‘ఓ అయ్యా… జర నీ దయ. మోస్కచ్చేటందుకు నీన్లేనా? బరువున్న బకీట్లు అమాంతం మోస్కరావద్దని నీకెన్నిమాట్ల చెప్పాలె? నేన్ చెప్తనే ఉంటా, నువ్వు చేసేది చేస్తనే ఉంటవ్..’ అని గద్మాయిస్తున్నది గంగవ్వ. పొద్దటిసంది మలెవడి ఉన్న చాయ్ గిలాసలు కడుగాల్నంటే నీళ్లు కావాలె గదా? గిలాసలు కడుగుదామని బోరింగ్ కాడికి వోయి నీళ్ల బకీట్లు మోసుకొస్తున్న. అది జూసిన గంగవ్వ గరం గరమై గాయికెత్తుకుంటున్నది. గంగవ్వ ఉత్తగనే మొత్తుకుంటలేదు, మిషిన్ ఎక్కడ ఆగిపోతదోనని ఆమె బాధ. ఈ మిషిన్ ముచ్చట తర్వాత జెప్త గనీ గంగవ్వ ఎవ్వలో ఎర్కేనా? నేను తాళి గట్టిన ఆలి. జైతాల జిల్లా గొల్లపల్లి మండలం తిర్మలాపూర్ చౌరస్తా మూల మీన ఉంటది మా చాయ్ ఓటల్. మాదిదే ఊరు. ఇద్దరాలుమొగలం గల్సి చాయ్ ఓటల్ వెట్టుకొని తలో సార్గం జేస్కుంటున్నం. అల్కటి పనులు నేన్జేస్తే, గొట్టు పనులు నా గంగవ్వ జేస్తది.
మేమిద్దరం, మాకు ముగ్గురు. మాకున్నది ఎకురం భూమి. ఆ భూమిల ఏమంత పండుతయ్? అందుకే ఆ భూమిని గంగవ్వను జూస్కొమ్మని చెప్పి నేను ఖతార్ తొవ్వ వట్టిన. 1992ల అనుకుంట జైతాలల పట్నం బస్సు, పట్నంల గాలిమోటరెక్కి, దూరదేశంల దిగిన. ఒక్కేడా, రెండేండ్లా? ఇరువై ఐదేండ్లు అక్కన్నే పన్జేసిన. మొదట్ల లేబర్ పనికే వోయిన గనీ, కొన్నొద్దుల తర్వాత డ్రైవర్ పని దొరికింది. ఆ తర్వాత కొన్నొద్దులకు క్రేన్ నడిపే పనికి కుదిరిన. ఓ రోజు పనైపోయి ఇంటికివోయినంక నాత్రి ఎడమ జబ్బ గుంజుకొస్తున్నది. ఉత్త నొప్పే గావొచ్చునని ఎక్వ పట్టిచ్కోలె. తెల్లారి డూటికి ఎప్పట్లెక్కనే వోయిన. డూటెక్కి డ్రైవర్ సీటు మీన గూసున్న. గంతే.. కండ్లకు శిమ్మ శీకట్లచ్చి కూసున్న కుర్సీలనే కూలవడ్డ. ‘అరేయ్ పోశమల్లన్నకు ఏమో అయిందిరా.. పట్టుర్రి దావఖానకేస్కవోదాం’ అని అమాంతం లేవట్టిర్రు. వాళ్ల మాటలు నాకినవడ్తున్నయి గనీ, నిల్సొని మాట్లాడే ఓసర లేదు.
కండ్లు దెర్సి జూస్తే… తెల్లారి ఖతార్‌లోని ఓ దావఖాన్ల నేను షరీఖై ఉన్న. ‘నాకేమైంద’ని మా ఊరి దోస్తులనడిగితే వాళ్లు శెప్పవట్టిర్రు నాకు ఆటోటాక్ అచ్చిందని. స్టంట్లు గూడ ఏసిర్రట. ‘ఇది మొదటిసారే, ఏం గాదు గనీ, కొంచెం జాగ్గర్తగుండాల’ని డాక్టర్లు శెప్పవట్టిర్రు. అక్కడ జరిగిన ముచ్చట తిర్మలాపూర్ల ఉన్న గంగవ్వకెట్ల ఎర్కయిందో ఏమో గని.. జుమ్మ రోజు ఇంటికి పోన్జేస్తే ఒక్కటే మొకాన ఏడ్వవట్టింది. ‘అర్రె నాకేం గాలెదే.. శెక్కరొచ్చి కిందవడ్డ గంతే’ అన్జెప్పినా నమ్మలే. ‘మాకు మొత్తం ఎర్కే గని, నువ్వైతే ముందుగాళ్ల ఇంటికిరా’ అని బతిలాడవట్టింది. ఆమె ఒక్కతే గాదు, బిడ్డ, ఇద్దరు కొడుకులు గూడ అదే మంకుపట్టు వట్టిర్రు. వాళ్ల మాట తీసెయ్యలేక ఇండియాకొచ్చిన. ఎయిర్‌పోర్టుల ఇమానం దిగి ఇట్ల బైటికచ్చిన్నో లేదో.. మావోళ్లు నా మీదవడి ఒగేడ్సుడు గాదు. వాళ్లేడ్పు జూసి నా కండ్లు గూడ ధైర్నం శెడ్డయి.
అసలే గొల్లోళ్లం. ఉంటే గింటే గొర్లమందలుంటయి గని, అయ్యవ్వలు, తాతముత్తాతలు సంపాయించిన ఆస్తిపాస్తులుంటయా? కమ్సెకం మాకా గొర్లు గూడ లెవ్వు. ఎకురం భూమిల ఎంత పండించినా ఎన్కకే గని, ముందుకు వోవుడుంటదా? గందుకే ఓ ఇకమత్ జేసి మా తిర్మలాపూర్ చౌరస్తా మూలమీన చాయ్ ఓటల్ వెట్టినం. పొద్దటిపూట తడట్కులు, ఇడ్లి, వడ, పూరి.. మాపటి పూట చాయ్ అమ్ముకుంటా బతుకు ఎల్లదీస్తున్నం. 2018ల అనుకుంటా… ఓ రోజు మబ్బుల్నే నేను, గంగవ్వ ఇద్దరం గల్సి ఓటల్ కాడికొచ్చినం. నేను టిఫిన్లు జేస్తున్న, గంగవ్వనేమో అన్లకు సామాన్లు అందిస్తున్నది.
ఆ ఆటోటాక్ పాడుగాను మల్లొచ్చి పాడైంది. ఎడమదిక్కు గుంజుకొస్తున్నదని గంగవ్వకు జెప్పంగనే జెల్ది ఆటో మాట్లాడింది. ఆ ఆటో సీద వోయి కన్నారం అపోలో రీచ్ దావఖాన కాడ ఆగింది. నాకు పరీచ్చలు జేసి మల్లోపారి స్టంట్లెయ్యాల్నని శెప్పవట్టిర్రు. ‘పైసలకేడ వోవుడు సార్.. సక్కగ నన్ను సర్కార్ దావఖానకు పంపియ్యిర్రి’ అంటే.. ‘ఎందుకే పోశమల్లన్న ఇన్లగూడ ఫిరీగనే జేస్తం’ అని శెప్పవట్టిర్రు డాక్టర్లు. ‘అదేందనడిగితే మీకు తెల్లరేషన్ కార్డుంటే ఐపాయె.. నీకయ్యే దావఖాన కర్సు మొత్తం కేసీఆరే వెట్టుకుంటడని ఇమ్మతిచ్చిన్రు. వాళ్లన్నట్టే నాకు రూపాయి కర్సు గాలె. అంతేగాదు ఏడాది పాటు మందులు గూడ ఉచితంగనే ఇచ్చిన్రు.
పది రోజుల తర్వాత దావఖాన్లకెళ్లి ఇంటికొచ్చిన. నెలా, రెణ్నెళ్లు గంగవ్వొక్కతే ఓటల్ నడిపింది. కొన్నొద్దులకు నేను ఓటల్కు వోక తప్పలేదు. అప్పట్నుంచి ఓ నాలుగైదేండ్ల దాన్క మంచిగనే పన్జేసుకున్న. 2024 జనవరిల అనుకుంట.. కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చినంక నాకు మళ్లోపారి ఆటోటాక్ అచ్చింది. అప్పుడు గూడ అపోలో దావఖాన్లకే ఏస్కచ్చిర్రు. ఈ సారి అక్కడి డాక్టర్లు నన్ను శేతవట్టలె. ‘కండిషన్ కొంచెం మంచిగలేదు, జల్ది పట్నం పట్కపోవాల’న్నరు. గంగవ్వ, నా ఇద్దరు కొడుకులు అప్పటికప్పుడు అంబులెన్స్ మాట్లాడుకొని పట్నంల ఉన్న ఓ ప్రైవేటు దావఖానకేస్కచ్చిన్రు.
ఈ సారి గుండె మొత్తానికే కరాబైందన్నరు అక్కడి డాక్టర్లు. అగ్గొ గుండె కరాబైతే మనిషెట్ల బతుకుతడనుకుంటున్నరా? మనుషుల్ని నడిపిచ్చేదాన్కి ఇప్పుడు మర యంత్రాలొస్తున్నయి గదా? గట్లనే నా గుండె పక్కపొంటి ఓ మిషన్ వెట్టిర్రు పట్నం డాక్టర్లు. కనీ, దానికి 12 లచ్చల రూపాల కర్సయింది. ‘ఏ కర్సు గురించి బాధపడకే పోశమల్లన్న, మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నద’ని భరోసా ఇచ్చిండు నన్ను సూసేటందుకు దావఖానకొచ్చిన ఓ కాంగ్రెస్ నాయకుడు. పర్లేదని మన్సులనుకున్న. ‘దావఖాన బిల్లులు తెచ్చి నాకియ్యి. సీఎంఆర్ఎఫ్ కింద నీకు 12 లచ్చల రూపాలు ఇప్పిస్తా’ అని తిర్మలాపూర్‌కు వోయిండు.
పట్నంల ఆప్రీషనై ఆర్నెళ్లయితున్నది. నేను ఓటళ్ల చాయ్ జేస్తున్న. నా ఫోన్ రింగయ్యింది. ఎవ్వలా అని ఎత్తి ‘హలో’ అన్న. ‘నేను ఎమ్మెల్యే ఆఫీసులకెళ్లి మాట్లాడుతున్న, మాట్లాడేది జెల్ల పోశమల్లన్ననేనా?’ అని అడుగవట్టింది ఔతలామె. నాకు తెగ సంబురమై ‘చెప్పు మేడం’ అంటే.. ‘మీకు సీఎంఆర్ఎఫ్ కింద అరవై వేల రూపాలొచ్చినయి’ అన్జెప్పింది ఆ మేడం. నాకొక్కసారి మిషన్ ఆగిపోయినంత పనైంది. ‘అద్దవ్వా మీ పైసల్. 12 లచ్చ ల రూపాలు కర్సయితే, మీరిచ్చేది అర వై వేలా? మీరిచ్చే పైసలు మిత్తికే సాల యి, అవి మీరే ఉంచుకోర్రిగ’ అని ఫోన్ కట్జేసిన. మా గంగవ్వ పక్కపొంటే ఉన్న ది. ‘ఏమైందుల్లా గంతగనం కోపానికొస్తున్నవ్’ అని అడుగవట్టింది. పాపం గంగవ్వ బాధ గంగవ్వది.
– గడ్డం సతీష్,99590 59041