయాపన చేయకుండా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన కదిలింది. కేసీఆర్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
స్థానిక కార్యాచరణ- గడప వద్దకే నీరు
ప్రజలు గుక్కెడు నీటికి తల్లడిల్లకుండా చూడటమే అప్పట్లో తక్షణ కర్తవ్యమైంది. ఉన్న నీటి వనరులు సరిపోని చోట తాత్కాలిక ఏర్పాట్లతో ఆ లోటును భర్తీ చేయాల్సి వచ్చింది. 2015 జూన్ 15న రెవెన్యూశాఖ జారీ చేసిన జీవో నంబర్ 2 కింద అత్యవసర కరవు సహాయక చర్యల కోసం జిల్లా కలెక్టర్ల వద్ద రూ.55 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ను ప్రభుత్వం అందుబాటులో పెట్టింది. దీనికి అదనంగా గ్రామీణ నీటి సరఫరా, పట్టణ స్థానిక సంస్థల ద్వారా రూ.100 కోట్లకు పైగా ఆకస్మిక నిధులను కేటాయించింది. ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకోవడం, వాటర్ ట్యాంకర్లను నడపడం, పాత మోటార్ల మరమ్మతులు, గొట్టపు బావులను లోతు చేయడం, అత్యవసరంగా హెచ్డీపీఈ పైపులైన్లు వేసే అధికారాలను జిల్లా యంత్రాంగాలకు అప్పగించింది.
ప్రభుత్వ వనరులు చాలని చోట ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకోవడం ఒక ఆచరణాత్మకమైన మార్గంగా నిలిచింది. శాశ్వత ఏర్పాట్లు పూర్తయ్యేలోపు అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కనూ ఒడిసిపట్టేందుకు ఇది తోడ్పడింది. ఈ చర్యలన్నీ క్షేత్రస్థాయికి అనుగుణంగా సాగాయి. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నప్పుడు భారీ సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు ప్రభుత్వం వేచి చూడలేదు. తక్షణమే అందుబాటులో ఉన్న నీటి వనరులు, రవాణా సౌకర్యం, బాగుచేసిన పంపులు, నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న అధికారుల ద్వారా సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేసింది. అధికార వికేంద్రీకరణ ప్రాధాన్యతను కూడా ఈ చర్యలు చాటిచెప్పాయి.
ఎక్కడ కొరత ఉన్నదో గుర్తించి, వనరులను సమీకరించి, స్థానిక అవసరాలకు తగినట్టుగా నీటిని అందించే బాధ్యతను కలెక్టర్లు, స్థానిక సంస్థలే సమర్థవంతంగా భుజానికెత్తుకున్నాయి. బోర్లు వేయడం, ట్యాంకర్లు నడపడంతో ఆ విపత్తు పెను సంక్షోభంగా మారకుండా కేసీఆర్ ప్రభుత్వం అదుపు చేసింది. పాలన అంటే అలాగే ఉండాలి. నేటి కష్టాన్ని తీర్చే తక్షణ ఉపశమనం అందించాలి, రేపటి ముప్పును తప్పించే మౌలిక వసతులనూ నిర్మించాలి. కరువు సమయంలో మహానగరం హైదరాబాద్‌కు తాగునీటి భద్రత కల్పించడం పెను సవాల్‌గా మారింది. నగరం తన పరిధి దాటి వెలుపలి వనరులపై ఆధారపడి ఉండటంతో, నిరంతరాయ నీటి సరఫరా అత్యంత ఆవశ్యకమైంది.
శ్రీపాద ఎల్లంపల్లి బరాజ్ ఆధారంగా చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్టును కేసీఆర్ స్వయంగా 2015 నవంబర్ 2425 తేదీల్లో ఘన్పూర్, శామీర్‌పేట వద్ద ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. వివిధ దశల్లో ఈ పథకం ద్వారా నగరానికి రోజుకు దాదాపు 86 నుంచి 172 మిలియన్ గ్యాలన్ల నీరు అందింది. నగర అవసరాల కోసం నాగార్జునసాగర్, అక్కంపల్లి రిజర్వాయర్ల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు అత్యవసర ఏర్పాట్లు చేశారు. జిల్లాల్లోనూ అక్కడి జలవనరులకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
అన్నదాతకు కొండంత అండ
కరవు ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రం గా పడింది. సంక్షోభంలో ఉన్న రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేసింది. 2014 ఆగస్టు 13న వ్యవసాయ శాఖ విడుదల చేసిన జీవో నంబర్ 69 ప్రకారం వ్యవసాయ రుణమాఫీ రెండో విడత కింద సుమారు రూ.2,019 కోట్లను విడుదల చేసింది. వ్యవసాయానికి నాణ్యమైన 9 గంటల ఉచిత త్రీ-ఫేజ్ విద్యుత్తును నిరంతరాయంగా అందించింది.
వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా పప్పుధాన్యాలు, సజ్జలు, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి స్వల్పకాలిక ప్రత్యామ్నాయ పంటల సాగును రాయితీలతో ప్రోత్సహించింది. గ్రామీణ ఉపాధిని నిలబెట్టే చర్యలు వీటికి తోడయ్యాయి. 2015 సెప్టెంబర్ 14న గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించిన వెసులుబాటుతో, కరవు ప్రాంతాల్లో ఉపాధి హామీ పనిదినాలను 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచారు. వర్షాలు కురవకపోతే వచ్చే నష్టాన్ని ఏ ఒక్క పథకమూ పూర్తిగా నివారించలేదు. కానీ రుణ విముక్తి, వ్యవసాయ విద్యుత్తు, ప్రత్యామ్నాయ పంటలు, అదనపు ఉపాధి కల్పన వంటి చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో సంక్షోభ తీవ్రతను భారీగా తగ్గించాయి.
పల్లె జీవనోపాధికి ఊతం
తీవ్రమైన కరువు పశుగ్రాసం, తాగునీటి కొరతను తెచ్చిపెట్టి పశు సంపదను దెబ్బతీస్తుంది. గ్రామీణ కుటుంబాలకు పాడి పశువులు, గొర్రెలు కేవలం జీవాలు మాత్రమే కాదు. అవి వారి ఆర్థిక భద్రత, స్థిరమైన ఆదాయ వనరులు. ఆ విపత్తు నుంచి కాపాడేందుకు కరువు మండలాల్లో 50 శాతం రాయితీతో మండల కేంద్రానికి 50 మెట్రిక్ టన్నుల చొప్పున ప్రభుత్వం పశుగ్రాసం సరఫరా చేసింది. 490 మెట్రిక్ టన్నులకు పైగా పచ్చిగడ్డి మూటలు, పశుగ్రాస విత్తనాలను పంపిణీ చేయడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మూగజీవాల దాహం తీర్చేందుకు నీటి తొట్లు ఏర్పాటు చేసింది. ఎంట్రోటాక్సిమియా, గొర్రె అమ్మవారు, గాలికుంటు వ్యాధులు ప్రబలకుండా విస్తృతంగా టీకాలు వేయించింది. పశువుల సంతల్లో అమ్మకాలు, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది.
తక్షణ సాయం.. శాశ్వత భద్రత
కరువు సమయంలో ప్రభుత్వం చేపట్టే తక్షణ ఉపశమన చర్యలు సంక్షోభాన్ని అప్పటికప్పుడు గట్టెక్కిస్తాయి. కానీ మళ్లీ మళ్లీ వచ్చే నీటి ఎద్దడిని నివారించాలంటే వ్యవస్థాగత మార్పులు అవసరం. స్థానిక జలవనరుల పునరుద్ధరణ, నిల్వ సామర్థ్యం పెంపు, తాగునీటి మౌలిక వసతుల పటిష్టత ఎంత అవసరమో ఈ కరవు ఎలుగెత్తి చాటింది. 2015 మార్చి 13న నీటిపారుదల శాఖ విడుదల చేసిన జీవో నంబర్ 44 ద్వారా ప్రభుత్వం మిషన్ కాకతీయ’ను చేపట్టింది.
మొదటి విడతలోనే 9,306 చెరువుల పునరుద్ధరణ చేపట్టి, సంప్రదాయ జలవనరులను కాపాడుతూ వాటి నిల్వ, ఆయకట్టు సామర్థ్యాన్ని పెంచింది. ఇంటింటికీ తాగునీటిని అందించే లక్ష్యంతో కేసీఆర్ 2016 ఆగస్టు 7న మెదక్ వేదికగా ప్రతిష్ఠాత్మక ‘మిషన్ భగీరథ’కు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా శుద్ధి చేసిన సురక్షిత జలాలను అందించేందుకు ప్రభుత్వం సుమారు 1.3 లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను రూపొందించింది. 2016 మార్చి 8న మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రక సాగునీటి ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ప్రాణహిత, గోదావరి నదుల సంగమ ప్రదేశానికి దిగువన మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం హెడ్ వర్క్స్‌ను రీడిజైన్ చేసి పనులు చేపట్టింది. సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కొని, అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించి, తమ సమస్యలు తీరుతాయన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించగలగడమే నిజమైన నాయకత్వం.
యంత్రాంగం నిరంతరం పనిచేస్తున్నదని, వనరులను సమీకరిస్తున్నదని, పరిష్కారాలు దొరుకుతాయని భరోసా ఇవ్వడమే నాయకత్వ లక్షణం. అనిశ్చితిని నిరాశగా మారనివ్వకుండా కష్టాన్ని ఎదిరించి నిలబడటమే అసలైన పాలన. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సరిగ్గా ఇదే గీటురాయిపై నిలబడి తమ పనితీరును నిరూపించుకోవాలి.
కాంగ్రెస్‌కు నీరు, విద్యుత్తు రంగాల్లో అద్భుతమైన మౌలిక వసతులున్న రాష్ట్రం వారసత్వంగా దక్కింది. అంతకంటే మెరుగైన ఫలితాలను అందించడమే ఈ ప్రభుత్వ బాధ్యత. ఇంకా ఎన్నికల ప్రచార తరహాలో గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ కాలం వెళ్లదీస్తామంటే కుదరదు. కేసీఆర్ ఆనాడు సంక్షోభాన్ని ఎదుర్కొని, తక్షణ, దీర్ఘకాలిక చర్యల ద్వారా ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.
ఇప్పుడు కాంగ్రెస్ కూడా ప్రజలు నేడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. కేసీఆర్‌ను నిందించినంత మాత్రాన కరువుతో ఎండిన బోరు బావిలో నీళ్లు ఊరవు, పల్లెకు తాగునీరు రాదు, అన్నదాత చేను తడువదు, పల్లె జనం పొట్ట నిండదు. అంతులేని రాజకీయ వాగ్వాదాలు ప్రజలకు అక్కర్లేదు. తమ కోసం నిజాయితీగా పనిచేసే చర్యలే కావాలి. ప్రజలకు కావాల్సింది పరిష్కారాలే తప్ప… సాకులు, నిందారోపణలు, బాధ్యతను తప్పించుకునే దాటవేతలు ఎంతమాత్రం కాదు.
– పెండ్యాల మంగళాదేవి
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

