గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్-2026 ప్రకారం, 145 దేశాల మిలటరీ పవర్ ఆధార జాబితాలో భారత్ 4వ స్థానం దక్కించుకున్నది. రక్షణశాఖలో సుశిక్షితులైన త్రివిధ బలగాల సంఖ్య, అణ్వాయుధ సామర్థ్యం, స్వదేశీ ఆయుధ పరిజ్ఞానం, అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తి, సహజ భౌగోళిక స్థానం, లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ సామర్థ్యం, అందుబాటులో ఉన్న విలువైన సహజ వనరులు లాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్-2025ను రూపొందించారు. నేడు అమెరికా, రష్యా, చైనా తర్వాత తనదైన 4వ అత్యంత బలమైన శక్తిగల భద్రతా వ్యవస్థ మన భారత్ నిలువగా ఇతర స్థానాల్లో సౌత్ కొరియా, యూకే, ఫ్రాన్స్, జపాన్, టర్కీ, ఇటలీ దేశాలు తొలి 10 స్థానాలను ఆక్రమించాయి. మన రక్షణశాఖలో ఆధునిక టెక్నలాజికల్ ఇన్నొవేషన్లు, సైబర్ వార్ఫేర్ సామర్థ్యం, గ్లోబల్ అలయన్స్ లాంటివని నేడు ఆయా దేశాల రక్షణ దళాల బలానికి కారణం అవుతున్నాయి.
అతి తక్కువ మిలటరీ సగటు వయస్సు కలిగిన దేశంగా భారత్ ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. అత్యంత బలమైన ఆర్మీ, దేశ అధిక జనాభా, సాయుధ వాహనాలు, రహదారులు, బొగ్గు ఉత్పత్తి, లేబర్ ఫోర్స్ లాంటి వనరులు అత్యధికంగా కలిగిన 2వ దేశంగా భారత్ నిలబడింది. అత్యంత శక్తిమంతమైన రక్షణ వ్యవస్థ కలిగిన 4వ దేశంగా భారత్ ధైర్యంగా నిలబడింది. మొబైల్ ఆర్టిలరీ ఫీల్డ్ గన్స్, నావల్ ఏయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఫ్లీట్ బలం, పర్చేజ్ పవర్ పారిటీల్లో 3వ స్థానంలో ఉన్నది. మొత్తం మిలటరీ ఏయిర్ క్రాఫ్టులు, ఫైటర్ ఏయిర్ క్రాఫ్టులు, ట్రాన్స్పోర్ట్ ఏయిర్ క్రాఫ్టులు, హెలికాప్టర్లు, నావల్ వార్షిప్ డిస్ట్రాయర్లు, టోటల్ రైల్వే కవరేజ్ రంగాల్లో ప్రపంచ దేశాల్లో 4వ స్థానంలో ఉన్నది మన భారతం.
భారత ఆర్మీలో 21 లక్షల సైనికులు/సిబ్బంది, ఏయిర్ ఫోర్స్ 2 లక్షలు, నానికా దళంలో 1.42 లక్షల వీర సైనికులు ఉన్నారు. భారత అమ్ములపొదిలో 5000 కిలో మీటర్ రేంజ్ కలిగిన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్, సబ్మెరైన్ బాలిస్టిక్ మిసైల్స్, ఏయిర్-లాంచ్ క్రూజ్ మిసైల్స్, అత్యంత బలమైన అగ్ని-5 మిసైల్స్ లాంటివి మన దేశ రక్షణ బలాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. మన మిసైల్స్ వ్యవస్థలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్స్, 5వ తరం అస్ర్తా ఏయిర్ టు ఏయిర్ మిసైల్స్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఏయిర్ ఆకాశ్ మిసైల్స్ లాంటివి భారత రక్షణ శక్తిని మరింత పెంచుతున్నాయి. మన వైమానిక దళంలో ఏయిర్ టు ఏయిర్/ఏయిర్ టు సర్ఫేస్ సుఖోయ్ ఫైటర్ ఏయిర్ క్రాఫ్టులు, 300 కిలో మీటర్ల రేంజ్ కలిగిన రాఫేల్ ఫైటర్ జెట్లు మన వైమానిక భద్రతకు రక్షణ కల్పిస్తున్నాయి. భారత నావికాదళంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, ఐఎన్ఎస్ కోల్కతా డిస్ట్రాయర్, అత్యాధునిక హెవీవెయిట్ వరుణాస్త్ర టార్పెడో లాంటివి సముద్ర దళం చేతుల్లో ఉన్నాయి. మన త్రివిధ దళాల బలాలు, బలగాలు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలవని రుజువు చేస్తున్నాయి.